AP New Districts: Temporary offices For New Districts Of Andhra Pradesh - Sakshi
Sakshi News home page

AP New Districts: కొత్త జిల్లాలకు వడివడిగా అడుగులు

Published Sun, Mar 13 2022 7:41 AM

Temporary offices For New Districts Of AP - Sakshi

సాక్షి, అమరావతి: ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభించేందుకు వీలుగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చివరిదశకు వచ్చాయి. పదివేల వరకు వచ్చిన అభ్యంతరాలు, సూచనలపై ఉన్నతాధికారులు అధ్యయనం చేసి ఒక అంచనాకు వచ్చారు. వాటిని అంశాల వారీగా వర్గీకరించి నివేదిక తయారు చేశారు. రాష్ట్రస్థాయి అధికారులు, కలెక్టర్ల™ఏర్పాటైన కమిటీ వాటిపై తమ సిఫారసులను కూడా ప్రాథమికంగా ప్రభుత్వానికి నివేదించింది. వీటిలో సహేతుకంగా ఉన్న వాటిపై పరిపాలన సౌలభ్యం, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియ ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. అన్ని లాంఛనాలు పూర్తయిన తర్వాత కొద్దిపాటి మార్పులతో ఈనెల మూడో వారంలో తుది నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. 

కొత్త జిల్లాల్లో తాత్కాలిక కార్యాలయాలు ఇక్కడే..
మన్యం జిల్లా/పార్వతీపురం: పార్వతీపురం కొత్త ఐటీడీఏ భవనంలో కలెక్టరేట్, యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో జిల్లా పోలీస్‌ కార్యాలయం, డీఎస్పీ క్యాంప్‌ ఆఫీస్‌లో ఎస్పీ క్యాంప్‌ ఆఫీస్, ఐటీడీఏ పీవో క్యాంప్‌ ఆఫీస్‌లో జేసీ క్యాంప్‌ ఆఫీస్‌.

అల్లూరి సీతారామరాజు/పాడేరు: పాడేరు యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో కలెక్టరేట్, ప్రైవేట్‌ కల్యాణ మండపంలో జిల్లా పోలీస్‌ కార్యాలయం, పోలీస్‌ గెస్ట్‌హౌస్‌లో ఎస్పీ క్యాంప్‌ ఆఫీస్, ప్రైవేట్‌ భవనంలో జేసీ క్యాంప్‌ ఆఫీస్‌.

అనకాపల్లి జిల్లా: అనకాపల్లి షుగర్‌ ఫ్యాక్టరీ/ఇండో అమెరికన్‌ స్కూల్‌ (ప్రైవేట్‌)లో కలెక్టరేట్, ఫ్యూచర్‌ వండర్‌ స్కూల్‌ టెక్నికల్‌ క్యాంపస్‌లో జిల్లా పోలీస్‌ కార్యాలయం, మరో మూడు ప్రైవేట్‌ భవనాల్లో కలెక్టర్, ఎస్పీ, జేసీ క్యాంప్‌ ఆఫీసులు.

తూర్పు గోదావరి జిల్లా/రాజమహేంద్రవరం: నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కనస్ట్రక్షన్‌లో కలెక్టరేట్, రెవెన్యూ గెస్ట్‌హౌస్‌లో కలెక్టర్‌ క్యాంప్‌ ఆఫీస్‌.
కోనసీమ జిల్లా, అమలాపురం: డీఆర్‌డీఏ ట్రైనింగ్‌ భవనాల్లో కలెక్టరేట్, మాంటిస్సోరి విద్యాసంస్థలో (ప్రైవేట్‌) జిల్లా పోలీస్‌ కార్యాలయం, కాటన్‌ గెస్ట్‌హౌస్‌లో కలెక్టర్‌ క్యాంప్‌ ఆఫీస్, ఇరిగేషన్‌ భవనంలో జేపీ క్యాంప్‌ ఆఫీస్‌.
పశ్చిమ గోదావరి జిల్లా/భీమవరం: శ్రీచైతన్య కాలేజీలో కలెక్టరేట్, వత్సవాయి ఇంజనీరింగ్‌ కాలేజీలో జిల్లా పోలీస్‌ కార్యాలయం, మరో మూడు ప్రైవేట్‌ భవనాల్లో కలెక్టర్, జేసీ, ఎస్పీ క్యాంప్‌ ఆఫీసులు

ఎన్టీఆర్‌ జిల్లా/విజయవాడ: గొల్లపూడి బ్రాహ్మణ కార్పొరేషన్‌ భవనంలో కలెక్టరేట్, ప్రస్తుతం ఉన్నచోటే పోలీస్, కలెక్టర్, ఎస్పీ, జేసీ క్యాంప్‌ ఆఫీసులు.
బాపట్ల జిల్లా/బాపట్ల: ఏపీహెచ్‌ఆర్‌డీఐ హాస్టల్‌ భవనంలో కలెక్టరేట్, ఈటీసీ హాస్టల్‌ భవనంలో జిల్లా పోలీస్‌ కార్యాలయం, వ్యవసాయ కళాశాల గెస్ట్‌హస్‌లో కలెక్టర్‌ క్యాంప్‌ ఆఫీస్, పోలీస్‌ క్వార్టర్స్‌లో ఎస్పీ క్యాంప్‌ ఆఫీస్, ప్రైవేట్‌ భవనంలో జేసీ క్యాంప్‌ ఆఫీస్‌.

పల్నాడు జిల్లా/నరసరావుపేట: నాగార్జున్సాగర్‌ ప్రాజెక్ట్‌ సర్కిల్‌ ఆఫీస్‌లో కలెక్టరేట్, అక్కడి రిసోర్స్‌ సెంటర్‌/పాత ప్రాజెక్ట్‌ ఆఫీస్‌/పిల్లల ఆస్పత్రిలో జిల్లా పోలీస్‌ కార్యాలయం, పంచాయతీరాజ్‌ గెస్ట్‌హౌస్‌లో కలెక్టర్‌ క్యాంప్‌ ఆఫీస్, డీఎస్పీ బంగ్లాలో ఎస్పీ క్యాంప్‌ ఆఫీస్, పంచాయతీరాజ్‌ క్వాలిటీ కంట్రోల్‌ ఆఫీస్‌లో జేసీ క్యాంప్‌ ఆఫీస్‌.

శ్రీబాలాజీ జిల్లా/తిరుపతి: శ్రీపద్మావతి నిలయం (టీటీడీ)లో కలెక్టరేట్, మునిసిపల్‌ కమిషనర్‌ బంగ్లాలో జేసీ క్యాంప్‌ ఆఫీస్‌. ప్రస్తుతం ఉన్నచోటే జిల్లా పోలీస్‌ కార్యాలయం, కలెక్టర్, ఎస్పీ క్యాంప్‌ ఆఫీసులు.

అన్నమయ్య జిల్లా/రాయచోటి: ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్, హాస్టల్‌ బిల్డింగ్‌లో కలెక్టరేట్, పాలిటెక్నిక్‌ కాలేజీ కొత్త భవనంలో జిల్లా పోలీస్‌ కార్యాలయం, ప్రైవేట్‌ భవనాల్లో కలెక్టర్, ఎస్పీ, జేసీ క్యాంప్‌ ఆఫీసులు.

శ్రీసత్యసాయి జిల్లా/పుట్టపర్తి: సత్యసాయి ట్రస్ట్‌కు చెందిన మిర్‌పురి మ్యూజిక్‌ కాలేజీ, ఆడిటోరియంలో కలెక్టరేట్, ధర్మశాల మెయిన్‌ హాల్స్‌లో జిల్లా పోలీస్‌ కార్యాలయం, సత్యసాయి ట్రస్ట్‌ వీసీ బంగ్లాలో కలెక్టర్‌ క్యాంప్‌ ఆఫీస్, శ్రీసాయి ఐశ్వర్య గార్డెన్స్‌లో జేసీ క్యాంప్‌ ఆఫీస్‌.

నంద్యాల జిల్లా/నంద్యాల: ఆర్‌ఏఆర్‌ఎస్‌ భవనాల్లో కలెక్టరేట్, పోలీస్‌ గెస్ట్‌హౌస్‌లో జిల్లా పోలీస్‌ కార్యాలయం, సబ్‌ కలెక్టర్‌ బంగ్లాలో కలెక్టర్‌ క్యాంప్‌ ఆఫీస్, పోలీస్‌ గెస్ట్‌హౌస్‌లో ఎస్పీ క్యాంప్‌ ఆఫీస్, డీఎఫ్‌వో గెస్ట్‌హౌస్‌లో జేసీ క్యాంప్‌ ఆఫీస్‌ 

శరవేగంగా ఉద్యోగుల కేటాయింపు
అధికారులు, ఉద్యోగుల కేటాయింపు శరవేగంగా జరుగుతోంది. తుది నోటిఫికేషన్‌ ఇచ్చిన రోజే ఆయా జిల్లాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగుల కేటాయింపు ఉత్తర్వులు వెలువడనున్నాయి. తొలుత తాత్కాలికంగా రివర్స్‌ సీనియారిటీ ప్రకారం.. జూనియర్‌ టు సీనియర్‌ మేరకు ఉద్యోగులను కొత్త జిల్లాలకు కేటాయించనున్నారు. ప్రస్తుతం ఉన్న జిల్లా కేంద్రాలు, కొత్తగా ఏర్పాటయ్యే జిల్లా కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగుల కేటాయింపు జాబితాలను ఇప్పటికే శాఖల వారీగా తయారు చేసి ఆర్థికశాఖ ఆమోదానికి పంపారు. తుది నోటిఫికేషన్‌ వెలువడేరోజే ఈ జాబితాల ప్రకారం ఆర్డర్‌ టు సర్వ్‌ ఉత్తర్వులు ఇవ్వనున్నారు. అధికారుల కేటాయింపు ప్రక్రియ కూడా దాదాపు పూర్తయింది. కొత్తగా ఏర్పాటవుతున్న జిల్లాల్లో నియమించబోయే కలెక్టర్లను నాలుగైదు రోజుల్లో ఓఎస్‌డీలుగా ఆ జిల్లాలకు పంపనున్నారు. పరిపాలన ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లను వారు పూర్తిచేసి అపాయింటెడ్‌ డే నుంచి కలెక్టర్లుగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఇతర ఉద్యోగులు, అధికారులను కూడా అలాగే నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

సాధ్యమైనంత వరకు ప్రభుత్వ భవనాలే కార్యాలయాలు
పరిపాలన ప్రారంభించేందుకు కొత్త జిల్లాల్లో తాత్కాలిక జిల్లా కార్యాలయాల ఎంపిక కూడా చాలావరకు పూర్తయింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజిస్తున్న విషయం తెలిసిందే. పాత 13 జిల్లా కేంద్రాల్లో ఉన్న కార్యాలయాలు యథావిధిగా కొనసాగనున్నాయి. కొత్తగా ఏర్పడనున్న 13 జిల్లా కేంద్రాల్లో తాత్కాలిక కలెక్టరేట్, జిల్లా పోలీస్‌ కార్యాలయం, కలెక్టర్, ఎస్పీ, జేసీ క్యాంప్‌ కార్యాలయాలు, ఇతర జిల్లా కార్యాలయాలను కలెక్టర్లతో సంప్రదింపులు జరిపి ఎంపిక చేశారు. ఆ కార్యాలయాల్లో సివిల్, విద్యుత్‌ పనుల కోసం ఒక్కో జిల్లాకు రూ.కోటి, ఫర్నిచర్‌ కొనుగోలుకు రూ.రెండు కోట్లను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. అనకాపల్లి, భీమవరంలలో ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు భవానాల్లో తాత్కాలిక కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. పుట్టపర్తిలో ఎస్పీ క్యాంప్‌ కార్యాలయం మినహా ఇతర ప్రధాన కార్యాలయాలను ప్రైవేటు భవనాల్లోనే ఏర్పాటు చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement