‘స్మార్ట్‌ ఫోన్‌ మా అబ్బాయిని అంతర్జాతీయ క్రికెటర్‌గా మార్చేసింది’ | Sakshi
Sakshi News home page

‘స్మార్ట్‌ ఫోన్‌ మా అబ్బాయిని అంతర్జాతీయ క్రికెటర్‌గా మార్చేసింది’

Published Sat, Jan 13 2024 7:46 AM

Success story To International Cricketer Ravuri Yashwant Naidu  - Sakshi

అతనికి పుట్టుకతోనే వినికిడి లోపం. పైగా మాటలు రావు. ఏ భాష సరిగా చదవడం రాదు... రాయడమూ పూర్తిగా రాదు. సైగలతోనే తన భావాలను వ్యక్తంచేస్తాడు. సాధారణ పాఠశాలలోనే చదివాడు. కష్టపడి డిప్లొమా పూర్తిచేశాడు. పదో తరగతి పాసైన తర్వాత తల్లి కొనిచ్చిన స్మార్ట్‌ ఫోన్‌లో చూసి తనకు ఇష్టమైన క్రికెట్‌ నేర్చుకున్నాడు. అంతర్జాతీయ బధిరుల క్రికెట్‌లో నంబర్‌ వన్‌ బౌలర్‌గా ఎదిగాడు. గంటకు 140 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్‌ చేస్తూ బ్యాటర్లకు ఒక చాలెంజ్‌గా మారాడు. ఇదీ.. ఎనీ్టఆర్‌ జిల్లా కొండపల్లికి చెందిన బధిరుల అంతర్జాతీయ క్రికెటర్‌ రావూరి యశ్వంత్‌ నాయుడు విజయగాథ. 

సాక్షి, అమరావతి: కొండపల్లికి చెందిన రావూరి యశ్వంత్‌నాయుడు స్మార్ట్‌ ఫోన్‌లో చూస్తూ క్రికెట్‌ నేర్చుకున్నాడు. మంచి బౌలర్‌గా ఎదిగాడు. ఫోన్‌లో క్రికెట్‌ పాఠాలు నేర్చుకుంటూ ఉండగా, ఆన్‌లైన్‌లో వచి్చన చిన్న మెసేజ్‌ చూసి 2015లో ఢిల్లీలో సెలక్షన్స్‌కు వెళ్లాడు. అప్పుడే తొలిసారిగా బధి­రుల జాతీయ జట్టు ఏర్పడటంతోపాటు యశ్వంత్‌కు చోటు దక్కింది. ఆ తర్వాత జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. అంతకుముందు ఏపీ తరఫున మ్యాచ్‌లు ఆడాడు. 

అప్పులు చేసి అండగా నిలిచిన తల్లి  
గత ఏడాది బధిరుల క్రికెట్‌ను బీసీసీఐ దత్తత తీసుకుంది. అప్పటివరకు మ్యాచ్‌లకు వెళితే ఖర్చంతా క్రీడాకారులదే. యశ్వంత్‌ తండ్రి నాగేశ్వరరావు 2015లో అనారోగ్యంతో చనిపోయారు. నాటి నుంచి అతనిని తల్లి బేబి అన్ని విధాలా ప్రోత్సహించారు. కుమారుడు క్రికెట్‌ ఆడేందుకు వెళ్లడానికి అప్పులు చేసి డబ్బులిచ్చారు. యశ్వంత్‌ 20ఏళ్ల వయసులో ఢిల్లీలో జరిగిన తొలి బధిరుల వరల్డ్‌ కప్‌లో భారత్‌ తరఫున ఆడాడు. ఆ టోరీ్నలో మనదేశం విజేతగా నిలిచింది. సాధారణ అంతర్జాతీయ పేసర్లతో సమానంగా బౌలింగ్‌ చేయగలిగిన యశ్వంత్‌ 135 జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 167 వికెట్లు తీశాడు. అయినా యశ్వంత్‌కు మ్యాచ్‌ ఫీజు ఉండదు. ఒక సిరీస్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిస్తే రూ.1,100 ఇచ్చారు. వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్టు మొత్తానికి రూ.లక్ష ఇచ్చా­రు. వరల్డ్‌ కప్‌ గెలిచిన సమయంలో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఇచి్చన విందులో పాల్గొన్నాడు. అతని కుటుంబ సభ్యులకు ఆహా్వనం ఉన్నా డబ్బులు లేక వెళ్లలేకపోయారు. గతంలో యశ్వంత్‌కు రూ.5లక్షలు ఇవ్వాలని శాప్‌ను ప్రభుత్వం ఆదేశిస్తూ లెటర్‌ ఇచ్చినా డబ్బులు లేవన్నారు. 

మెక్‌గ్రాత్‌ నుంచి మెళకువలు.. 
గోకరాజు గంగరాజు సహకారంతో 2016లో మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో యశ్వంత్‌కు కోచింగ్‌ తీసుకునే అవకాశం దక్కింది. అప్పుడే ఆ్రస్టేలియా దిగ్గజ బౌలర్‌ గ్లేన్‌ మెక్‌గ్రాత్‌ వచ్చారు. ఆయన యశ్వంత్‌ బౌలింగ్‌ని మెచ్చుకుని ఎన్నో మెళకువలు నేరి్పంచారు.  

స్టెయిన్‌ నా ఫేవరెట్‌.. 
‘నాకు అమ్మంటే ఎంతో ఇష్టం. మా అక్క సుమ నా విజయంలో వెన్నంటే ఉంటుంది. సౌతాఫ్రికా ఫాస్ట్‌ బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌ నా ఫేవరెట్‌. బ్యాటింగ్, కోచింగ్‌లో ద్రావిడ్‌ను చూసి ఎంతో నేర్చుకున్నా. ఈ ఏడాది ఖతార్‌లో జరగాల్సిన బధిర టీ20 వరల్డ్‌ కప్‌ వాయిదా పడింది. దాని సెలక్షన్స్‌కు వెళ్లే ముందు మంగళగిరి క్రికెట్‌ అకాడమీలో ప్రాక్టీస్‌ చేస్తుంటే కుడి మోకాలు వద్ద గాయమైంది. నాలుగు నెలలు రెస్ట్‌. త్వరలో బంగ్లాదేశ్‌లో ఆసియా కప్, కేరళలో సౌత్‌ జోన్, జమ్మూ–కశ్మీర్‌ డెఫ్‌ ఐపీఎల్‌కు సన్నద్ధమవుతున్నా.’  
– సైగల ద్వారా వెల్లడించిన రావూరి యశ్వంత్‌ 

స్మార్ట్‌ ఫోన్‌ మా అబ్బాయి జీవితాన్ని మార్చింది 
‘స్మార్ట్‌ఫోన్‌ పిల్లలను చెడగొడుతుందంటారు. మా అబ్బాయిని మాత్రం అంతర్జాతీయ క్రికెటర్‌గా తీర్చిదిద్దింది. మావాడికి పుట్టకతోనే వినికిడి లోపం. పైగా మాటలు రావు. వాడు 10వ తరగతి పాసైన తర్వాత ఒక చిన్న స్మార్ట్‌ఫోన్‌ కొనిచ్చా. దానిలో వీడియోలు చూస్తూ అంతర్జాతీయ బధిర క్రికెట్‌ బౌలర్లలో నంబర్‌ వన్‌గా ఎదిగాడు. ఇప్పుడు నా కొడుకు ఆటను నేను స్మార్ట్‌ ఫోన్‌లో చూస్తున్నాను.’  
– బేబి, అంతర్జాతీయ క్రికెటర్‌ రావూరి యశ్వంత్‌ తల్లి    
 

Advertisement

తప్పక చదవండి

Advertisement