సచివాలయాల ద్వారా ట్యాబ్‌లకు రిపేర్లు    | Sakshi
Sakshi News home page

సచివాలయాల ద్వారా ట్యాబ్‌లకు రిపేర్లు   

Published Thu, Apr 6 2023 5:42 AM

Tabs Repair in Secretariats - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా అందజేసిన ట్యాబ్‌లలో ఏదైనా సమస్య వస్తే.. వాటిని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పరిష్కరించనున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమా ణాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 8వ తరగతి చదువుతున్న 5,18,750 మంది పిల్లలకు ట్యాబ్‌లు పంపిణీ చేసింది. అయితే వాటిలో ఏదైనా సమస్య వస్తే.. విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశముంది.

ఈ పరిస్థితిని నివారించేందుకు ట్యాబ్‌ల సర్వీసు అంశాల పర్యవేక్షణ కోసం సచివాలయాల్లో పనిచేసే వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లు, వార్డు ఎడ్యు కేషన్‌ అండ్‌ డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీలను నోడల్‌ అధికారులుగా నియమించారు. అలాగే ట్యాబ్‌ల సర్వీస్‌ అంశాల పర్యవేక్షణకు గ్రామ, వార్డు సచి వాలయాల శాఖ ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను కూడా రూపొందించింది. ట్యాబ్‌ రిపేర్‌ ప్రక్రియపై కలె క్టర్లు, సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్లతో పాటు అన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు ఆ శాఖ ఆదేశాలు జారీ చేసింది. 

ఏ సచివాలయంలోనైనా ట్యాబ్‌ సర్వీస్‌ పొందే వీలు..
 సమస్య ఏర్పడిన ట్యాబ్‌ను విద్యార్థి గానీ తలిదండ్రులు లేదా పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధా నోపాధ్యాయులు ఎవరో ఒకరు తమకు సమీపంలోని సచివాలయంలో పనిచేసే వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లు, వార్డు ఎడ్యుకేషన్‌ అండ్‌ డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీలకు అందజేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ఏ సచివాలయంలోనైనా ఈ సేవను విద్యార్థులు ఉపయోగించుకోవచ్చు. 

ట్యాబ్‌ రిపేరు ప్రక్రియకు సంబంధించిన సమాచారం కోసం ఫోన్‌ నంబర్‌ను కూడా నమోదు చేస్తారు. ట్యాబ్‌ సమస్య పరిష్కారమైన తర్వాత సంబంధిత సచివాలయ సిబ్బందే దానిని సేకరించి.. తిరిగి విద్యార్థికి అందజేస్తారు. 

ట్యాబ్‌ రిపేర్‌ చేయడానికి వీలుపడకపోతే ‘వారంటీ’ నిబంధనలకు లోబడి ఆ సర్వీసు సెంటర్‌ నుంచే కొత్త ట్యాబ్‌ను సంబంధిత సచివాలయ సిబ్బంది సేకరించి విద్యార్థికి అప్పగిస్తారు. కాగా, ఈ ప్రక్రియపై అవగాహన కోసం రాష్ట్రవ్యాప్తంగా వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లు, వార్డు ఎడ్యుకేషన్‌ అండ్‌ డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీలకు 8 విడతలలో   శిక్షణ ఇచ్చారు.

Advertisement
Advertisement