పోస్టల్‌ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు

Published Mon, May 6 2024 5:38 AM

TDP conspiracy politics in postal voting too

ఓటమి భయంతో పచ్చదండు అకృత్యాలు.. యథేచ్ఛగా ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు

అడుగడుగునా ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరించిన టీడీపీ శ్రేణులు

పోలింగ్‌ కేంద్రాల సమీపంలోనే నగదు పంపిణీ

అడ్డుకునేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడికి యత్నాలు

గతంలో యూనియన్‌ నేతలుగా పనిచేసిన వారితో ఉద్యోగులకు ఫోన్లు చేయించి బెదిరింపులు

పోలింగ్‌ అధికారులు, పోలీసులకు సైతం హెచ్చరికలు

సాక్షి నెట్‌వర్క్‌: ఓటమి భయం వెంటాడుతుండటంతో టీడీపీ నేతలు కుట్ర రాజకీయాలకు తెరలేపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌కు హాజరయ్యే ఉద్యోగు­లను ప్రలోభపెట్టేలా.. ఎన్నికల నియమావళి యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ అకృత్యాలకు తెగబడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా పోస్టల్‌ బ్యాలెట్ల పోలింగ్‌ ఆదివారం ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీ వరకు ఈ ప్రక్రియ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసింది.

వివిధ ప్రాంతా­ల్లోని ఫెసిలిటేషన్‌ కేంద్రాలకు పోలీసులు, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఓటుహక్కు వినియోగించుకునేందుకు రాగా.. వారిని సామ, దాన, దండోపా­యాలతో లోబర్చుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. పోలింగ్‌ కేంద్రాల సమీపంలోనే నగదు పంపిణీ చేశారు. అడ్డుకునేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ శ్రేణులపై పచ్చదండు దాడులకు యత్నించింది. టీడీపీ హయాంలో ఉద్యోగ సంఘాల నేతలుగా పనిచేసిన వారితో ఉద్యోగులకు ఫోన్లు చేయించి బెదిరింపులకు దిగారు. కొన్నిచోట్ల పోలింగ్‌ అధికారులను, పోలీసులను సైతం బెదిరించారు.

విశాఖలో ఇలా..
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియను ఏయూ తెలుగు, ఆంగ్ల మాధ్యమం పాఠశాలల్లో చేపట్టారు. పోలింగ్‌ కేంద్రం ఎదురుగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వెలగపూడి రామకృష్ణ­బాబు, గంటా శ్రీనివాసరావు అనుచరులు హల్‌చల్‌ చేశారు. వెలగపూడి అనుచరుడు కాళ్ల శంకర్, టీడీపీ నాయకుడు పోతన్న రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ బొట్ట వెంకట రమణ అక్కడే ఉండి ప్రత్యక్షంగా టీడీపీకి ప్రచారం చేశారు. వెలగపూడికి చెందిన రెండు ప్రచార వాహనాలు ఏయూ ఇన్‌గేట్, అవుట్‌ గేట్‌ మధ్యలో భారీ శబ్ధంతో కూడిన మైక్‌లను పెట్టుకుని అటూఇటూ తిరుగుతూ ప్రచారం చేశారు. కొంత­మంది ఓటర్లకు డబ్బులు పంపిణీ, మరికొందరికి గూగుల్‌పే, ఫోన్‌ పే చేస్తూ ప్రలోభాలకు గురి చేశారు.

చిత్తూరులోనూ ఇదే పద్ధతి
తిరుపతిలో పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రచారం పేరుతో టీడీపీ నేతలు హల్‌చల్‌ చేశారు. పోలింగ్‌ కేంద్రాలకు అత్యంత సమీపంలోనే కొందరు ఓటర్లకు బలవంతంగా నగదు పంపిణీకి యత్నించారు. ఎన్నికల అధికారులను, పోలీసుల హెచ్చరికలను సైతం ఏమాత్రం లెక్కచేయలేదు. ఉద్యోగ సంఘ మాజీ నేతలు కొందరు ప్రలోభాల పర్వానికి సహకరించారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో టీడీపీ ప్రచార వాహనాలు యథేచ్ఛగా తిరిగినా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు.

చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనూ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లకు పెద్దఎత్తున ప్రలోభాలకు గురి చేశారు. పుంగనూరులో ఓటర్లను బెదిరించారు. పూతలపట్టులో విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారు. పలమనేరులోని ఓ హోటల్‌లో ఉద్యోగులకు విందు ఏర్పాటు చేశారు. నగరిలో ఉపాధ్యాయులకు యూనియన్‌ మాజీ నేతల ద్వారా ఫోన్లు చేయించి బెదిరింపులకు దిగారు.

పులివెందులలో అధికారికి బెదిరింపు
వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో పోలింగ్‌ ట్రైనింగ్‌ అధికారి సంగం మహేశ్వరరెడ్డిపై టీడీపీ నాయ­కులు అక్కులుగారి విజయ్‌కుమార్‌రెడ్డి, దర్బార్‌­బాషా, అంజుగట్టు రవితేజారెడ్డి దౌర్జన్యానికి దిగారు. ఆయనను దుర్భాషలాడుతూ బయటకు నెట్టివేశారు. అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసు­కుని వివాదాన్ని సర్దుబాటు చేశారు. టీడీపీ నాయ­కులు అధికారులను, ప్రజలను భయభ్రాంతు­లకు గురిచేసి పోలింగ్‌ ప్రక్రియ సజావుగా సాగకుండా ఇలాంటి వివాదాలకు పాల్పడుతున్న­ట్టు అవగతమ­వుతోంది.

బద్వేలులోని జెడ్పీ హైస్కూల్‌లోని ఫెసిలిటేషన్‌ సెంటర్‌కు సమీపంలో ప్రభుత్వ కార్యాలయాల సము­దాయంలో తిష్టవేసిన టీడీపీ నేతలు ఓటర్లకు డబ్బు పంపిణీచేశారు. కాశినా­యన మండలం నరసా­పురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు షేక్‌­హుస్సేన్‌ ఓటర్లకు డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కాడు.

తిరుపతిలో తాయిలాల ఎర
తిరుపతి జిల్లాలోని 7 నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లోని ఫెసిలిటేషన్‌ సెంటర్ల వద్ద టీడీపీ, జనసేన అభ్యర్థులు హల్‌చల్‌ చేశారు. ముందురోజు రాత్రే కొందరు ఉద్యోగులకు తాయిలాల ఎర చూపారు. శ్రీకాళహస్తిలో పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ సెంటర్‌ వద్ద టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్‌ హడావుడి చేశారు. నిబంధనల్ని ఉల్లంఘించిన ఆయనను పోలీసు అధికారులు ప్రశ్నించడంతో సుధీర్‌ మీ అంతు చూస్తా అంటూ బూతు పురాణం అందుకున్నారు.

గుంటూరులో తికమకపెట్టేలా..
గుంటూరులో ప్రభుత్వ ఉద్యోగులను తికమకపెట్టే విధంగా సామాజిక మాధ్యమాల్లో టీడీపీ నేతలు పోస్టింగ్‌లు పెట్టారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయగా.. అధికారుల మధ్య సమన్వయలోపం, అవగాహన రాహిత్యం బట్టబయలయ్యాయి. పశ్చిమ నియోజ­కవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి కార్యాలయం నుంచి బ్యాలెట్‌ ఓటింగ్‌ వద్ద గొడవ జరుగుతోందని, రెచ్చగొట్టే విధంగా మెసేజ్‌లు పెట్టారు.

Advertisement
Advertisement