Sakshi News home page

అశ్లీల, దుష్ప్రచార పోస్టులకు టీడీపీ డబ్బులిస్తోంది

Published Sat, Dec 18 2021 4:06 AM

Tdp Social Media Chief Coordinator Ellapu Santosh Rao Arrested - Sakshi

సాక్షి, అమరావతి: ‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా అశ్లీల, దుష్ప్రచార పోస్టులను సోషల్‌ మీడియాలో పెట్టమని టీడీపీ నాకు నెలనెలా డబ్బులిస్తోంది. అందుకే అలాంటి పోస్టులను యూట్యూబ్‌ చానల్స్‌లో పోస్టుచేస్తున్నాను’.. అని టీడీపీ విద్యార్థి విభాగం తెలుగునాడు స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ సోషల్‌ మీడియా విభాగం చీఫ్‌ ఎల్లపు సంతోష్‌రావు వెల్లడించాడు. ఈ మేరకు ఆయన తన నేరాన్ని అంగీకరిస్తూ చేసిన వీడియోను సీఐడీ  అధికారులు శుక్రవారం తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై టీడీపీ చేస్తున్న దిగజారుడు రాజకీయాలు మరోసారి బట్టబయలయ్యాయి. సంతోష్‌రావును సీఐడీ అధికారులు శుక్రవారం అరెస్టుచేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.  

విచారణలో వెలుగుచూసిన వాస్తవాలు 
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడిన వీడియోను మార్ఫింగ్‌ చేసి అశ్లీల పదజాలం చొప్పించి ఎడిట్‌ చేసి సీబీఎన్‌ ఆర్మీ, పొలిటికల్‌ మోజీ, థాంక్యూ సీఎం సర్‌ తదితర పేర్లతో ఉన్న యూట్యూబ్‌ చానల్స్‌లో కొందరు అప్‌లోడ్‌ చేశారు. సీఐడీ అధికారుల విచారణలో ఆ మార్ఫింగ్‌ వీడియోలను అప్‌లోడ్‌ చేసింది రాజమహేంద్రవరానికి చెందిన సంతోష్‌రావు అని నిర్ధారణ అయ్యింది. అతన్ని అరెస్టుచేసి విచారించగా అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సీఎం జగన్‌ను దూషిస్తూ, ఆయనపై దుష్ప్రచారం చేస్తూ సోషల్‌ మీడియాలో వీడియోలు, పోస్టులు పెట్టాలని తనకు టీడీపీకి చెందిన సీబీఎన్‌ ఆర్మీ అనే విభాగం ప్రతినెలా డబ్బులిస్తోందని సంతోష్‌ విచారణలో వెల్లడించాడు. తనకున్న సాంకేతిక నైపుణ్యంతోపాటు కొన్ని ప్రత్యేక తరహా మొబైల్, కంప్యూటర్‌ అప్లికేషన్లను ఉపయోగించి అసలు వీడియోలను మార్ఫింగ్‌ చేస్తున్నానని కూడా అంగీకరించాడు. అలా మార్ఫింగ్‌ చేసిన వీడియోలను యూట్యూబ్‌ చానళ్లలో అప్‌లోడ్‌ చేస్తుంటానని కూడా సంతోష్‌ చెప్పాడు. ఇలా అతను తన తప్పును అంగీకరిస్తూ రికార్డ్‌ చేసిన వీడియోను సీఐడీ అధికారులు తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.  

తప్పుడు పోస్టులు పెడితే చర్యలు : సీఐడీ  
ఎవరైనా డబ్బులు, ఇతరత్రా ప్రయోజనాలు ఆశించి అశ్లీల, దూషించే, దుష్ప్రచారం చేసే వీడియోలు, మెసేజ్‌లను సోషల్‌ మీడియాలో పోస్టుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐడీ హెచ్చరించింది. ప్రభుత్వాన్నిగానీ మహిళలు, పిల్లలు, ఇతరులను అశ్లీల పదజాలంతో దూషించినా, దుష్ప్రచారం చేసినా బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. వీడియోలు,  మెసేజ్‌లకు కామెంట్లు పెట్టేముందు, షేర్‌చేసే ముందు ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోవాలని సూచించారు. సమాజంలో ఘర్షణలు, ఉద్రిక్తతలు రేకెత్తించే ఇలాంటి పోస్టులు పెట్టొద్దని కోరుతూ జారీచేసిన ప్రకటనను కూడా సీఐడీ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.  

Advertisement

What’s your opinion

Advertisement