నాలుక మడతేస్తూ 'నయవంచన' | Sakshi
Sakshi News home page

నాలుక మడతేస్తూ 'నయవంచన'

Published Wed, Apr 10 2024 4:26 AM

TDP Leader Chandrababu Double Game On Volunteers System - Sakshi

గతంలో నోటికి వచ్చినట్లు వలంటీర్లను తిట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు 

అవి గోనె సంచులు మోసే ఉద్యోగాలంటూ ఎద్దేవా 

రాత్రిళ్లు తలుపులు కొడుతున్నారంటూ అవమానకర ఆరోపణలు 

ఇప్పుడు ఎన్నికల సమయంలో నాలుక మడత.. ఆ వ్యవస్థను కొనసాగిస్తామంటూ కొత్త డ్రామా 

మరోవైపు.. వలంటీర్లను అదేపనిగా తిడుతున్న టీడీపీ నేతలు 

వారిని ఉగ్రవాదులన్న శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుదీర్‌ 

తమ పార్టీ ఫిర్యాదువల్లే వారితో పింఛన్ల పంపిణీ ఆగిందన్న ఆదిరెడ్డి వాసు.. వలంటీర్లను కొనసాగిస్తాంఅంటున్న చంద్రబాబు 

ఎన్నికల వేళ టీడీపీ డబుల్‌గేమ్‌ 

సాక్షి, అమరావతి: నరంలేని నాలుక ఎన్ని వంకర్లయినా తిరుగుతుంది.. టీడీపీ అధినేత చంద్రబాబులా ఏదైనా మాట్లాడుతుంది. నిన్నటి వరకూ వలంటీర్లను ఇష్టం వచ్చినట్లు తిట్టిన నోటితోనే ఇప్పుడు వారిని కొనసాగిస్తామని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇస్తున్న గౌరవ వేతనం కంటే ఎక్కువ ఇస్తామంటూ ఊసరవెల్లే సిగ్గుపడేలా ఎన్నికల వేళ చంద్రబాబు రంగులు మారుస్తున్నారు. తనకు రాజకీయ అవసరం తప్ప దేనిపైనా ఒక నిర్దిష్టంగా విధానమంటూ ఉండదని తన అవకాశవాద నైజాన్ని ఆయన మరోసారి చాటుకున్నారు.

తాను అధికారంలోకి వస్తే వలంటీర్లకు ఇప్పుడిస్తున్న రూ.5 వేల గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతానని ఉగాది వేడుకల సందర్భంగా చంద్రబాబు ప్రకటించడంతో టీడీపీ నేతలే అవాక్కయ్యారు. మూడ్రోజుల క్రితమే వలంటీర్లకు నెలనెలా రూ.50 వేలు వచ్చేలా చేస్తానని ఆయన నమ్మబలికారు. అసలు ఆ వ్యవస్థ పనికి రానిదని, దాన్ని రద్దుచేస్తానన్న నోటితోనే ఇప్పుడు దాన్ని కొనసాగిస్తానని పొంతలేని మాటలంటూ ‘నయా’వంచన చేస్తున్నారు. అవసరార్థం ఎప్పటికప్పుడు తన విధానాలు, మాటలకు తూచ్‌ చెబుతూ ఎక్కడికక్కడ ఊసరవెల్లిలా చంద్రబాబు రంగులు మార్చడం చూసి సొంత పార్టీ వాళ్లే నోరెళ్లబెడుతున్నారు. 
 
అప్పుడు అన్ని మాటలు అని..  
నిజానికి.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేస్తున్న వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు, టీడీపీ, జనసేన నేతలు గతంలో చేసిన దు్రష్పచారం అంతా ఇంతా కాదు. వలంటీర్లు చేసేది గోనె సంచులు మోసే ఉద్యోగమని, అవి ఉద్యోగాలా అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాత్రిళ్లు ఇళ్లకు వెళ్లి తలుపులు కొడుతున్నారని, ఆడవాళ్లకు వలంటీర్ల వల్ల రక్షణ కరువైందంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఊళ్లలో వలంటీర్లు న్యూసెన్స్‌గా మారారని, వీళ్లు ప్రభుత్వానికి ఏజెంట్లుగా మారారని.. అంతేకాక, బెదిరింపులు, అవినీతికి పాల్పడుతున్నారని ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేశారు.

ఆయన దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్‌ అయితే మరింత రెచ్చిపోయి రాష్ట్రంలో వేలాది మంది మహిళలు అదృశ్యమవుతున్నారని, అందుకు వలంటీర్లే కారణమని వారిపై అడ్డగోలు అభాండాలు వేశారు. తామొస్తే వలంటీర్ల వ్యవస్థ నడుం విరగ్గొడతామంటూ బరితెగించి మాట్లాడారు. ఎల్లో మీడియాలో అయితే వలంటీర్లకు వ్యతిరేకంగా టన్నుల కొద్దీ వ్యతిరేక కథనాలు అచ్చోసింది. చివరికి.. వలంటీర్ల వ్యవస్థను ఆపేందుకు చంద్రబాబు తన మనుషుల ద్వారా కోర్టుల్లో పిటిషన్లు సైతం వేయించారు. వారిని అడ్డుకోవడం ద్వారా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను ఆపడానికి ఆయన చేయని కుట్రలేదు.  
 
నిమ్మగడ్డ ద్వారా వలంటీర్లకు బ్రేకులు.. 
చివరికి.. తన కోసమే పనిచేసే, తన నమ్మిన బంటు అయిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ద్వారా కోర్టుకు వెళ్లి ఎన్నికల సమయంలో వారు విధుల్లో పాల్గొనకుండా అడ్డుకున్నారు. తద్వారా ఈనెల వృద్ధులు, దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ల పంపిణీని అడ్డుకున్నారు. ఇంటింటికీ వెళ్లి వారికి వలంటీర్లు పింఛన్లు ఇవ్వకుండా ఆపి అనేకమంది వృద్ధుల మరణాలకు కారకుడిగా నిలిచారు. దీంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబికింది.

చంద్రబాబు తమకిచ్చే పింఛన్లు రాకుండా అడ్డుకున్నారనే విషయం ప్రతి పింఛన్‌దారునికి అర్థమవడంతో ఆయన వెంటనే తన నాలుక మడతేశారు. తాను పింఛన్ల పంపిణీని ఆపమనలేదని, వలంటీర్లకు తాము వ్యతిరేకం కాదంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అంతేకాక.. ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖలు రాసి ఇంటింటికీ పింఛన్ల పంపిణీ చేయాలని మొసలికన్నీరు కారుస్తూ తెగ హడావుడి చేశారు. అయితే, అప్పటికే చంద్రబాబు చేసిన నష్టం, ఆడిన నాటకాలు ప్రజలకు తెలిసిపోయింది. 
 
టీడీపీ నేతల బరితెగింపు వ్యాఖ్యలు.. 
ఇదిలా ఉంటే.. పింఛన్ల పంపిణీపై తన కుట్ర బెడిసికొట్టడంతో నిమిషాల్లో చంద్రబాబు స్వరం మార్చినా టీడీపీ నేతలు మాత్రం మరింత రెచ్చిపోయారు.  
► రాజమండ్రి అర్బన్‌ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు తాము చేసిన ఫిర్యాదులవల్లే వలంటీర్ల వ్యవస్థ ద్వారా జరిగే ఇంటింటికీ పింఛన్ల పంపిణీ నిలిచిపోయిందని బహిరంగంగా చెప్పారు. ఇది తమ ఘనతేనని మీడియా సమావేశంలో ఆయన గొప్పగా ప్రకటించుకున్నారు.  
► శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుదీర్‌రెడ్డి అయితే వలంటీర్లు ఉగ్రవాదులని, స్లీపర్‌ సెల్స్‌లా పనిచేస్తున్నారంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు.  
► అలాగే, కనిగిరి టీడీపీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి రూ.3 వేలు పింఛను తీసుకోకపోతే ముసలోళ్లు చచ్చిపోతారా అంటూ జుగుప్సాకర వ్యాఖ్యలు చేశారు.  
..ఇలా టీడీపీ నేతలంతా వలంటీర్లు, అవ్వాతాతల  పింఛన్లపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. అంతటితో ఆగకుండా వలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించినప్పుడు టీడీపీ శ్రేణులు సంబరాలు కూడా చేసుకున్నాయి.  
 
ప్రజాగ్రహంతో నయా..వంచన 
ఈ నేపథ్యంలో.. వలంటీర్లు, పింఛనర్లకు వ్యతిరేకంగా టీడీపీ వికృతంగా ఆడిన ఈ రాజకీయ క్రీడతో ప్రజల్లో చంద్రబాబు, టీడీపీ, జనసేనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. తమ నోటి దగ్గర కూడును చంద్రబాబు తీసివేశారని తిట్టని పింఛనర్లు లేరు. దీంతో బెంబేలెత్తిపోయిన చంద్రబాబు ప్లేటు ఫిరాయించారు. వలంటీర్లపై కొత్త మోసానికి తెరతీశారు. నష్ట నివారణకు తాను వ్యతిరేకించిన వ్యవస్థను పొగుడుతూ కొత్త పాచిక విసిరారు. చివరికి తాను అధికారంలోకొస్తే వారిని కొనసాగిస్తానని, గతం కంటే ఎక్కువ భృతి ఇస్తానని చెబుతూ వారిని ఆకట్టుకునేందుకు మరో డ్రామా మొదలుపెట్టారు.

ఇన్నాళ్లూ తిట్లు, శాపనార్థనాలతో అడుగడుగునా అవమానించిన వారిని నెత్తిన పెట్టుకుంటానంటూ చంద్రబాబు కల్లబొల్లి కబుర్లు చెబుతుండడం చూసి వలంటీర్లు ఆయన్ను వింతగా చూస్తున్నారు. తమను లేకుండా చేస్తామన్న వారే ఇప్పుడు ఓట్ల కోసం తమకు గేలం వేస్తుండడం చూసి హేళనగా నవ్వుకుంటున్నారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు గతంలో చాలా చూసినా ఇప్పుడు తమతో ఆడుతున్న నాటకాలు చూసి వలంటీర్లు ఛీదరించుకుంటున్నారు.  
 
టీడీపీకి విరాళాలివ్వండి.. 
ఇక టీడీపీకి విరాళాలివ్వాలని చంద్రబాబు కోరారు. పార్టీకి విరాళలిచ్చేందుకు తీసుకువచ్చిన వెబ్‌సైట్‌ను మంగళవారం టీడీపీ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. తన వంతుగా రూ.99,999లు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో తమ పార్టీకి కార్యాలయాలు లేవన్నారు. టీడీపీ ఏనాడూ భూములు తీసుకుని ప్యాలెస్‌లు కట్టలేదని చెప్పారు. అంతకుముందు.. టీడీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు, పంచాగ శ్రవణం జరిగాయి. 
  
జన్మభూమి కమిటీలతో ద్రోహం చేసినట్లేగా.. 
ఇదిలా ఉంటే.. వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తానని చెప్పడం ద్వారా తన హయాంలోని జన్మభూమి కమిటీలతో ప్రజలు దగా పడ్డారనే విషయాన్ని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. అప్పట్లో జన్మభూమి కమిటీలు ప్రజలను ఎన్నో రకాలుగా రాచి రంపాన పెట్టాయి. ప్రభుత్వ సేవలు, పథకాలు అందాలంటే ఈ కమిటీలకు లంచాలు ఇచ్చుకోవాల్సిందే. దీనిపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చి తెలుగుదేశం పార్టీపై జనం తిరుగుబాటు చేసే పరిస్థితి ఏర్పడింది.

ఫలితంగానే 2019 ఎన్నికల్లో చంద్రబాబు చిత్తుగా ఓడిపోయారు. ఆ తర్వాత వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించి ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను వారి ద్వారా అమలుచేశారు. లంచాలకు ఆస్కారం లేకుండా నేరుగా ప్రజల అకౌంట్లలోకి ఆ పథకాల డబ్బులు బదిలీ చేశారు. ఇక వలంటీర్ల ద్వారా పించన్ల పంపిణీ అయితే విప్లవాత్మకమైన రీతిలో జరిగింది.

ఇలాంటి వ్యవస్థపై చంద్రబాబు ఈర‡్ష్య, అసూయతో రగిలిపోయారు. నోటికొచ్చినట్లు అవాకులు చెవాకులు పేలారు. దీంతో పార్టీకి నష్టం జరగడంతో మాటమార్చి దాన్ని కొనసాగిస్తానని చెప్పడం, తాను వారికి ఇంకా ఎక్కువ పారితోషికం ఇస్తానని చెప్పడం చూస్తుంటే తన జన్మభూమి కమిటీలు విఫలమైనట్లు అంగీకరించినట్లేనని తేలిపోయింది. ముందు ఆ విషయాన్ని ఒప్పుకుని లెంపలు వేసుకుంటే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.    

Advertisement
Advertisement