Sakshi News home page

చంద్రయాన్‌–3లో తెలుగు రక్షణ కవచం! 

Published Sat, Jul 15 2023 4:39 AM

Telugu defense shield in Chandrayaan3 - Sakshi

సాక్షి, అమరావతి: జాబిలిపై అన్వేషణకు బయల్దేరిన చంద్రయాన్‌–3 ఉపగ్రహానికి రక్షణ కవచం తొడిగారు బెజవాడకు చెందిన ఇంజినీరు బొమ్మారెడ్డి నాగభూషణరెడ్డి (బీఎన్‌ రెడ్డి). ఉపగ్రహంలో గుండెకాయ వంటి అత్యంత కీలకమైన బ్యాటరీలను కాపాడే రక్షణ కవచాన్ని, మరికొన్ని విడిభాగాలను బీఎన్‌ రెడ్డి స్థాపించిన ‘నాగసాయి ప్రెసిషియన్‌ ఇంజినీర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ కంపెనీనే అందించింది.

ఉపగ్రహాల్లో బ్యాటరీలకు రక్షణ కవచాల తయారీలో ఈ సంస్ధ దేశంలోనే పేరెన్నికగన్నది. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేసే ఈ కంపెనీ ఇప్పటివరకు 50 శాటిలైట్లకు విడి భాగాలను అందించింది. తాజాగా చంద్రయాన్‌–3లో రోవర్, ల్యాండర్, ప్రొపల్షన్‌ మాడ్యుల్స్‌లో బ్యాటరీలను అమర్చే అల్యూమినియం స్టాండ్స్, నాసిల్స్, స్లీవ్స్‌ను సమకూర్చింది.

గతంలో చంద్రయాన్‌–1, చంద్రయాన్‌–2తో పాటు ఇస్రో నిర్వహించిన అనేక ప్రయోగాల్లో ఈ సంస్థ భాగస్వామి అయ్యింది. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌), భారత్‌ ఎల్రక్టానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌)తో కలిసి పని చేయడంతో పాటు ఏరో స్పేస్, యుద్ధ విమానాల విడిభాగాలను కూడా వివిధ విమాన తయారీ సంస్థలకు సమకూరుస్తోంది. 

ఏరో స్పేస్‌ రంగంలో ఉజ్వల భవిష్యత్తును ఊహించి.. 
బీఎన్‌ రెడ్డి తండ్రి వెంకటరామిరెడ్డి విజయవాడ, గన్నవరంలో రైల్వే ఇంజినీరుగా పని చేసేవారు. ఈ క్రమంలోనే బీఎన్‌ రెడ్డి విద్యాభ్యాసం కేబీఎన్, సిద్థార్థ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో సాగింది. 1982లో హైదరాబాద్‌ వెళ్లిన ఆయన ఓ చిన్న పరిశ్రమలో ఉద్యోగిగా చేరారు. అనంతరం జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక సంస్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్స్, డిజైనింగ్స్‌లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో ఎంటెక్‌ పూర్తి చేశారు. తర్వాత అల్విన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగంలో చేరారు.

ఏరో స్పేస్‌ రంగంలో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గ్రహించి 1994లో సొంతంగా  ‘నాగసాయి ప్రెసిషియన్‌ ఇంజినీర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ను స్థాపించారు. తొలినాళ్లలో లైట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ పరికరాలను తయారు చేసేవారు. 1998 నుంచి ఇస్రో ప్రయోగాలకు అవసరమైన వివిధ ఉపకరణాలను అందించడంపై దృష్టి పెట్టారు. బీఎన్‌ రెడ్డి పనితీరు, నైపుణ్యాన్ని ఇస్రో ఉన్నతాధికారులు 6 నెలల పాటు పరీక్షించారు. పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత అవకాశం కల్పించారు. 

అల్యూమినియం ప్లాంటు ఏర్పాటుకు విశేష కృషి  
ఒకప్పుడు శాటిలైట్‌లో విడి భాగాల తయారీకి ఉపయోగించే ప్రత్యేక అల్యూమినియాన్ని ఇజ్రాయెల్‌ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. ఇది అధిక సమయం, ఖర్చుతో కూడుకున్నది. ఆ తర్వాత హైదరాబాద్‌లోనే నాణ్యమైన అల్యూమినియం ప్లాంటు ఏర్పాటు జరిగింది. ఈ ప్లాంటు ఏర్పాటుకు బీఎన్‌ రెడ్డి విశేష కృషి చేశారు. దీని ద్వారా ఖర్చు, సమయం ఆదా అవుతున్నాయి. 

ఇస్రో, నాసాతో భాగస్వామ్యమే లక్ష్యం 
‘‘ఇస్రో, నాసాల శాటి­లైట్‌ ప్రయోగాల్లో నా కంపెనీ భాగస్వామ్యం ఉండాలన్నదే నా లక్ష్యం. స్వదేశీ పరిజ్ఞానంతో పరికరాల తయారీ ద్వారా ప్రయోగాల ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడు చంద్రయాన్‌–3ని కూడా తక్కువ ఖర్చుతోనే చేపట్టారు. ప్రయోగంలో శాటిలైట్‌ విజయవంతంగా కక్ష్యలోకి వెళ్లడం సంతోషంగా ఉంది’’ అని బీఎన్‌ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. 

Advertisement
Advertisement