పెనుగొండకు తీపిగుర్తు..

30 Oct, 2020 10:46 IST|Sakshi

కమ్మని కజ్జికాయ.. ఖండాంతర ఖ్యాతి

కేజీ కావాలన్నా ఆర్డరు ఇవ్వాల్సిందే 

పెనుగొండ పేరు చెబితే వెంటనే గుర్తొకొచ్చేది వాసవీమాత ఆలయం. దాంతోపాటే ఈ ఊరుకు మరో ‘తీపి గుర్తు’ ఉంది. అదే నోరూరించే కమ్మని కజ్జికాయ. ఇక్కడ తయారయ్యే ఈ స్వీటుకు ఖండాంతరఖ్యాతి  దక్కింది. నోట్లో వేసుకోగానే కరిగిపోయే కజ్జికాయను మళ్లీమళ్లీ తినాలని తపించని మనసు ఉండదంటే అతిశయోక్తి కాదు.

పెనుగొండ: బందరు లడ్డూ, తాపేశ్వరం కాజా, ఆత్రేయపురం పూత రేకులు.. వీటి కోవలోకే వెళ్తుంది పెనుగొండ కజ్జికాయ కూడా. కొబ్బరి కోరుతో తయారయ్యే ఈ కజ్జికాయకు చాలా చరిత్ర ఉంది. తొలుత ఓ సామాన్య వ్యాపారి తయారు చేసిన ఈ తీపి పదార్థం ఇప్పుడు గొప్పింటి వివాహ వేడుకల్లో సందడి చేస్తోంది. రాజకీయ పారీ్టల సమ్మేళనాల విందు భోజనాల్లో చోటు సంపాదించి ఔరా అనిపిస్తోంది. విదేశాలకు రెక్కలు కట్టుకుని ఎగిరిపోతోంది. ఈ ప్రాంత వాసులు బంధువులకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు ముందుగా తీసుకెళ్లేది పెనుగొండ కజ్జికాయనే. అంతలా జనజీవితంలో భాగమైపోయింది ఈ స్వీటు. దీనిని చూడగానే హహ్హహ్హ కజ్జికాయ.. నాకే ముందు అంటూ ఎగబడని భోజనప్రియులు ఉండరు. (చదవండి:  కడలిపై.. హాయి హాయిగా..)

ఇతర ప్రాంతాలకూ విస్తరణ  
ఇటీవల కాలంలో ఇతర ప్రాంతాల్లోనూ పెనుగొండ వారి కజ్జికాయ అంటూ స్వీటు దుకాణాలు విరివిగా వెలుస్తున్నాయి. విశాఖపట్నం, రాజమండ్రి, తణుకు లాంటి ప్రాంతాల్లో సంప్రదాయ స్వీటు దుకాణాల్లో పెనుగొండ వారి కజ్జికాయ అంటూ ప్రతేక ఆకర్షణతో అమ్మకాలు సాగిస్తున్నారు. వీరిలో కొంతమంది నిత్యం పెనుగొండ నుంచే తీసుకొని వెళ్లి అమ్ముతున్నారు.  

45 ఏళ్లకు పైగా.. 
పెనుగొండ కజ్జికాయకు నలభై ఐదేళ్లకుపైగా చరిత్ర ఉంది. విసుమర్తి కాళిదాసు అనే స్వీట్‌ వ్యాపారి పెనుగొండలో చిన్న బండితో వినాయక స్వీటు పేరుతో వ్యాపారం ప్రారంభించి కజ్జికాయను ప్రత్యేకంగా తయారు చేసి పేరు సంపాదించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కజ్జికాయకు ఎదురు నిలిచే స్వీటు మాత్రం రాలేదు. కాళిదాసు తర్వాత ఆయన కుమారులు కజ్జికాయకు మరింత వన్నె తెచ్చారు. గతంలో కేవలం కొబ్బరి కోరుతో మాత్రమే చేసే కజ్జికాయకు నేడు జీడిపప్పు, ఇతర డ్రైఫ్రూట్స్‌ను మిళితం చేసి మరింత రుచిగా, సుచిగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు   కజ్జికాయను కనీసం కేజీ తీసుకోవాలన్నా ముందుగా ఆర్డరు చేసుకోవలసిందే. అంతటి యమ డిమాండ్‌ మరి..! మీరూ ఓ సారి టేస్ట్‌ చూడండి.. 

మరిన్ని వార్తలు