Sakshi Interview On Deputy Collector Datla Keerthi - Sakshi
Sakshi News home page

Deputy Collector Datla Keerthi: సర్కారీ కొలువులు.. కీర్తికి సలాం

Published Sun, Jul 17 2022 8:08 AM

Sakshi Interview On Deputy Collector Datla Keerthi

సాక్షి ప్రతినిధి, విజయనగరం: విద్యాభ్యాసం నుంచి ఉద్యోగ బాధ్యతల వరకూ విజయనగరంతో ఆమెకు విడదీయలేని అనుబంధం... ఇటీవల వెలువడిన గ్రూప్‌–1 పరీక్షల్లో ఉత్తరాంధ్ర టాపర్‌గా నిలిచి విద్యల నగరానికి వన్నె తెచ్చారు. ఒకవైపు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిగా ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూనే సబ్‌కలెక్టర్‌ అవ్వాలనే తన కలను సాకారం చేసుకున్నారు. విసుగు లేకుండా 11 ఏళ్ల పాటు నిర్విరామ కృషితో రాష్ట్ర సర్వీసుల్లో ఉన్నత ఉద్యోగాన్ని సాధించి తన సత్తా చాటారు. యువతకు ఆదర్శంగా నిలిచారు. మెటీరియల్‌ సౌలభ్యం అంతగా లేకపోయినా గ్రూప్‌–1 వంటి పోటీపరీక్షల్లో భావవ్యక్తీకరణకు మాతృభాష తెలుగు తనకు కలిసిసొచ్చిందని సగర్వంగా చెబుతున్నారు దాట్ల కీర్తి. ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... 

టీచర్ల ఫ్యామిలీ మాది... 
మా స్వగ్రామం అనకాపల్లి జిల్లా మాకవారిపాలెం మండలంలోని రాజులనగరం. మా నాన్న దాట్ల జగన్నాథరాజు తొలుత ఎస్‌జీటీగా తర్వాత స్కూల్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగోన్నతి పొంది రిటైర్డ్‌ అయ్యారు. అమ్మ నిర్మల కూడా టీచరే. ప్రస్తుతం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో చోడపల్లి ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్‌గా పనిచేస్తున్నారు. నేను కూడా ఎమ్మెస్సీ, బీఈడీ చేసిన తర్వాత చిన్న వయసులోనే టీచర్‌ను అయ్యాను. అలా టీచర్ల ఫ్యామిలీ మాది. కానీ మా తాతగారు కోఆపరేటివ్‌ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసేవారు. ఆ సమయంలో గ్రామాల్లో ఆయనకు ఎంతో గౌరవం ఉండేది. అలా నాకు గ్రూప్‌–1 రాసి సబ్‌కలెక్టరు పోస్టు సాధించాలనే లక్ష్యం ఏర్పడింది.  

ప్రభుత్వ బడుల్లోనే చదువు... 
నాన్న చేయి పట్టుకొనే స్కూల్‌కు వెళ్లడంతో నా విద్యాభ్యాసం మొదలైంది. మా ఊరికి సమీపంలోనే ఉన్న వెంకటాపురం ఎంపీపీ పాఠశాలలో ఆయన టీచర్‌గా పనిచేసేటపుడు అక్కడే నన్నూ చదివించారు.ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకూ మాకవారిపాలెం జెడ్పీ హైసూ్కల్‌లో చది వాను. ఏడో తరగతిలో స్కూల్‌ ఫస్ట్‌ వచ్చింది. తొమ్మిదో తరగతి చదవకుండానే పదో తరగతి పరీక్షలు ప్రైవేట్‌గా రాయించారు మా నాన్న. అలా 13 ఏళ్లకే 1997–98 బ్యాచ్‌లో పదో తరగతి పాస్‌ అయ్యాను.  

ఇంటర్‌ విద్య కోసం విజయనగరానికి... 
ఇంటరీ్మడియెట్‌ చదవడానికి తొలిసారిగా విజయనగరం వచ్చాను. శ్రీనివాస జూనియర్‌ కాలేజీలో బైపీసీ చదివాను. నిరీ్ణత వయసు కన్నా తక్కువ ఉండడంతో అప్పుడు ఎంసెట్‌ రాయడానికి నిబంధనలు అంగీకరించలేదు. బీఎస్సీ అనకాపల్లి జిల్లా చోడవరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరినా సెకండ్‌ ఇయర్‌ మళ్లీ విజయనగరం వచ్చేశాను. ఇక్కడి గాయత్రి డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాను. తర్వాత ఆసెట్‌లో 3వ ర్యాంకు రావడంతో ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ బోటనీలో చేరాను. 2005లో గోల్డ్‌ మెడల్‌తో బయటకు వచ్చాను. అదే సంవత్సరం ఎడ్‌సెట్లో ర్యాంకు సాధించడం, 2005–06 బ్యాచ్‌లో బీఈడీ పూర్తి చేయడం కూడా జరిగిపోయాయి. 21 ఏళ్లకే విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాను.  

అధికారిగా శిక్షణ కూడా విజయనగరంలోనే... 
బీసీ సంక్షేమ శాఖ అధికారిగా ఎనిమిది నెలల శిక్షణ కోసం 2018లో విజయనగరం జిల్లాకే వచ్చాను. తర్వాత పోస్టింగ్‌ కూడా ఇక్కడికే రావడం నా అదృష్టం. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిగా 2019 సంవత్సరంలో రెగ్యులర్‌ అయ్యాను. అప్పటి నుంచి విద్యార్థుల సంక్షేమంపై దృష్టి పెట్టాను. ఉన్నతమైన జీవితానికి విద్య ఒక్కటే మార్గం. ప్రభుత్వం కలి్పంచిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకోవాలనేది నా సూచన.  

నాలుగేళ్ల ఎదురుచూపు ఫలించింది... 
గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ 2018 సంవత్సరంలో మరోసారి వెలువడింది. ప్రిలిమ్స్‌ తర్వాత 2020 సంవత్సరంలో మెయిన్స్‌ రాశాను. ఇంటర్వ్యూ తర్వాత తుది ఫలితాల్లో 325 మంది విజేతల్లో నేనూ ఉన్నాను. వాల్యూషన్‌ మళ్లీ చేయడంతో వారిలో నాతో పాటు 123 మందికి మాత్రమే ఇంటర్వ్యూకు అవకాశం దక్కింది. తుది ఫలితాల్లో 9వ ర్యాంకు వచ్చింది. ఉత్తరాంధ్రలోనే టాపర్‌గా నిలిచాను. సబ్‌కలెక్టర్‌ అవ్వాలనే నా కల నెరవేరింది.

లక్ష్యంపై గురి తప్పవద్దు... 
గ్రామీణ నేపథ్యం, తెలుగు మాధ్యమం... ఇవేవీ గ్రూప్‌–1 లాంటి ఉన్నతమైన ఉద్యోగాలు సాధించడానికి ఆటంకాలు కానేకావు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన లక్ష్యంపై గురి తప్పకుండా ప్రయత్నం కొనసాగించాలి. ఈ క్రమంలో ఏదైనా చిన్న ఉద్యోగం వచ్చినా చేరడం మంచిది. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.  

భావవ్యక్తీకరణ ప్రధానం  
గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షల్లో భావవ్యక్తీకరణ చాలా ప్రధానం. సిలబస్‌ను దృష్టిలో పెట్టుకొని దినపత్రికలను చదవాలి. అంశాల వారీగా క్లిప్పింగ్స్‌ ఉంచుకోవాలి. అయితే పరీక్షల్లో ఆ సమాచారాన్ని యథావిధిగా దించేయకూడదు. ప్రశ్న అడిగిన తీరును బట్టి సమాచారాన్ని ప్రెజెంట్‌ చేస్తూ మన విశ్లేషణ కూడా జోడించాలి. ఎగ్జామినర్‌ను ఇంప్రెస్‌ చేసేలా భావవ్యక్తీకరణ ఉండాలి. ఇందుకు మాతృభాష తెలుగు నాకు బాగా ఉపయోగపడింది. త్వరలోనే గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉంది. ప్రిపేర్‌ అయ్యేవారికి ఆల్‌ ది బెస్ట్‌. ప్రిపరేషన్‌తో పాటు స్వీయ ఆరోగ్యాన్నీ కాపాడుకోవాలి.’’ 

సబ్‌కలెక్టర్‌ కావాలన్నదే లక్ష్యం... 
సబ్‌కలెక్టరు కావాలన్నదే లక్ష్యం. ముందు ఏదో ఒక ఉద్యోగం సాధించాలని డీఎస్సీకి ప్రిపేరేషన్‌ ప్రారంభించాను. అదే సమయంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ప్రదీప్‌తో వివాహం అయ్యింది. ఆయన ఐటీ రంగాన్ని వదిలేసి స్థిరాస్తి వ్యాపారంలోకి వచ్చేశారు. నేను 2009లో డీఎస్సీలో మూడో ర్యాంకుతో టీచర్‌ ఉద్యోగం పొందాను. అచ్యుతాపురం మండలంలోని గొర్లి ధర్మవరం యూపీ స్కూల్‌లో చేరడంతోనే హెడ్మాస్టర్‌గా పనిచేయాల్సి వచ్చింది. టీచర్‌గా కొనసాగుతూనే గ్రూప్‌–1 పరీక్షకు సిద్ధమయ్యాను. 2011లో తొలి ప్రయత్నంలోనే ఇంటర్వ్యూ వరకూ వెళ్లాను. న్యాయవివాదాలతో ఫలితాలు వెలువడలేదు. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కోర్టు ఆదేశాల ప్రకారం 2016లో మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ అధికారి పోస్టుకు ఎంపికయ్యాను.   

Advertisement
Advertisement