ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ  | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ 

Published Sat, Dec 30 2023 4:56 AM

Special attention to public health - Sakshi

సాక్షి, అమరావతి: ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ తదితర కార్యక్రమాల ద్వారా ప్రజారోగ్యానికి అండగా నిలుస్తున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స పూర్తయిన అనంతరం.. ఆస్పత్రులకు వెళ్లి ఫాలోఅప్‌ వైద్య సేవలు పొందడం కోసం రోగుల ప్రయాణాలకయ్యే ఖర్చును కూడా వారికి అందించబోతోంది. 

కన్సల్టేషన్‌కు రూ.300 చొప్పున..
ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకం కింద అందించే చికిత్సల సంఖ్య(ప్రొసీజర్లు)ను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 3,257కు పెంచింది. అలాగే ఆరోగ్యశ్రీ వైద్య వ్యయ పరిమితిని కూడా రూ.25 లక్షలకు పెంచి పేద, మధ్యతరగతి కుటుంబాలకు కొండంత భరోసా కల్పించింది. అంతేకాకుండా 1,500కు పైగా ప్రొసీజర్లలో చికిత్సల తర్వాత వైద్యులు సూచించిన విశ్రాంత సమయానికి గాను రోగులకు వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద గరిష్టంగా నెలకు రూ.5 వేల వరకు సాయం అందిస్తోంది. ఇప్పుడు ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా సీఎం జగన్‌ మరో అడుగు ముందుకు వేశారు.

ఆరోగ్యశ్రీ పథకంలోని గుండె, మెదడు, ఆర్థో, పీడియాట్రిక్స్‌ విభాగాలకు సంబంధించిన 138 ప్రొసీజర్లలో ఏదైనా చికిత్స చేయించుకున్న తర్వాత.. ఏడాదిలోపు రోగులు 4సార్లు వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసే రోజే.. ఫాలోఅప్‌ సేవల కోసం రావాల్సిన తేదీలను వైద్యులు చెబుతుంటారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందేవారంతా నిరుపేద, మధ్యతరగతి ప్రజలే.

వీరు ప్రయాణాల ఖర్చులకు వెనుకడుగు వేసి ఫాలోఅప్‌ వైద్య సేవలపై నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో సమస్య పూర్తిగా నయం కాకపోవడంతో భవిష్యత్‌లో మళ్లీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ 138 ప్రొసీజర్లలో ఏదైనా చికిత్స పొందిన వారికి ప్రయాణ చార్జీలను కూడా ప్రభుత్వమే భరించాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. ఒక్కో కన్సల్టేషన్‌కు రూ.300 చొప్పున చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

అవసరమైన మందులూ అందజేత..
ఫాలోఅప్‌ కన్సల్టేషన్‌ సమయంలోనే రోగికి అవసరమైన మందులను కూడా ఆస్పత్రిలో అందజేస్తారు. ఏటా ఆరోగ్యశ్రీ కింద చేసే మొత్తం చికిత్సల్లో 10 శాతం మేర కేసుల్లో ఫాలోఅప్‌ కన్సల్టేషన్‌లు అవసరం ఉంటాయని వైద్య శాఖ అంచనా వేసింది. ఫాలోఅప్‌ కన్సల్టేషన్‌ వైద్య సేవల పొందేందుకు ప్రభుత్వం ఇలా అదనపు సాయం చేయడం వల్ల రోగులు పూర్తి స్థాయిలో కోలుకుంటారని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఇది ప్రజలకు గొప్ప మేలు చేస్తుందన్నారు.  

ఆదేశాల  అమలుకు చర్యలు చేపట్టాం..
అవసరం ఉన్న ప్రతి ఒక్క రోగి ఫాలోఅప్‌ కన్సల్టేషన్‌ సేవలు పొందేలా చర్యలు తీసుకుంటున్నాం. కన్సల్టేషన్‌కు రూ.300 చొప్పున చెల్లించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని అమలు చేయడానికి చర్యలు చేపట్టాం. మెడ్కో లాగిన్‌లో ఓ ప్రత్యేక ఆప్షన్‌ ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన వ్యక్తి ఫాలోఅప్‌ కన్సల్టేషన్‌కు హాజరయ్యాడని నిర్ధారిస్తే.. ఆ రోగి, వారి కుటుంబ సభ్యుల బ్యాంక్‌ ఖాతాల్లో రూ.300 చొప్పున నగదు జమ అవుతాయి. – డీకే బాలాజీ, సీఈవో, డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ 

Advertisement
Advertisement