ఫిష్‌.. ఫిష్‌ హుర్రే! | Sakshi
Sakshi News home page

ఫిష్‌.. ఫిష్‌ హుర్రే!

Published Sun, Jul 9 2023 5:05 AM

Seafood sales boom in Rayalaseema districts - Sakshi

సాక్షి, అమరావతి: ‘ఫిష్‌ ఆంధ్ర’ అవుట్‌లెట్స్‌కు ఆదరణ మరింత పెరుగుతోంది. ‘ఫిష్‌ ఆంధ్ర’  అవుట్‌లెట్స్‌కు ఏ రోజు వెళ్లినా కావాల్సిన మత్స్య ఉత్పత్తులు తాజాగా దొరుకుతాయన్న నమ్మకం మాంసాహార ప్రియుల్లో ఏర్పడింది. దీంతో వీటికి విశేష ఆదరణ లభిస్తోంది. తమకు జీవనోపాధి లభించడంతోపాటు తమ ద్వారా మరికొందరికి ఉపాధి కల్పించగలుగుతున్నామని అవుట్‌­లెట్స్‌ నిర్వాహకులు చెబుతుంటే.. శుభ్రమైన వాతావరణంలో తాజా మత్స్య ఉత్పత్తులు లభిస్తున్నా­యని వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

స్థానిక వినియోగం పెంచే లక్ష్యంతో.. 
మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా ‘ఫిష్‌ ఆంధ్ర’ పేరిట ప్రభుత్వం బ్రాండింగ్‌ చేసి ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో ఏటా 4.36 లక్షల టన్నులున్న మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగాన్ని 2025 నాటికి కనీసం 15 లక్షల టన్నులకు పెంచాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 70 హబ్‌లను, వాటికి అనుబంధంగా 14 వేల అవుట్‌లెట్లను ఏర్పాటు చేయాలని ల­క్ష్యం­గా పెట్టుకుంది.

తొలి దశలో జిల్లాకు ఒకటి చొ­ప్పున ఆక్వా హబ్, వాటికి అనుబంధంగా 4 వేల అవుట్‌లెట్స్, స్పోక్స్, డెయిలీ, సూపర్, లాంజ్‌ యూ­నిట్స్‌తో పాటు త్రీవీలర్, 4 వీలర్‌ కియోస్‌్కలను 60 శాతం సబ్సిడీపై నిరుద్యోగ యువతకు మంజూరు చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,250 అవుట్‌లెట్స్, 70 త్రీ వీలర్, 84 ఫోర్‌ వీలర్‌ వెహిక­ల్స్, 62 డెయిలీ, 50 సూపర్, 11 లాంజ్‌ యూనిట్స్‌ కలిపి మొత్తంగా 1,527 యూనిట్స్‌ ఏర్పాటయ్యా­యి.

తొలుత నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా రాయలసీ­మ ప్రాంతంలో సముద్ర మత్స్య ఉత్పత్తులకు డి­మాండ్‌ పెరుగుతోంది. స్థానికంగా దొరికే చేపలు, రొయ్యలతోపాటు సముద్ర మత్స్య ఉత్పత్తులు సై­తం లభిస్తుండటంతో వీటిని కొనేందుకు ఎగబడుతున్నారు. 

స్పందన చాలా బాగుంది 
ప్రైవేటు బ్యాంక్‌లో ఉద్యోగం చేసేవాడిని. నెలకు రూ.15 వేలు జీతం వచ్చేది. ప్రభుత్వ ప్రోత్సాహంతో కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్ట్‌ సెంటర్‌లో 60 శాతం సబ్సిడీతో ఫిష్‌ ఆంధ్ర అవుట్‌లెట్‌ పెట్టుకున్నా. ఆదివారం 200–300 కిలోలు, మిగిలిన రోజుల్లో 50నుంచి 100 కేజీల వరకు మత్స్య ఉత్పత్తులు అమ్ముడుపోతున్నాయి. నాకు ఉపాధి లభించడంతోపాటు మరో నలుగురికి ఉపాధి చూపిస్తున్నా.

కాకినాడ నుంచి సముద్ర చేపలు, రొయ్యలు, పీతలు సైతం వస్తున్నాయి. సీ ఫుడ్స్‌ కోసం క్యూ కడుతున్నారు. సాయంత్రం పూట చేప, రొయ్య తదితర వంటకాలతో వాల్యూ యాడెడ్‌ యూనిట్‌ నడుపుతున్న. స్పందన చాలా బాగుంది. సిబ్బంది జీతభత్యాల కింద రూ.56 వేలు చెల్లిస్తున్నా. రూ.60 వేలకు పైగా ఈఎంఐలు కడుతున్నా. అయినా రూ.50 వేల వరకు మిగులుతోంది.  – బట్టు రాజశేఖర్, ఫిష్‌ ఆంధ్ర అవుట్‌లెట్‌ నిర్వాహకుడు, కర్నూలు 

చాలా తాజాగా ఉంటున్నాయి 
ప్రతి ఆదివారం ఫిష్‌ ఆంధ్ర అవుట్‌లెట్‌కు వస్తున్నా. ఇక్క­డ గోదావరిలో మాత్రమే దొరికే చేపలతో పాటు సముద్ర చేపలు, రొయ్యలు కూడా దొరుకుతాయి. చాలా తాజాగా ఉంటు­న్నాయి. ఎంతో రుచిగా ఉంటున్నాయి.  – జి.శ్రీనివాసరావు, పోరంకి, విజయవాడ 

హైజీనిక్‌గా ఉంటున్నాయి 
అవుట్‌లెట్‌కు ఏరోజు వచ్చినా అన్నిరకాల చేపలు దొరుకుతున్నాయి. చాలా తాజాగా ఉంటున్నాయి. హైజీనిక్‌గా మెయింటైన్‌ చేస్తున్నారు.   – కె.రామయ్య, ఈడుపుగల్లు, పెనమలూరు 

ఆదరణ పెరుగుతోంది 
స్థానిక వినియో­గం పెంచడం లక్ష్యంగా ఫిష్‌ ఆంధ్ర పేరిట నాణ్యమైన మ­త్స్య ఉత్పత్తులను హబ్‌ అండ్‌ స్పోక్‌ మోడల్‌లో ప్రజలకు అందుబా­టులోకి తీసుకొస్తున్నాం. ఇప్పటికే మూడు హబ్‌లతో పాటు 1,500కు పైగా అవుట్‌లెట్స్, ఇతర యూనిట్స్‌ను అందుబాటులోకి తెచ్చాం. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. గతంతో పోలిస్తే స్థానిక వినియోగం గణనీయంగా పెరిగింది.  – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ 

Advertisement

తప్పక చదవండి

Advertisement