30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి స్కోచ్‌ అవార్డు  | Sakshi
Sakshi News home page

30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి స్కోచ్‌ అవార్డు 

Published Thu, Apr 14 2022 3:27 AM

Scotch Award for Distribution of 30 Lakh House Deeds - Sakshi

సాక్షి, అమరావతి: కనీ వినీ ఎరుగని రీతిలో 30 లక్షల మంది పేదింటి అక్కచెల్లెమ్మలకు సొంతింటి కలను నిజం చేస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ప్రతిష్టాత్మకమైన స్కోచ్‌ మెరిట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ అవార్డు లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇన్ని లక్షల మందికీ ఒకేసారి పట్టాలు పంపిణీ చేశారు. పూర్తి పారదర్శకంగా ఆన్‌లైన్‌లో లబ్ధిదారులను ఎంపిక చేసినందుకు ఈ అవార్డు దక్కింది. ఇది కాకుండా మరో మూడు అవార్డులూ రాష్ట్రానికి వచ్చాయి. మీ భూమి ప్రాజెక్టుకి స్కోచ్‌ సిల్వర్‌ అవార్డు దక్కింది. కౌలు రైతులకు ఆన్‌లైన్‌లో కార్డులు జారీ చేసే క్రాప్‌ కల్టివేటర్‌ రైట్స్‌ కార్డ్స్‌ (సీసీఆర్‌సీ), భూసోదక్‌ యాప్‌కు స్కోచ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డులు వచ్చాయి. మొత్తం 9 ప్రాజెక్టులకు సీసీఎల్‌ఏ (భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌) స్కోచ్‌ అవార్డ్స్‌–2022కి నామినేషన్లు పంపగా వాటిలో నాలుగింటికి అవార్డులు వచ్చాయి. 

ఈ ప్రాజెక్టుల ప్రజెంటేషన్లు, వివరణలన్నింటినీ సీసీఎల్‌ఏ అధికారులు అవార్డుల ఎంపిక కమిటీకి గతంలోనే పంపారు. ఎంపికైన ప్రాజెక్టులను అవార్డుల కమిటీ మంగళవారం ఆన్‌లైన్‌లో ప్రకటించింది. సీసీఎల్‌ఏ సాయి ప్రసాద్‌ ఆన్‌లైన్‌లో వాటిని స్వీకరించారు. అవార్డులను కమిటీ పోస్టులో సీసీఎల్‌ఏకి పంపిస్తుంది.

పారదర్శకతకు అవార్డు 
రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల కార్యక్రమంలో భాగంగా విప్లవాత్మకమైన రీతిలో సొంతిళ్లు లేని 30 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఒకేసారి ఇళ్ల పట్టాలను ఉచితంగా పంపిణీ చేసింది. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన ఈ ప్రక్రియ ప్రశంసలందుకొంది. ఇప్పుడు స్కోచ్‌ మెరిట్‌ అవార్డు పొందింది. ఇళ్ల పట్టాల పంపిణీకి వెబ్‌ పోర్టల్‌ను ఏర్పాటు చేసి దాని ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. కులాలు, మతాలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. గ్రామీణ ప్రాంతంలో సెంటున్నర, పట్టణ ప్రాంతాల్లో సెంటు భూమిని పేదలకు పంపిణీ చేశారు. చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్థాయిలో వైఎస్సార్‌ జగనన్న ఇళ్ల పట్టాల పేరుతో 17 వేలకుపైగా కాలనీల్లో లేఅవుట్లు వేసి ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చారు. పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల మీద ముద్రించిన క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే భూ యజమాని, భూమి వివరాలు తెలుసుకునేలా భూశోధక్‌ యాప్‌ను తీసుకొచ్చారు. పాస్‌బుక్‌ నిజమైనదో కాదో కూడా తెలుస్తుంది. ఈ యాప్‌ ద్వారా సర్వే నంబర్‌తో భూమి వివరాలు తెలుసుకోవచ్చు. 

భూ యజమానుల కోసం మీ భూమి పోర్టల్‌
మీ భూమి పోర్టల్‌ గతం నుంచి ఉన్నా ఎప్పుడూ అవార్డు రాలేదు. ఈ సంవత్సరం అవార్డుకు ఎంపికైంది.  గతంలో భూముల రికార్డులు వెబ్‌ ల్యాండ్‌లో ఉండేవి. జాయింట్‌ కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్‌ కార్యాలయాల్లో మాత్రమే భూయజమానులు వాటిని చూసే అవకాశం ఉండేది. భూయజమానులు వారి భూముల వివరాలు తెలుసుకోవాలంటే తహశీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులు లేకుండా మీ భూమి పోర్టల్‌ ద్వారా భూముల వివరాలు సులభంగా తెలుసుకొనే అవకాశం కలిగింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement