27 ఉత్తమ పంచాయతీలకు రాష్ట్రస్థాయి అవార్డులు  | Sakshi
Sakshi News home page

27 ఉత్తమ పంచాయతీలకు రాష్ట్రస్థాయి అవార్డులు 

Published Mon, Apr 24 2023 3:13 AM

State Level Awards for 27 Best Panchayats - Sakshi

సాక్షి, అమరావతి: జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని 27 గ్రామ పంచాయతీలను రాష్ట్రస్థాయి పురస్కారాలకు ప్రభుత్వం ఎంపిక చేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించే వేడుకల్లో ఆయా పంచాయతీలకు పురస్కారాలను అందజేస్తారు.

పరిపాలనలో కొన్ని అంశాల్లో గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ పార్లమెంట్‌ చేసిన 73వ రాజ్యంగ సవరణ అమల్లోకి వచ్చిన సందర్భంగా ఏటా ఏప్రిల్‌ 24వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజున ప్రతి పంచాయతీలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించి సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై చర్చిస్తారు.

జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో 26 జిల్లాల్లోను ఆ జిల్లా పరిధిలో కూడా తొమ్మిది ప్రధాన అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మూడేసి పంచాయతీల చొప్పున 27 పంచాయతీలకు జిల్లాస్థాయి పురస్కారాలు పంపిణీ చేయాలని పంచాయతీరాజ్‌ శాఖ ఇప్పటికే అన్ని జిల్లాల జెడ్పీ సీఈవోలు, డీపీవోలకు సూచించింది.  

30 ఏళ్లు పూర్తి.. మధ్యప్రదేశ్‌లో ప్రధాని కార్యక్రమం 
73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చి 30 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ ఈ ఏడాది జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని మరింత ఘనంగా నిర్వహించనుంది. మధ్యప్రదేశ్‌లోని రేవ గ్రామ పంచాయతీలో జరిగే జాతీయ పంచాయతీరాజ్‌ వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొని దేశవ్యాప్తంగా గ్రామీణ స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు, ఇతర బాధ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారని కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ వెల్లడించింది.

ప్రధాని కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో ప్రత్యక్ష ప్రసారానికి అవకాశం కల్పించాలని ఆయా రాష్ట్రాల పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శులకు కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ ఎకనమిక్‌ అడ్వయిజర్‌ బిజయకుమార్‌ బెహరా లేఖ రాశారు.   

రాష్ట్రస్థాయి ఉత్తమ పంచాయతీ అవార్డులకు ఎంపికైన గ్రామాలు.. విభాగాల వారీగా (బ్రాకెట్‌లో ఆ పంచాయతీ ఉన్న మండలం, జిల్లా పేరు) 
పేదరిక నిర్మూలన–ఉపాధి అవకాశాలు కల్పన 
1. గంగిరెడ్డిపల్లి (వీఎన్‌పల్లి, వైఎస్సార్‌), 
2. రాచర్ల (రాచర్ల, ప్రకాశం), 
3. మల్లూరు (ముత్తుకూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు) 

హెల్దీ పంచాయతీ  
1. తరువ (దేవరపల్లి, అనకాపల్లి) 
2. భీమవరం (హుకుంపేట, 
అల్లూరి సీతారామరాజు), 
3. నడింపాలెం (పత్తిపాడు, గుంటూరు)  

చైల్డ్‌ ఫ్రెండ్లీ పంచాయతీ  
1. కసిపాడు (పెదకూరపాడు, పల్నాడు), 
2. నేలమూరు (పెనుమట్ర, పశ్చిమగోదావరి), 
3. కుంతముక్కల (జి.కొండూరు, ఎన్టీఆర్‌)  

వాటర్‌ సఫిషియెంట్‌ పంచాయతీ  
1. ఇల్లూరు కొత్తపేట 
(బనగానపల్లి, నంద్యాల), 
2. వి.వి.కండ్రిక (కోడూరు, అన్నమయ్య), 
3. ధూపాడు (త్రిపురాంతకం, ప్రకాశం)  

క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ పంచాయతీ  
1. కడలూరు (తడ, తిరుపతి), 
2. బిల్లనందూరు (కోటనందూరు, కాకినాడ), 
3. జోగింపేట (సీతానగరం, పార్వతీపురం మన్యం)  

సెల్ప్‌ సఫిషియెంట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పంచాయతీ  
1. నందిగాం (నందిగాం, శ్రీకాకుళం), 
2. కట్టకిందపల్లి (అనంతపురం రూరల్, అనంతపురం), 
3. సూరప్పగూడెం (భీమడోలు, ఏలూరు)  

సోషియల్లీ సెక్యూర్డ్‌ పంచాయతీ  
1. వెస్ట్‌ పెద్దివారిపాలెం (యద్దనపూడి, బాపట్ల), 
2. మందగేరి (ఆదోని, కర్నూలు), 
3. రామభద్రాపురం (రామభద్రాపురం– విజయనగరం)  

పంచాయతీ విత్‌ గుడ్‌గవర్నెన్స్‌  
1. సఖినేటిపల్లిలంక (సఖినేటిపల్లి, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ), 
2. నగరపాలెం (భీమునిపట్నం, విశాఖపట్నం), 
3. చోరగుడి (పమిడిముక్కల, కృష్ణా)  

ఉమెన్‌ ఫ్రెండ్లీ పంచాయతీ  
1. మేడాపురం (సీకేపల్లి, శ్రీసత్యసాయి), 
2. జేగురపాడు (కడియం, తూర్పు గోదావరి), 
3. మార్టూరు (అనకాపల్లి, అనకాపల్లి) 

Advertisement

తప్పక చదవండి

Advertisement