28 ఏళ్ల లోపు పిల్లలు పుట్టడం పూర్తి కావాలి....

27 May, 2023 10:49 IST|Sakshi

పెళ్లి సంబంధం కుదరడం ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. పరిచయ వేదికలు, పేరయ్యలు,         బంధువర్గమంతా గాలించినా సరైన జోడీ కుదరక నానా తంటాలు పడుతున్నారు. అమ్మాయికి గరిష్టంగా 25 ఏళ్లకైనా కావాల్సిన పెళ్లి వాయిదాల పర్వంతో 30 దాటుతోంది. లేటు మ్యారేజీల వల్ల లేనిపోని సమస్యలు తలెత్తుతున్నాయి. ఈడూజోడు కుదిరి పాతికేళ్ల వయసు దాటకుండా పెళ్లయితే ఆరోగ్య వంతులైన పిల్లలు పుడతారు. కానీ అబ్బాయికి 35, అమ్మాయికి 30 దాటాక పిల్లలు కనడం అతి పెద్ద ఇబ్బంది అయ్యింది.  

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఒకప్పుడు వధూవరుల ఎంపికలో పెద్ద పట్టింపులు లేవు. ఇప్పుడేమో పట్టిపట్టి చూస్తున్నారు. జాతకాలు కలవాలి. చదువు, ఉద్యోగంలో అమ్మాయిల స్థాయిని చూస్తున్నారు. అన్నీ కుదిరినా జాతకం కుదరకపోతే చివరి నిమిషంలో సంబంధం రద్దు చేసుకుంటున్నారు. ఒకవేళ జాతకం కుదిరినా అబ్బాయి తరఫు ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నా.. మంచి ఉద్యోగం ఉండి ఆస్తి లేకపోయినా అమ్మాయిలు ఒప్పుకోవడం లేదు. ఇలా రకరకాల సమస్యలతో 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్న    జంటలు తదనంతరమూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తేలింది. 

ఏటా 55 వేలకు పైగా పెళ్లిళ్లు 
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏటా 55వేలకు పైగా పెళ్లిళ్లు జరుగుతుండగా.. అందులో 30 శాతం లేటు మ్యారేజీలే. ఇందులో ఎక్కువగా స్థాయికి తగ్గట్టు సంబంధాలు కుదరకపోవడమే. అన్నిటికీ మించి లేటు మ్యారేజీల కారణంగా హార్మోన్ల సమతుల్యత లోపించి రకరకాల గర్భకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు. మగవాళ్లలో సైతం ఉద్యోగంలో ఒత్తిళ్ల కారణంగా యుక్తవయసులోనే డయాబెటిక్, హైపర్‌టెన్షన్‌ సమస్యలు ఎదుర్కొని లైంగిక సమస్యలతో సంతానానికి నోచుకోలేకపోతున్నారు. 

అసలే సమస్యలు.. ఆపై గ్యాప్‌ 
పెళ్లిళ్లు కావడమే జాప్యం జరుగుతూ ఉంటే వీరిలో 70 శాతం మంది వెంటనే బిడ్డలు పుట్టకుండా ఓరల్‌పిల్స్‌ తీసుకుంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు. దీంతో 40 ఏళ్లు సమీపిస్తున్న వేళ తొలి కాన్పు అవుతోంది. 

ఇక రెండో కాన్పునకు అవకాశమే లేకుండా పోతోంది. ఈ కారణాలతో జిల్లాలో జనన రేటు గణనీయంగా పడిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒక జంట సగటున ఇద్దరిని కనాలి..అలాంటి ఈ రేషియో 1.7కు పడిపోయింది. ఇది భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారే ప్రమాదముంది.  

రెండో బిడ్డకు ఇబ్బంది 
28 ఏళ్ల లోపు పిల్లలు పుట్టడం పూర్తి కావాలి. కానీ పెళ్లే 30 ఏళ్ల తర్వాత అంటే మొదటి బిడ్డకే ఆగిపోవాల్సి వస్తుంది. చాలామంది పెళ్లవగానే రెండుమూడేళ్లు బిడ్డలు పుట్టకుండా జాగ్రత్తలు పడుతున్నారు. వివాహం లేటు వయసులో చేసుకోవడం వల్ల ఫెర్టిలిటీ    (సంతానోత్పత్తి)లో సమస్యలు తలెత్తుతున్నాయి. యుక్తవయసులో పెళ్లి చేసుకుంటేనే ఆరోగ్యవంతమైన బిడ్డలు పుట్టే అవకాశం ఉంది. – డాక్టర్‌ వినూత్న, గైనకాలజిస్ట్‌ 

విలాస జీవితం.. జాతకాల పిచ్చి 
బాగా డబ్బుండాలి.. ప్యాకేజీ ఉండాలి.. విలాసవంతమైన జీవితం.. ఇవన్నీ ఇప్పుడు కీలకమయ్యాయి. వీటికి తోడు జాతకాల పిచ్చి ఎక్కువైంది. ఇవన్నీ సరిపోయే అబ్బాయి లేదా అమ్మాయి కావాలంటే ఏళ్ల తరబడి వెతకాల్సిందే. దీంతో వివాహం తీవ్ర జాప్యం అవుతోంది. జీవితంలో సెటిల్‌ కావడం అనే అర్థమే మారిపోయింది.            –సత్యనారాయణ, విశ్రాంత ఉద్యోగి   

మరిన్ని వార్తలు