ఆలివ్‌ రిడ్లే.. సముద్రంలోకి వెడలె | Sakshi
Sakshi News home page

ఆలివ్‌ రిడ్లే.. సముద్రంలోకి వెడలె

Published Mon, May 22 2023 5:07 AM

Tree Foundation Forest Department has saved 3 thousand turtle nests - Sakshi

సాక్షి, అమరావతి: ఆలివ్‌ రిడ్లే తాబేళ్ల సంరక్షణ చర్యల్లో భాగంగా ట్రీ ఫౌండేషన్, రాష్ట్ర అటవీ శాఖ రాష్ట్రంలోని సముద్ర తీరప్రాంతం వెంబడి ఈ ఏడాదిలో ఇప్పటివరకు 3,036 తాబేళ్ల గూళ్లను రక్షించాయి. ఆ గూళ్లలో 3.41 లక్షల గుడ్లను కాపాడగా.. వాటినుంచి 2.39 లక్షల తాబేళ్ల పిల్లలు పుట్టుకొచ్చాయి. వాటన్నిటినీ సముద్రంలోకి వదిలారు. శ్రీకాకుళం, విజయ నగరం, కృష్ణా, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, సూళ్లూరుపేట జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో ఆలివ్‌ రిడ్లే తాబేళ్ల సంరక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ నెల 23న అంతర్జాతీయ తాబేళ్ల దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఈ వివరాలను విడుదల చేసింది. ట్రీ ఫౌండేషన్‌ అటవీ శాఖతో కలిసి గత 16 సంవత్సరాలుగా సముద్ర తాబేళ్ల రక్షణ, సముద్ర జీవ సంరక్షణలో పాలుపంచుకుంటోంది. ఈ 16 సంవత్సరాల్లో ఇప్పటివరకు 33.68 లక్షలకు పైగా సముద్ర తాబేలు పిల్లలను సముద్రంలో వదిలారు.

వేల కిలోమీటర్లు ప్రయాణించి..
ఆగ్నేయ సముద్ర తీర ప్రాంతంలోని ఒడిశా, ఆంధ్రా ప్రాంతాలు ఆలివ్‌ రిడ్లే జాతి తాబేళ్లు గుడ్లు పెట్టడానికి అనువైనవి. ఏటా ఈ తీరాల్లో గుడ్లు పెట్టేందుకు వేల తాబేళ్లు సముద్రంలో వేల కిలోమీటర్లు ప్రయాణించి ఈ తీరానికి వచ్చి గుడ్లు పెడతాయి. తీరంలో గుడ్లు పెట్టిన తాబేళ్లు వెళ్లిపోయాక.. ఆ గూళ్లు ప్రమాదంలో పడుతున్నాయి. అందుకే చాలా సంవత్సరాలుగా ట్రీ ఫౌండేషన్‌ వంటి సంస్థలు అటవీ శాఖతో కలిసి వాటి సంరక్షణకు నడుం బిగించాయి. 

వెయ్యి తాబేళ్లలో ఒకటే..
ప్రతి ఆడ తాబేలు ఒక సీజన్‌లో (డిసెంబర్‌ నుంచి మార్చి) రెండుసార్లు గుడ్లు పెట్టడానికి సముద్రం నుంచి తీర ప్రాంతానికి వస్తుంది. గుడ్డు నుంచి పిల్ల బయటకు రావడానికి 48 నుంచి 60 రోజులు పడుతుంది. ఉష్ణోగ్రత 25 నుంచి 30 డిగ్రీలుంటే.. మగ పిల్లలు, 30 నుంచి 35 డిగ్రీలుంటే ఆడ పిల్లలు జన్మిస్తాయి. గుడ్డు నుంచి బయటకు వచ్చిన పిల్ల తాబేళ్లు నక్షత్రాలు, చంద్రుడి వెలుతురు ఆధారంగా సముద్రంలోకి చేరుకుంటాయి. పిల్ల తాబేళ్లకు బొడ్డు దగ్గర యోక్‌ సాక్‌ (పచ్చసొనలా) ఉంటుంది. దీని ద్వారానే పిల్ల తాబేళ్లకు 48 గంటల వరకు పోషకాహారం అందుతుంది.

అందుకే గుడ్డు నుంచి బయటకు వచ్చిన పిల్ల తాబేళ్లను వెంటనే సముద్రం తీరంలో విడిచిపెట్టాలి. ఈ పనిని చాలాకాలంగా మేం చేస్తున్నాం. పుట్టిన తాబేళ్లకు వాటి మెదడు కణాల చూట్టూ మేగ్నటైట్‌ సెల్స్‌ ఉంటాయి. ఇవి వాటికి జీపీఎస్‌లా ఉపయోగపడతాయి. అందుకే ఆడ తాబేళ్లు 12 నుంచి 15 సంవత్సరాలకు అవి పుట్టిన తీరానికి గుడ్లు పెట్టడానికి వస్తాయి. వెయ్యి తాబేలు పిల్లలు సముద్రంలోకి వెళితే గుడ్లు పెట్టే సమయానికి ఒకే ఒక తాబేలు మాత్రమే మిగులుతుంది. మిగిలిన 999 పిల్లలు పెద్ద చేపలకు ఆహారమైపోతాయి. 
– డాక్టర్‌ సుప్రజ ధారిని, ఛైర్‌పర్సన్, ట్రీ ఫౌండేషన్‌

Advertisement
Advertisement