చంద్రబాబు రిమాండ్‌ పొడిగింపు.. మరో 11 రోజులు జైల్లోనే, జడ్జి ఏమన్నారంటే..

24 Sep, 2023 19:38 IST|Sakshi

సాక్షి, కృష్ణా/తూర్పు గోదావరి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అరెస్టైన టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి రిమాండ్‌ను ఆదివారం విజయవాడ ఏసీబీ న్యాయస్థానం పొడిగించింది. అక్టోబర్‌ 05 తేదీ దాకా ఆయన రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించిన ఏసీబీ జడ్జి.. తక్షణమే ఆయన్ని జ్యుడీషియల్‌ కస్టడీకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఆయన మరో 11 రోజులు రాజమండ్రి సెంట్రల్‌ జైలులోనే రిమాండ్‌ ఖైదీగా ఉండనున్నారు.  

చంద్రబాబు జ్యుడీషియల్‌ రిమాండ్‌ నేటితో ముగిసింది. ఈ తరుణంలో రెండు రోజుల కస్టడీ విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు.. ఆదివారం సాయంత్రం వర్చువల్‌గా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట చంద్రబాబును ప్రవేశపెట్టారు. చంద్రబాబు విచారణలో సహకరించలేదని.. అందుకే ఆయన రిమాండ్‌ను పొడిగించాలని మోమో దాఖలు చేసింది సీఐడీ. పరిశీలించిన న్యాయమూర్తి, కేసు ఇంకా విచారణ దశలోనే ఉన్నందున రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. 

చంద్రబాబును ఆరా తీసిన జడ్జి 
వర్చువల్‌గా హాజరైన చంద్రబాబును జడ్జి కొన్ని విషయాలు అడిగారు.  విచారణలో ఏమైనా ఇబ్బంది పెట్టారా? అని చంద్రబాబును ప్రశ్నించగా.. సీఐడీ అధికారులు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని చంద్రబాబు సమాధానం ఇచ్చారు. అలాగే.. వైద్య పరీక్షలు నిర్వహించారా? అని ప్రశ్నించగా.. నిర్వహించారు అని సమాధానం ఇచ్చారాయన. థర్డ్‌ డిగ్రీ ఏమైనా ప్రయోగించారా?.. ఏమైనా అసౌకర్యం అనిపించిందా? అనే ప్రశ్నలకు.. అలాంటిదేమీ లేదని  చంద్రబాబు సమాధానం ఇచ్చారు. దీంతో జడ్జి.. ‘‘మీరు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు, మీ బెయిల్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉంది. కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని, ఇప్పుడే అంతా అయిపోలేదు. బెయిల్‌ పిటిషన్‌పై రేపు(సెప్టెంబర్‌ 25, సోమవారం) వాదనలు వింటాం’’ అని చంద్రబాబుకి స్పష్టం చేసింది. 

చంద్రబాబు లాయర్లపై అసహనం
సీఐడీ పిటిషన్‌పై చంద్రబాబు తరపు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేసిన క్రమంలో.. సదరు లాయర్లపై ఏసీబీ న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు.  ఒకటికి పది పిటిషన్లు వేయడం వల్ల విచారణ చేయడం ఎలా? అని బాబు లాయర్లను ప్రశ్నించారు ఏసీబీ జడ్జి. ‘‘ఒకే అంశంపై వరుస పిటిషన్ల వల్ల కోర్టు సమయం వృథా అవుతుంది’’అని చంద్రబాబు తరపు న్యాయవాదుల్ని, ఏసీబీ జడ్జి మందలించారు. అదే సమయంలో ‘‘ విచారణలో ఇప్పటిదాకా ఏం గుర్తించారనేది బయటపెట్టాలి’ అని చంద్రబాబు, ఏసీబీ జడ్జిని కోరారు చంద్రబాబు. 

అయితే..  విచారణ సమయంలో విషయాలను బయటపెట్టడం సరికాదన్న జడ్జి, ప్రాథమిక సాక్ష్యాలను సీఐడీ ఇప్పటికే సమర్పించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ క్రమంలో అందుకు సంబంధించిన పత్రాలను మీ లాయర్లను అడిగి తీసుకోవాలంటూ చంద్రబాబుకి సూచించారు. 

కస్టడీ పొడిగింపు కోరాల్సి ఉంది
సీఐడీ కస్టడీలో.. విచారణకు చంద్రబాబు సహకరించలేదు. అందుకే జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగించమని కోరాం.  చంద్రబాబు గతంలో సాక్ష్యులను ప్రభావితం చేసిన అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్ళాం. సీఐడీ కస్టడీ పొడిగించమని కోరలేదు. రేపు పీటీ వారెంట్ పిటిషన్లు విచారణకు వచ్చే అవకాశం ఉంది. సీఐడీ కస్టడీకి మళ్ళీ కోరాలా? వద్దా? అనేది నిర్ణయం తీసుకుంటాం అని సీఐడీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద మీడియాకు వెల్లడించారు.

మరిన్ని వార్తలు