కరోనాపై కంగారొద్దు.. అప్రమత్తమైన రాష్ట్ర వైద్యశాఖ | Sakshi
Sakshi News home page

కరోనాపై కంగారొద్దు.. అప్రమత్తమైన రాష్ట్ర వైద్యశాఖ

Published Wed, Apr 12 2023 4:53 AM

Tests and medicines at YSR Village Clinics at the village level - Sakshi

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కరో­నా వైరస్‌ పాజిటి­వ్‌ కేసులు పెరుగుతు­న్నా­యి. కేంద్ర వైద్యశాఖ ఇ­ప్ప­టికే రాష్ట్రాలను అప్రమ­త్తం చేసింది. అయితే తొలి నుం­చి కరోనా వైరస్‌ నియంత్రణ పట్ల పక్కా ప్రణాళికతో అ­డు­గులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిరంతర అప్రమత్తతతో వ్యవహరి­స్తోంది. ఒకవేళ మన వద్ద కేసుల నమో­­దు పెరిగినా వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ల ద్వారా గ్రామస్థాయిలోనే అనుమానిత లక్ష­ణాలున్న వారికి పరీక్షలతో పాటు, పాజిటివ్‌ రోగు­లకు వైద్యసేవలను అందుబాటులో ఉంచుతోంది. 

విలేజ్‌ క్లినిక్స్‌లో ర్యాపిడ్‌ కిట్‌లు
గ్రామాల్లో ప్రజలకు వైద్యసేవలను చేరువ చేయడానికి 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిల్లో కరోనా పరీక్షతో పాటు 14 రకాల రోగ నిర్ధారణకు ర్యాపిడ్‌ కిట్‌లతో పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి విలేజ్‌ క్లినిక్‌లో కనీసం 10 కరోనా పరీక్షల ర్యాపిడ్‌ కిట్‌లను వైద్యశాఖ నిరంతరం అందుబాటులో ఉంచుతోంది. ర్యాపిడ్‌ టెస్టుల్లో పాజిటివ్‌గా తేలినవారి నమూనాలను ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లకు పంపి పరీక్షించనున్నారు. రాష్ట్రంలో 13 ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. 

ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్‌ కేసులు అధికం
కొత్త వేరియంట్‌ కేసుల నమోదుపైనా వైద్యశాఖ నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. పాజిటి­వ్‌ రోగుల నమూనాలను విజయవాడలోని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌కు పంపి పరీక్షిస్తున్నారు. రాష్ట్రంలో ఇటీవల ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు తేలింది. గత నెల ఒకటో తేదీ నుంచి ఈ నెల 5వ తేదీ మధ్య పాజిటివ్‌ రోగుల 167 నమూనాలను సీక్వెన్సింగ్‌ చేశారు. వీటిలో అత్యధికంగా 84 కేసులు ఎక్స్‌బీబీ.1.16 రకం ఉన్నాయి. ఎక్స్‌బీబీ.1 రకం కేసులు 13, ఎక్స్‌బీబీ.2.3. వేరియంట్‌ కేసులు 17, మిగిలినవి ఇతర వేరియంట్‌లుగా తేలింది. 

ఎనీటైమ్‌ అందుబాటులో పడకలు, మందులు 
కరోనా తొలి వేవ్‌ నుంచి వైరస్‌ వ్యాప్తి తగ్గినప్పటికీ.. ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు, ఇతర చికిత్స వనరులను ప్రభుత్వం నిరంతరం అందుబాటులో ఉంచుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 12,292 సాధారణ, 34,763 ఆక్సిజన్, 8,594 ఐసీయూ, 1,092 పీడియాట్రిక్‌ ఐసీయూ పడకలు అందుబాటు­లో ఉన్నాయి.

5,813 వెంటిలేటర్లు, 5,610 పీడియాట్రిక్‌ వెంటిలేటర్లు, 297 నియోనాటల్‌ వెంటిలేటర్లు, 3,902 డీటైప్‌ సిలిండర్లు, 15,565 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, 170 పీఎస్‌ఏ ప్లాంట్‌లు ఉన్నాయి. వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయడానికి 2,64,109 ర్యాపిడ్‌ కిట్‌లు, 4,88,962 వీటీఎం–ఆర్టీపీసీఆర్‌ కిట్‌లు ఉన్నాయి. చికిత్సలో వాడే రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు 1.39 లక్షలు, ఇతర మందుల నిల్వలు సరిపడా ఉన్నాయి. 

వందశాతం రెండుడోసుల వ్యాక్సినేషన్‌ 
రాష్ట్రంలో 18 ఏళ్లుపైబడిన 3.95 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌ వేయాల్సిందిగా లక్ష్యం ఉంది. ఈ క్రమంలో లక్ష్యానికి మించి 4.35 కోట్ల మందికి ఇప్పటికే రెండుడోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయింది. 12 నుంచి 17 ఏళ్ల పిల్లలందరికీ రెండుడోసుల వ్యాక్సిన్‌ వేశారు. 18–59 మధ్య వయసుగల 2.30 కోట్ల మందికి ప్రికాషన్‌ డోసు టీకాను వైద్యశాఖ వేసింది. 

ఆందోళనకర పరిస్థితి లేదు
రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యా­ప్తి పూర్తి నియంత్ర­ణలో ఉంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవస­రం లేదు. ఒకవేళ కేసులు పెరిగినా సమర్థంగా నియంత్రించడానికి అన్ని వనరులు సిద్ధంగా ఉన్నాయి. ఫీవర్‌ సర్వేను నిరంతరాయంగా కొనసాగిస్తున్నాం. ప్రస్తు­తం 49వ రౌండ్‌ ఫీవర్‌ సర్వే చేపడుతున్నాం. అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించి అవసరం మేరకు వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. వృద్ధులు, ధీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వైరస్‌ బారినపడకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. సాధారణ ప్రజలు సైతం సమూహాల్లో ఉన్నప్పుడు మాస్క్‌ ధరించాలి. 
– ఎం.టి.కృష్ణబాబు,  ముఖ్యకార్యదర్శి వైద్య, ఆరోగ్యశాఖ

Advertisement
Advertisement