అమరావతి పెట్టుబడిదారుల కోసం ఉత్తరాంధ్రులకు వెన్నుపోటు

14 Oct, 2022 18:44 IST|Sakshi

రాజకీయ భవిష్యత్‌ను, పదవులు ఇచ్చిన ప్రాంతానికి ద్రోహం

విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటు అవసరం

నాడు వైఎస్సార్, నేడు వైఎస్‌ జగన్‌ హయాంలోనే విజయనగరం అభివృద్ధి

తోటపల్లి, జంఝావతి, పెద్దగెడ్డ ప్రాజెక్టులు, భోగాపురం విమానాశ్రయం వారి చలవే

ఎన్నికల ముందు శిలాఫలకాలు తప్ప చంద్రబాబు చేసిందేమీలేదు

చర్చకు అశోక్‌ వస్తానంటే మంత్రి బొత్స నేతృత్వంలో మేము సిద్ధం

మీడియా సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు

సాక్షి ప్రతినిధి, విజయనగరం: అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలని, అందరికీ సమన్యాయం చేయాలన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార వికేంద్రీకరణ తలపెట్టారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కేవలం తన అనుయాయులను పెత్తందారులను చేయడానికే చట్టబద్ధంగా ఏర్పాటైన శివరామకృష్ణన్‌ కమిటీ సిఫారసులను చంద్రబాబు పక్కనబెట్టి నారాయణ, సుజనాచౌదరిల కమిటీ చెప్పిన అమరావతిని రాజధానిగా ఎంచుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలందరి సొమ్ముతో తమ మందిమాగధులకు మేలు చేసేది రాజధాని ఎలా అవుతుందని ప్రశ్నించారు. అమరావతి సహా మూడు ప్రాంతాలూ అభివృద్ధి చేయాలని తాము కోరుకుంటున్నామని, కానీ అమరావతి రైతుల ముసుగులోని పెట్టుబడిదారులు మాత్రం ఉత్తరాంధ్ర నాశనం అయిపోవాలని దేవుడికి మొక్కడానికి అరసవల్లి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి స్థానిక టీడీపీ నాయకులు మద్దతు పలకడం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడమేనన్నారు.


దశాబ్దాలుగా టీడీపీకి అండగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రజల భవిష్యత్‌ను కాపాడాల్సింది పోయి చంద్రబాబు ప్రయోజనాల కోసం పణంగా పెడుతున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం హడావుడిగా శిలాఫలకాలు వేయడం తప్ప చంద్రబాబు జిల్లాకు చేసింది శూన్యమన్నారు. గతంలో మాదిరిగానే ప్రజలు అమాయకులని వెన్నుపోటు పొడుద్దామంటే కుదరదని హెచ్చరించారు. వికేంద్రీకరణపై టీడీపీ విషప్రచారాన్ని వారే తిప్పికొడతారని, కుట్రల్లో భాగమైన పాదయాత్రను అడ్డుకుంటారని స్పష్టం చేశారు. జెడ్పీ చాంబర్‌లో మీడియాతో ఆయన గురువారం మాట్లాడారు. టీడీపీ నాయకులు చేస్తున్న విషప్రచారాన్ని ఖండించారు. ఆ ప్రకటనల వెనుకనున్న అసలు విషయాన్ని వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి...


టీడీపీ ప్రచారం: 

భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేసినది మేమే. 400 ఎకరాల భూమిని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసేసుకుంది.

వాస్తవ విషయం: 
విమానాశ్రయం కోసం గత టీడీపీ ప్రభుత్వం 2,750 ఎకరాలను జీఎంఆర్‌కు ఇస్తూ ఒప్పందం చేసుకుంది. ఆ భూసేకరణపై 150 వరకూ కేసులు హైకోర్టు విచారణలో ఉన్నా వాటిని పరిష్కరించకుండానే, ఓ ఒక్క నిర్వాసితుడికీ ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వకుండానే చంద్రబాబు ఎన్నికల ముందు ఆదరాబాదరాగా శంకుస్థాపన చేసేశారు. అశోక్‌ గజపతిరాజు అప్పట్లో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నా ఏ ఒక్క అనుమతీ తీసుకురాలేదు. రైతులతో మాట్లాడి ఆ కేసులన్నీ ఉపసంహరింపజేసినదీ, నిర్వాసితులకు న్యాయం చేసినదీ, కేంద్రం నుంచి అనుమతులన్నీ తెచ్చినదీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. త్వరలోనే శంకుస్థాపన కూడా జరగనుంది. విమానాశ్రయానికి అంత భూమి అవసరం లేదనే జీఎంఆర్‌ నుంచి 547 ఎకరాలను ప్రభుత్వం వెనక్కుతీసుకుంది. ఐదు గ్రామాల నిర్వాసితులకు అన్ని రకాల పరిహారం ఇచ్చింది. అన్ని సౌకర్యాలతో కాలనీలు సిద్ధం చేసింది.  


టీడీపీ ప్రచారం: 

గిరిజన యూనివర్సిటీకి టీడీపీ హయాంలోనే భూమి సేకరించేశాం. రూ.10 కోట్ల ఖర్చుతో కాంపౌండ్‌ వాల్‌నూ కట్టేశాం.

వాస్తవ విషయం: 
ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో హామీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీని మంజూరు చేసింది. ఇతర రాష్ట్రాల్లోని గిరిజన యూనివర్సిటీలన్నీ గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నాయి. కానీ వాటి లక్ష్యాన్ని పక్కనబెట్టి టీడీపీ పాలనలో మైదాన ప్రాంతమైన కొత్తవలస మండలంలో స్థల సేకరణ చేశారు. సొంత కాంట్రాక్టర్లకు మేలు చేయడానికి రూ.10 కోట్లతో మంజూరు చేసిన చేసిన ప్రహరీ కూడా ఐదేళ్లలో పూర్తి చేయలేకపోయారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గిరిజనుల అభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ ఉద్దేశంతో వారికి అందుబాటులో ఉండేలా సాలూరు నియోజకవర్గంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.


సమీపంలోనే రైలు, రోడ్డు, విమాన ప్రయాణ సదుపాయాలు ఉండేలా మెంటాడ మండలంలో సుమారు 500 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేస్తే, కేంద్ర కమిటీ దానికి మొగ్గు చూపించింది. దీన్ని పార్లమెంట్‌లో ఆమోదం పొందేలా ప్రధానమంత్రి, కేంద్ర హోమ్‌మంత్రితో మాట్లాడి సాధించిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుంది. ఆ యూనివర్సిటీకి వైస్‌ చాన్సలర్‌ నియమించినదీ, తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నదీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే. అన్ని గిరిజన ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందాలనే ఆయన కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాల, సీతంపేటలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, పాడేరులో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ మంజూరుచేశారు. మరో మెడికల్‌ కాలేజీ త్వరలోనే పార్వతీపురం మన్యం జిల్లాకూ మంజూరు చేయనున్నారు.  


టీడీపీ ప్రచారం:
 
అమరావతి రైతులకు మద్దతుగా అన్నివర్గాల వారితో రౌండ్‌ టేబుల్‌ సమావేశం పెడతాం. పాదయాత్రకు పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటిస్తాం. ఉత్తరాంధ్రను తాకట్టు పెట్టడం తప్ప ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధీ చేయలేదు.  

వాస్తవ విషయం: 
జిల్లాలో సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న అటు అశోక్‌కు తప్ప మిగతా టీడీపీ నాయకులెవ్వరికీ ఇక్కడ జరిగిన అభివృద్ధిపై అవగాహన లేదు. గణాంకాలు చూస్తే తెలుస్తుంది. టీడీపీ పాలనలో ఏమి జరిగిందో, వైఎస్సార్, వైఎస్‌ జగన్‌ హయాంలో ఏమి అభివృద్ధి జరిగిందో చర్చించడానికి మంత్రి బొత్స సత్యనారాయణ నాయకత్వంలో సిద్ధంగా ఉన్నాం. తోటపల్లి, జంఝావతి, పెద్దగెడ్డ ప్రాజెక్టులను పూర్తి చేసింది వైఎస్సారే. కాలువ, మిగులు పనులకు ఇటీవలే రూ.125 కోట్లను జగన్‌ ప్రభుత్వం కేటాయించింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు టీడీపీ పాలనలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు.

తారకరామతీర్థ సాగర్‌ ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. దీనికి అడ్డంకిగానున్న సారిపల్లి గ్రామ నిర్వాసితుల సమస్యను పరిష్కరించడానికి రూ.77 కోట్లను కేటాయించినది మా ప్రభుత్వమే. వీటన్నింటినీ విస్మరించి వైఎస్సార్‌సీపీ నాయకులు విజయసాయిరెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణలపై విషప్రచారం చేయడానికి టీడీపీ నాయకులకు తగదు. విశాఖ రాష్ట్ర పరిపాలన రాజధాని గాకుండా అడ్డుకోవడానికే జరుగుతున్న అమరావతి పాదయాత్రకు మద్దతు పలకడం సమంజసం కాదు. కాదని ఆ విధానానికే కట్టుబడి ఉంటే 2024 ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారు. వికేంద్రీకరణ, విశాఖ పరిపాలనా రాజధాని వల్ల ఉత్తరాంధ్రకు ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలకు మేలు జరుగుతుంది. దాని కోసం అన్ని వర్గాలతో కలిసి పోరాటం చేయడానికి వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉంది. 

మరిన్ని వార్తలు