వెలిగొండను తొలిచిన తొండ! | Sakshi
Sakshi News home page

వెలిగొండను తొలిచిన తొండ!

Published Fri, Feb 9 2024 5:06 AM

TDP government corruption in Veligonda project works - Sakshi

సాక్షి, అమరావతి: ప్రకాశం, ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంతాల్లో 4.38 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో టీడీపీ సర్కార్‌ కొండంత అవినీతికి పాల్పడిందని కాగ్‌ (కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) కడిగి పారేసింది.

గడువుకు ముందే బ్యాంకు గ్యారంటీలను విడుదల చేయడం, బీమా ఛార్జీలను తిరిగి చెల్లించడం, ధరల వ్యత్యాసం (జీవో 22తో అదనంగా రూ.630.57 కోట్ల చెల్లింపు) రూపంలో కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చిందని ఎండగట్టింది. 

నాడు అవినీతి.. నేడు ఆదా
వెలిగొండ మొదటి సొరంగంలో ఈపీసీ (ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌) పద్ధతిలో అప్పగించిన పనులను ఆలస్యంగా చేస్తున్నారనే సాకుతో 2018 ఆగస్టులో 3.6 కి.మీ. పనులను పాత కాంట్రాక్టర్‌ నుంచి తొలగించి ఎల్‌ఎస్‌ (లంప్సమ్‌ ఓపెన్‌) విధానంలో కట్టబెట్టడం ద్వారా రూ.117.97 కోట్ల మేర లబ్ధి చేకూర్చారని తూర్పారబట్టింది.

ఇక రెండో సొరంగంలో రూ.421.29 కోట్ల విలువైన 8.097 కి.మీ. పనులను ఈపీసీ విధానంలో చేస్తున్న పాత కాంట్రాక్టర్‌ నుంచి తొలగించి ఎల్‌ఎస్‌ ఓపెన్‌ పద్ధతిలో రూ.470.78 కోట్లకు పెంచి కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించడం ద్వారా రూ.49.49 కోట్లను దోచిపెట్టారు. ఈ పనులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించడం ద్వారా ఖజానాకు రూ.61.67 కోట్లను మిగిల్చిందని కాగ్‌ పేర్కొంది.

వెలిగొండలో 2017–18 నుంచి 2020–21 మధ్య జరిగిన పనులు, చెల్లింపులపై కాగ్‌ తనిఖీలు నిర్వహించి రూపొందించిన నివేదికను గురువారం శాసనసభలో ప్రవేశపెట్టింది. 

కాగ్‌ నివేదికలో ప్రధానాంశాలు ఇవీ..
♦ శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే 30 రోజుల్లో 43.5 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ కడప జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించే లక్ష్యంతో 2005లో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి వెలిగొండ ప్రాజెక్టును చేపట్టారు.

శ్రీశైలం నుంచి 160.64 క్యూసె­క్కులు తరలించే సామర్థ్యంతో మొదటి సొరంగం, 322.68 క్యూమెక్కులు తరలించే సామర్థ్యంతో రెండో సొరంగం, వాటి నుంచి 53.85 టీఎంసీల సామర్థ్యంతో నల్లమల­సాగర్‌కు తరలించేలా ఫీడర్‌ ఛానల్, డిస్ట్రి­బ్యూటరీల వ్యవస్థ ఏర్పాటు పనులను ఆరు ప్యాకేజీల కింద కాంట్రాక్టర్లకు అప్పగించారు.

♦ 2014 నాటికే నల్లమలసాగర్, ఫీడర్‌ ఛానల్, సొరంగాలు సహా చాలా వరకూ పనులు పూర్తయ్యాయి. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్‌ తక్షణమే పూర్తి చేసి ప్రాజెక్టు ఫలాలను రైతులకు అందిస్తామంటూ ఖజానాను కాంట్రాక్టర్లతో కలిసి దోచుకుంది.

♦ మొదటి, రెండో సొరంగాల్లో రూ.29.35 కోట్ల విలువైన పనులను పాత కాంట్రాక్టర్ల నుంచి తొలగించి వాటి వ్యయాన్ని రూ.95.44 కోట్లకు పెంచేసి కొత్త కాంట్రాక్టర్‌కు 2017 ఆగస్టులో టీడీపీ సర్కార్‌ అప్పగించింది. దీని ద్వారా కాంట్రాక్టర్‌కు రూ.66.09 కోట్లను అప్పనంగా దోచిపెట్టింది. 

♦ మొదటి, రెండో సొరంగంలో ఈపీసీ విధానంలో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు జాప్యం చేస్తున్నారనే నెపంతో వారిపై వేటు వేసి అంచనా వ్యయాన్ని పెంచి కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించారు. దీనివల్ల కాంట్రాక్టర్లకు లబ్ధి, ఖజానాపై భారం పడిందే కానీ పనుల్లో ఎలాంటి పురోగతి 
సాధించలేదు.  

Advertisement
Advertisement