రాజీనామాలు వలంటీర్ల వ్యక్తిగతం | Sakshi
Sakshi News home page

రాజీనామాలు వలంటీర్ల వ్యక్తిగతం

Published Thu, Apr 25 2024 4:19 PM

Resignations are personal to volunteers says high court  - Sakshi

 వారి రాజీనామాలను ఆమోదించకుండా ఆదేశాలివ్వడం సాధ్యం కాదు

పోస్టులో ఉన్నంత వరకే వలంటీర్లపై మాకు అధికారం

రాజీనామా తరువాత ప్రైవేటు వ్యక్తులు అవుతారు

నచ్చిన విధంగా ఉండే స్వేచ్ఛ వారికి ఉంది

హైకోర్టుకు నివేదించిన కేంద్ర ఎన్నికల సంఘం

 పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలన్న హైకోర్టు

తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా

సాక్షి, అమరావతి: రాజీనామాలు వలంటీర్ల వ్యక్తిగత వ్యవహారమని, అందువల్ల వారి రాజీనామాలను ఆమోదించకుండా తాము ఆదేశాలివ్వడం సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం హైకోర్టుకు నివేదించింది. రాజీనామా చేయడానికి వీల్లేదని నియామక నిబంధనల్లో ఉంటే తప్ప ఎవ్వ­రి­నీ రాజీనామా చేయవద్దంటూ ఆదేశాలు ఇవ్వలే­మ­ని ఎన్నికల సంఘం తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాష్‌ దేశాయ్‌ వివరించారు.

వలంటీర్‌ పోస్టులో ఉన్నంత వరకే వారిపై తమకు అధికారం ఉంటుందని స్పష్టం చేశారు. రాజీనామాల తరువాత వలంటీర్లు ప్రైవేటు వ్యక్తులు అవుతారని, నచ్చిన విధంగా ఉండే స్వేచ్ఛ వారికి ఉందని వివరించారు. పిటిషనర్‌ అభ్యర్థన చాలా విచిత్రంగా ఉందని, వలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వాన్ని తాము ఆదేశించాలని కోరుతున్నారని, ఆ పని తామెలా చేయగలమని ప్రశ్నించారు.

ఈ వివరాలన్నింటితో కౌంటర్‌ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నెల 22 వరకు 62,571 మంది వలంటీర్లు రాజీనామా చేశారు
ఎన్నికలు పూర్తయ్యేంత వరకు వలంటీర్ల రాజీనా­మా­లను ఆమోదించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించా­ల­ని కోరుతూ భారత చైతన్య యువజన పార్టీ అధ్య­క్షుడు బోడే రామచంద్ర యాదవ్‌ హైకోర్టులో దాఖ­లు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణమోహన్‌ బుధవారం మరోసారి విచారణ జరిపా­రు. కేంద్ర ఎన్నికల సంఘం తరఫున అవినాష్‌ దేశాయ్‌ వాదన­లు వినిపిస్తూ.. గత నెల 18 నుంచి ఈ నెల 22వ తేదీ వరకు 62,571 మంది వలంటీర్లు రాజీనామా చేశారని తెలిపారు.

ఎన్నికల ప్రవర్తన నియమా­వళి­ని ఉల్లంఘించినందుకు 929 మంది వలంటీర్లను తొలగించామన్నారు. వలంటీర్లను ఎన్నికలకు దూ­రంగా ఉంచుతూ ఉత్తర్వులి­చ్చా­మని, పోలింగ్‌ ఏజెంట్లుగా వ్యవహరించకుండా సర్క్యులర్లు జారీ చేశామన్నారు. ఇప్పుడు వారి రాజీనామాలను ఆమో­­­దించకుండా ప్రభుత్వాన్ని తాము ఆదేశించాల­ని పిటిషనర్‌ కోరుతున్నారని, ఇదెలా సాధ్యమని అన్నారు.

ఇప్పుడు వలంటీర్లు ఖాళీగా ఉన్నారు
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్‌ వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వలంటీర్ల­కు ఎలాంటి పనులు అప్పగించలేద­న్నారు. వారు ఖాళీగా ఉన్నారని, అయినా వారికి గౌరవ వేతనం చెల్లిస్తూనే ఉన్నామ­న్నారు. దీని వల్ల ఖజానాపై భారం పడుతోందని వివరించారు.

పిటిషనర్‌ తరఫున న్యాయ­వాది పీవీజీ ఉమేష్‌ వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగంలోని అధికరణ 324 కింద ఎన్ని­కల సంఘం ఎలాంటి ఆదేశాలైనా ఇవ్వొచ్చ­న్నారు. వలంటీర్లు రాజీనామా చేసి అధికార పార్టీకి సహకరిస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement