ఎగుమతులు ఎగసేలా | Sakshi
Sakshi News home page

ఎగుమతులు ఎగసేలా

Published Sun, Feb 20 2022 5:09 AM

Special focus on districts lagging behind in terms of exports in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: దేశీయ ఎగుమతుల్లో 2030 నాటికి మన రాష్ట్రం 10 శాతం వాటాను చేజిక్కించునే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇందుకోసం ఇప్పటికే ఎగుమతుల్లో మంచి పనితీరు కనబరుస్తున్న జిల్లాలతో పాటు వెనుకబడిన జిల్లాలపైనా ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాల వారీగా ఎగుమతి అవుతున్న ఉత్పత్తుల వివరాలను సేకరించి వాటికి అంతర్జాతీయ మార్కెట్లో గల అవకాశాలను పరిశీలించి ఎగుమతులను ప్రోత్సహిస్తున్నట్లు పరిశ్రమల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ (ఎక్స్‌పోర్ట్స్‌ ప్రమోషన్స్‌) జీఎస్‌ రావు ‘సాక్షి’కి తెలిపారు.

ప్రస్తుతం మన రాష్ట్రంలో విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలు దేశవ్యాప్తంగా అత్యధిక ఎగుమతులు చేస్తున్న టాప్‌ 20 జిల్లాల్లో ఉండగా.. కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాలు బాగా వెనుకబడ్డాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–అక్టోబర్‌ నాటికి రాష్ట్రం నుంచి రూ.84,701.64 కోట్ల విలువైన ఎగుమతులు జరగ్గా.. అందులో రూ.24,071.26 కోట్ల ఎగుమతులతో విశాఖ మొదటి స్థానంలోను, రూ.19,499.19 కోట్లతో తూర్పు గోదావరి రెండో స్థానంలో ఉన్నాయి. ఇదే సందర్భంలో కర్నూలు జిల్లా నుంచి రూ.317 కోట్లు, వైఎస్సార్‌ జిల్లా రూ.633 కోట్ల ఎగుమతులతో చివరి స్థానాల్లో ఉన్నాయి. 


వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి
వెనుకబడిన జిల్లాల్లో ఎగుమతులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఉదాహరణకు వైఎస్సార్‌ జిల్లా నుంచి అత్యధికంగా ఖనిజాలు, ఉద్యాన పంటల ఎగుమతులు జరుగుతున్నాయి. వీటిలో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. వైఎస్సార్‌ జిల్లా నుంచి బేరియం, బైరటీస్, పోర్ట్‌లాండ్‌ సిమెంట్, అరటి వంటి ఉత్పత్తులకు సంబంధించి అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా నైపుణ్యాభివృద్ధితోపాటు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించనుంది.

ఇందుకోసం వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలో వైఎస్సార్‌ జగనన్న ఎంఐహెచ్, వైఎస్సార్‌ ఈఎంసీలతో పాటు కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద భారీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. వీటిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలతో పెద్దఎత్తున తయారీ కేంద్రాలను ఆకర్షించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్‌ఐ) పథకం కింద ఏర్పాటయ్యే యూనిట్లను రాష్ట్రానికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వైఎస్సార్‌ జిల్లాలో పలు యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. 

Advertisement
Advertisement