కల్తీ చేస్తే జైలు‘పాలు’.. ఏపీలో కీలక చట్టం.. త్వరలో అమలు | Sakshi
Sakshi News home page

కల్తీ చేస్తే జైలు‘పాలు’.. ఏపీలో కీలక చట్టం.. త్వరలో అమలు

Published Sun, Apr 16 2023 2:47 AM

SOP for implementation of Milk Procurement, Quality Milk Consumption Act - Sakshi

సాక్షి, అమరావతి: పాల సేకరణ, విక్రయాల సందర్భం­గా కల్తీలు, మోసాలకు పాల్పడితే డెయిరీల నిర్వాహకులు, సంబంధిత వ్యాపారులు ఇకపై కట­కటాల ఊచలు లెక్క పెట్టాల్సిందే. ఈ తరహా మో­సా­లకు అడ్డుకట్ట వేసేందుకు దేశంలో మరెక్కడా లేని­వి­ధంగా పాల సేకరణ (రైతు రక్షణ), నాణ్యమైన పాల వినియోగ చట్టం–2023ను రాష్ట్ర ప్రభుత్వం త్వర­లో­నే అమలులోకి తీసుకురాబోతోంది. ఇటీవలే అసెం­బ్లీ ఆమోదం పొందిన ఈ చట్టం అమలుకు సంబంధిం­చి ఎస్‌ఓపీ (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌) రూ­ప­­క­ల్పన కోసం పశు సంవర్థక శాఖ కసరత్తు చేస్తోంది. 

గతంలోనూ చట్టాలున్నా..
గతంలో తూనికలు, కొలతలు శాఖ, మునిసిపా­లి­టీల ఆధ్వర్యంలోని ప్రజారోగ్య విభాగాలు మాత్రమే పాల విక్రయాల్లో జరిగే లోపాలపై అడపాదడపా దృష్టి సారించేవి. ఆ రెండు విభాగాలకూ ఇతర పనులు సైతం ఉండటంతో పాల విక్రయాలపై పెద్దగా దృష్టి సారించేవి కాదు. దీనివల్ల యథేచ్ఛగా అక్రమాలు సాగిపోయేవి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పశు సంవర్థక శాఖ అధికారులను సైతం రంగంలోకి దించింది.

పాల సేకరణ సందర్భంగా మిల్క్‌ అనలైజర్స్, వేయింగ్‌ మెషిన్స్‌ను డెయిరీల నిర్వాహకులు అనుకూలంగా మార్చుకుని అక్రమాలకు పాల్పడుతుండటంతో తూనికలు, కొలతల చట్టం ప్రకారం వాటిని తనిఖీ చేసే అధికారాలను 2021 నవంబర్‌ నుంచి ప్రభు­త్వం పశు వైద్యులకు అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన పశు వైద్య బృందాలు ఏడాదిన్నర కాలంలో 3,704 దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశాయి.

151 ఉల్లంఘనలపై జరిమానాలు విధించడం ద్వారా అక్రమాలకు కొంతమేర అడ్డుకట్ట వేయగలిగారు. అయితే, మోసాలకు కారణమైన అనలైజర్స్, ఇతర పరికరాలను సీజ్‌ చేయడం, ఇందుకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం పశు సంవర్థక శాఖకు లేకుండాపోయింది. 

అక్రమాలకు చెక్‌ పెట్టేలా కొత్త చట్టం
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ తరహా మోసాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నియమ, నిబంధనలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకు రావాలన్న సంకల్పంతో పాల సేకరణ (రైతు రక్షణ), నాణ్యమైన పాల వినియోగం చట్టం–2023ను తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం మిల్క్‌ అనలైజర్స్‌తో పాటు పాల సేకరణ కేంద్రాలు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు (బీఎంసీయూ), ఆటోమేటిక్‌ మిల్క్‌ కలెక్షన్‌ యూనిట్ల (ఏఎంసీయూ)పై పశు సంవర్థక శాఖ పర్యవేక్షణలోకి తీసుకొచ్చారు.

ఇందుకోసం మిల్క్‌ ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారులను పశు సంవర్థక శాఖ నియమిస్తుంది. మిల్క్‌ అనలైజర్స్‌ నిర్వహించే వ్యక్తులు కచ్చితంగా పశు సంవర్థక శాఖ నుంచి లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుంది. నాణ్యత ప్రమాణాలు పాటించని మిల్క్‌ అనలైజర్స్‌ను జప్తు చేస్తారు. పాల నాణ్యత పాటించకపోతే ఫుడ్‌ సేఫ్టీ, నాణ్యత ప్రమాణాల యాక్టు 2006 ప్రకారం చర్యలు తీసుకుంటారు.

మోసాలకు పాల్పడితే జరిమానాలు, శిక్షలు ఇలా..
అనుమతి లేకుండా మిల్క్‌ అనలైజర్స్‌ కలిగిన వ్యక్తికి రూ.50 వేల వరకు జరిమానా, 6 నెలల జైలుశిక్ష విధిస్తారు. అనుమతి లేకుండా బీఎంసీయూలు, ఏఎంసీయూలు అనలైజర్స్‌ వాడితే రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. రెండోసారి నేరానికి ఏడాదిపాటు కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తారు.
♦  మిల్క్‌ ప్రాసెసింగ్‌ యూనిట్, డెయిరీలు మిల్క్‌ అనలైజర్లను అనధికారికంగా, అనుమతి లేకుండా పొంది ఉంటే రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. తదుపరి నేరానికి రెండేళ్ల కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తారు.
♦ మిల్క్‌ అనలైజర్లను దుర్వినియోగపరిచే వారికి రూ.50 వేల వరకు జరిమానా, 6 నెలలకు తగ్గకుండా జైలుశిక్ష విధిస్తారు. నేర తీవ్రతను బట్టి ఐదేళ్ల  వరకు పొడిగించే అవకాశం ఉంది.
లైసెన్స్‌ లేకుండా పాలను సేకరిస్తే రూ.50 వేల వరకు జరిమానా విధిస్తారు. రెండోసారి నేరానికి రూ.లక్ష వరకు జరిమానా, 6 నెలల కారాగార శిక్ష లేదా రెండూ విధిస్తారు.
లైసెన్సు లేకుండా మిల్క్‌ అనలైజర్ల సర్వీసింగ్‌ సెంటర్లు నిర్వహించే వారికి రూ.25 వేల జరిమానా విధిస్తారు. రెండోసారి నేరానికి పాల్పడితే రూ.50 వేల వరకు జరిమానా లేదా ఏడాది కారాగార శిక్ష విధిస్తారు. ఒక్కోసారి రెండూ విధించే అవకాశం ఉంది.
♦ పాడి రైతుకు నిర్దేశిత ధర చెల్లించకపోయినా.. ఫ్యాట్, ఎస్‌ఎన్‌ఎఫ్‌ శాతాలను తక్కువగా చూపించి మోసానికి పాల్పడినా రూ.50 వేల వరకు జరిమానా విధిస్తారు. రెండోసారి నేరానికి రూ.లక్ష  జరిమానా లేదా 6 నెలల కారాగార శిక్ష లేదా రెండూ విధిస్తారు.

రైతులు, వినియోగదారుల రక్షణ కోసమే..
పాల సేకరణలో దళారులు, వ్యాపారులు పాల్పడే మోసాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన పాలను సరఫరా చేయడమే లక్ష్యంగా దేశంలో మరెక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం పాడి రైతులకు పూర్తి రక్షణ కల్పిస్తుంది.  – సీదిరి అప్పలరాజు, పశు సంవర్థక శాఖ మంత్రి 

Advertisement

తప్పక చదవండి

Advertisement