తిరుమల నడకదారి భక్తుల రక్షణకు ప్రత్యేక చర్యలు | Sakshi
Sakshi News home page

తిరుమల నడకదారి భక్తుల రక్షణకు ప్రత్యేక చర్యలు

Published Thu, Jan 4 2024 5:10 AM

Special measures for the protection of Tirumala Walkway devotees - Sakshi

సాక్షి, అమరావతి: తిరుమల నడక దారిలో భక్తుల రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ, అటవీ శాఖ, వైల్డ్‌ లైఫ్‌ ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇండియా(డబ్ల్యూఎల్‌ఐఐ) అధికారులంతా కలిసి సంయుక్తంగా నిర్ణయాలు తీసుకో­వాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే డబ్లుŠఎల్‌ఐఐ సమర్పించిన ప్రణాళికల అమలుకు కార్యాచరణ సిద్ధం చేయాలని టీటీడీని ఆదేశించింది. భక్తుల రక్షణ కోసం తీసుకునే దీర్ఘకాలిక చర్యలపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని టీటీడీని ఆదేశించింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌­రావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వన్యప్రాణుల సంచారం భక్తులకు ప్రమాదంగా మారుతున్న నేపథ్యంలో అలిపిరి నుంచి తిరుమల వరకు నడక దారి వెంట ఇనుప కంచె ఏర్పాటు చేసేలా టీటీడీ అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ తిరుపతికి చెందిన బీజేపీ నేత గుడిపల్లి భానుప్రకాశ్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా అటవీశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది ఖాసిం సాహెబ్‌ స్పందిస్తూ నడక మార్గంలో భక్తుల రక్షణకు ఏం చర్యలు తీసుకోవాలన్న దానిపై వైల్ట్‌లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా నేతృత్వంలోని నిపుణుల కమిటీ సమర్పించిన ప్రణాళికలను మెమో రూపంలో కోర్టు ముందుంచామన్నారు. ఆ నివేదికను పరిశీలించాలని కోరారు. ఆ నివేదికను పరిశీలించిన ధర్మాసనం, వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరిగేందుకు ఎక్కెడక్కడ అండర్‌ పాస్‌లు నిర్మించాలి, భక్తుల కోసం ఎక్కడ ఓవర్‌ పాస్‌లు నిర్మించాలి, ఎక్కడెక్కడ ఫెన్సింగ్‌ వేయాలన్న విషయంలో డబ్లుŠఎల్‌ఐఐ నివేదికలో స్పష్టత లేదని తెలిపింది.

ప్రణాళికల్లో స్పష్టత లేనప్పుడు వాటిని అమలు చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది. టీటీడీ తరఫు న్యాయవాది స్పందిస్తూ, డబ్లుŠఎల్‌ఐఐ నివేదిక అమలుకు కనీసం ఆరు నెలల సమయం పడుతుందని చెప్పారు. చిరుత దాడిలో మరణించిన చిన్నారి కుటుంబానికి టీటీడీ తరఫున రూ.10 లక్షలు, ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు అందజేసినట్టు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం, తిరుమల నడకదారిలో వన్యప్రాణుల స్వేచ్చా విహారానికి, భక్తుల రాకపోకలకు వీలుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. ఎక్కడెక్కడ వాటిని అమలు చేయాలన్న విషయంపై సంయుక్త సమావేశం నిర్వహించాలని టీటీడీని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 14కి వాయిదా వేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement