ఇక పక్కాగా వాహనాల ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు | Sakshi
Sakshi News home page

ఇక పక్కాగా వాహనాల ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు

Published Thu, Jan 25 2024 5:20 AM

The state govt taken another step towards prevention of road accidents - Sakshi

సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాదాల నివారణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అందుకోసం వాహనాల ఫిట్‌నెస్‌ పరీక్షలు సక్రమంగా నిర్వహించే దిశగా కార్యాచరణకు ఉపక్రమించింది. రోడ్డు ప్రమాదాలకు కారణాల్లో వాహనాలు తగిన ఫిట్‌నెస్‌తో లేకపోవడం ఒకటని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటివరకు రవాణా శాఖ అధికారులు వాహనాలను స్వయంగా పరిశీలించి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. సరైన ఫిట్‌నెస్‌ లేకపోయినా సర్టిఫికెట్లు జారీ చేస్తున్న ఉదంతాలు కోకొల్లలుగా ఉంటున్నాయి.

ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తూ పూర్తిగా ఆటోమేటెడ్‌ విధానంలో వాహనాల ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు జారీ చేసే వ్యవస్థను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం పూర్తిగా ఆటోమేటెడ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో 26 ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ సెంటర్లు  (ఏటీసీ)లు ఏర్పాటుకు ఉపక్రమించింది. పుణెలోని ఆటో మోటివ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఏఆర్‌ఏఐ) ప్రమాణాల మేరకు ఈ ఏటీసీలను డిజైన్‌ చేశారు.   

విశాఖపట్నంలో పైలట్‌ ప్రాజెక్ట్‌: రాష్ట్రంలో మొదటి ఏటీసీని  విశాఖపట్నంలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఏర్పాటు చేశారు. రూ. 18.50 కోట్లతో అక్కడ ఏటీసీ నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. మిగిలిన 25 జిల్లా కేంద్రాల్లో ఏటీసీల నిర్మాణానికి  రవాణా శాఖ టెండర్ల ప్రక్రియ చేపట్టింది. మొదటి దశలో  15 ఏటీసీల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ తుదిదశకు చేరుకుంది.

వాటిలో శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు,  నరసరావుపేట, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం ఏటీసీల నిర్మాణానికి త్వరలోనే బిడ్లను ఖరారు చేయనున్నారు. మిగిలిన జిల్లా కేంద్రాల్లో ఏటీసీల నిర్మాణానికి ఫిబ్రవరి మొదటివారం నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని రవాణా శాఖ భావిస్తోంది. ఏటీసీల టెండర్లు ఖరారు అయిన తరువాత ఏడాదిలోగా వాటిని ప్రారంభించాలన్నది రవాణా శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం  
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ఏటీసీలను ప్రభుత్వం నెలకొల్పుతోంది. తద్వారా వాహనాల ఫిట్‌నెస్‌ను శాస్త్రీయంగా పరీక్షించి సర్టిఫికెట్లను జారీ చేస్తారు. ఏడాదిలోగా ఈ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి.    – ఎంకే సిన్హా, రవాణా శాఖ కమిషనర్‌

ఏటీసీల స్వరూపం ఇలా.. 
జిల్లా కేంద్రానికి గరిష్టంగా 30 కి.మీ. దూరంలో  ఏటీసీలను నెలకొల్పుతారు. కనీసం 3 వేల చ.గజాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తారు. అధునాతన సెన్సార్లు, కంప్యూటర్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక డ్రైవింగ్‌ ట్రాకులను ని ర్మిస్తారు. విశాఖపట్నంలో పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద చేపట్టిన ఏటీసీలో నాలుగు లేన్లతో కూడిన డ్రైవింగ్‌ ట్రాక్‌లను ఏర్పాటు చేశారు. భారీ వాహనాలకు రెండు ట్రాక్‌లు, లైట్‌ వెహికిల్స్‌ను రెండు డ్రైవింగ్‌ ట్రాక్‌లను కేటాయించారు.

కాగా  మిగిలిన 25 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసే ఏటీసీలలో రెండేసి చొప్పున డ్రైవింగ్‌ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తారు. హెవీ వెహికిల్స్‌కు ఒక ట్రాక్, లైట్‌ వెహికిల్స్‌కు ఒక ట్రాక్‌ను కేటాయిస్తారు. ఫిట్‌నెస్‌కు వచ్చే వాహనాలు ఆ డ్రైవింగ్‌ ట్రాక్‌లలో ప్రయాణిస్తే... సెన్సార్ల ద్వారా వాటి ఫిట్‌నెస్‌ను పరీక్షిస్తారు. బ్రేకుల పనితీరు, ఇంజిన్‌ కండిషన్, ఇతర ప్రమాణాలను ఆటోమేటెడ్‌ విధానంలో నిర్ధారిస్తారు. దాంతో ఎలాంటి పొరపాట్లు లేకుండా సక్రమంగా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లను జారీ విధానాన్ని అమలులోకి తీసుకువస్తారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement