Andhra Pradesh: జిల్లా స్థాయిలో ఆధార్‌ పర్యవేక్షణ కమిటీలు | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: జిల్లా స్థాయిలో ఆధార్‌ పర్యవేక్షణ కమిటీలు

Published Wed, Nov 2 2022 3:04 AM

Sameer Sharma says District Level Aadhaar Monitoring Committees - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆధార్‌ సంబంధిత కార్యకలాపాలన్నీ పర్యవేక్షించేందుకు కలెక్టర్ల అధ్యక్షతన జిల్లాస్థాయి కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు సీఎస్‌ సమీర్‌శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు పిల్లలతో సహా నూటికి నూరు శాతం ఆధార్‌ అనుసంధానం చేయించడం, సంబంధిత అంశాలను మరింత పటిష్టంగా అమలు కోసం జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 5.17 కోట్ల ఆధార్‌ నంబర్లు జారీ చేయగా.. 97 శాతం జనాభాకు ఆధార్‌ కవర్‌ అయినట్టు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఆధార్‌ సంబంధిత కార్యకలాపాల పర్యవేక్షణకు కలెక్టర్‌ అధ్యక్షునిగా జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేశామని, ఇవి కనీసం మూడునెలలకోసారి సమావేశమై ఆధార్‌ సంబంధిత కార్యకలాపాలను సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

కమిటీ పర్యవేక్షించే అంశాలు ఇలా..
కవర్‌ కాని ప్రాంతాల్లో అదనపు ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ కేంద్రాల ఏర్పాటు. జిల్లా, సబ్‌ జిల్లా, బ్లాక్‌ స్థాయిలో ఆధార్‌ సేవా కేంద్రాలు ఏర్పాటు. జనన రిజిస్ట్రేషన్‌తో ఆధార్‌ అనుసంధానం చేయడం. వివిధ పథకాలన్నింటికీ ఆధార్‌ అనుసంధానం చేయడం.

ఆధార్‌కు సంబంధించి మోసపూరిత కార్యకలాపాలను పర్యవేక్షించడం. ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ కేంద్రాల కార్యకలాపాలను పర్యవేక్షణ చేయడంతోపాటు సమస్యలను పరిష్కరించడం. ఆధార్‌కు సంబంధించి నిపుణులు అవసరమైతే చైర్మన్‌ కమిటీలో నియమించవచ్చు.  

Advertisement
Advertisement