నేడు ఎల్‌వీఎం3–ఎం3 రాకెట్‌ కౌంట్‌ డౌన్‌ ప్రారంభం  | Sakshi
Sakshi News home page

నేడు ఎల్‌వీఎం3–ఎం3 రాకెట్‌ కౌంట్‌ డౌన్‌ ప్రారంభం 

Published Sat, Mar 25 2023 5:05 AM

Today is the start of LVM3 M3 rocket countdown - Sakshi

సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా):  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్, డిపార్ట్‌మెంట్‌ స్పేస్‌ సంస్థలు కలిసి వాణిజ్యపరంగా స్థానిక సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఆదివారం ఉదయం 9 గంటలకు ఎల్‌వీఎం3–ఎం3 రాకెట్‌ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధంచేశారు. ఇందుకు సంబంధించి శనివారం ఉదయం 8.30 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించనున్నారు.

24.30గంటల కౌంట్‌ డౌన్‌ అనంతరం రాకెట్‌ను ప్రయోగిస్తారు. ఈ మేరకు షార్‌లో శుక్రవారం నిర్వహించిన ఎంఆర్‌ఆర్‌ కమిటీ, లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు సమావేశాల్లో నిర్ణయించారు. అంతకుముందే మూడు దశల రాకెట్‌ను అనుసంధానం చేశారు. దానిని ప్రయోగ వేదికపై అమర్చి అన్ని రకాల పరీక్షలు నిర్వహించి లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు వారికి అప్పగించారు.

ఈ ప్రయోగం ద్వారా యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన నెట్‌వర్క్‌ యాక్సెస్‌ అసోసియేట్‌ లిమిటెడ్‌ కంపెనీ, ఇండియాకు చెందిన భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ వారు సంయుక్తంగా వన్‌వెబ్‌ ఇండియా–2 పేరుతో 5,805 కిలోల బరువు కలిగిన 36 సమాచార ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ (సర్క్యులర్‌ ఆర్బిట్‌)లోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగాన్ని 19.7 నిమిషాల్లో పూర్తి చేసి 36 ఉపగ్రహాలను ఒక్కొక్కటిగా నిర్దేశించిన సమయంలో నిరీ్ణత కక్ష్యలోకి ప్రవేశపెట్టే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు డిజైన్‌ చేశారు. 

Advertisement
Advertisement