ఉన్నది ఉన్నట్లుగా రాయండి  | Sakshi
Sakshi News home page

ఉన్నది ఉన్నట్లుగా రాయండి 

Published Tue, Sep 7 2021 5:22 AM

Sajjala Ramakrishna Reddy Comments With Journalists - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాయితీలు ఇస్తున్నందున తమకు సానుకూలంగా వార్తలు రాయాలని తాము కోరుకోవడం లేదని, ఉన్నది ఉన్నట్టుగా రిపోర్ట్‌ చేయాలని మాత్రమే కోరుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలన్నీ అర్హులైన జర్నలిస్టులకు అందాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని, నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరగదని పేర్కొన్నారు. నేషనల్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు సోమవారం ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ (ఏపీయూజేఎఫ్‌) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సజ్జల మాట్లాడారు. జర్నలిస్టులంటే గౌరవం ఉన్న ప్రభుత్వం ఇది అని తెలిపారు.

జర్నలిజంలోని నకిలీలను ఏరివేయాల్సి ఉందన్నారు. జర్నలిస్టులంటే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అపారమైన గౌరవ భావం ఉందన్నారు. జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మిడిల్‌ ఇన్‌కమ్‌ గ్రూపు (ఎంఐజీ)లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. దీనిపై త్వరలో విధివిధానాలను ప్రకటిస్తామన్నారు. జర్నలిస్టులకు ఆరోగ్యశ్రీ కింద వైద్య సౌకర్యం కల్పిస్తామని, ఇందులో ఏమైనా ఇబ్బందులు ఉంటే చక్కదిద్దుతామన్నారు. అంతకుముందు ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు జర్నలిస్టుల సమస్యలను ప్రస్తావించారు.   

Advertisement
Advertisement