కొండపై ప్లాస్టిక్‌ ఉండదిక..

2 Jun, 2022 05:21 IST|Sakshi

తిరుమలలో ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా రద్దు చేసిన టీటీడీ 

తిరుపతిలోనే తిరుమల ప్రవేశమార్గాల వద్ద తనిఖీ 

ప్లాస్టిక్‌ రహితంలో రోల్‌ మోడల్‌గా తిరుమల 

తిరుమల: ప్రపంచంలోని హిందూ దేవాలయాల్లో తిరుమల శ్రీవారి ఆలయం ఒక రోల్‌ మోడల్‌. భద్రత, క్యూలైన్‌ నిర్వహణ, లక్షలాదిమంది భక్తులకు ఇబ్బందుల్లేకుండా శ్రీవారి దర్శనం కల్పించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు (టీటీడీకి) ఎంతో పటిష్టమైన వ్యవస్థ ఉంది. ప్రత్యేక సెక్యూరిటీ విభాగం, సీసీ కెమెరాల నిర్వహణ తదితరాలు టీటీడీకే సొంతం. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు అన్నప్రసాద వితరణ, క్యూలైన్‌ మేనేజ్‌మెంట్‌ వరకు శ్రీవారి ఆలయం ఎంతో ఆదర్శం. అంతేకాకుండా శిక్షణలోని ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు ఇక్కడికి వచ్చి పలు విషయాలపై అవగాహన పెంపొందించుకోవడం పరిపాటి.

ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీవారి ఆలయం ప్రత్యేకతలు ఎన్నో. ఇంతటి ప్రాధాన్యత కలిగిన తిరుమల పుణ్యక్షేత్రం పర్యావరణ పరిరక్షణలో తనదైన గుర్తింపును సొంతం చేసుకుంటోంది. అతితక్కువ కాలంలోనే దశల వారీగా ఏడుకొండలపై ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ ప్లాస్టిక్‌ రహిత తిరుమలగా టీటీడీ తీర్చిదిద్దుతోంది. ప్రపంచానికే రోల్‌ మోడల్‌గా ఉన్న టీటీడీ పర్యావరణ పరిరక్షణలో కూడా అనేక దేవాలయాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల పుణ్యక్షేత్రానికి నిత్యం దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. అధికసంఖ్యలో భక్తులు ప్లాస్టిక్‌ వాడుతుంటారు.

ఈ క్రమంలో తిరుమలలో ప్లాస్టిక్‌ వాడకంపై కేంద్ర పర్యావరణ సంస్థ అధికారులు టీటీడీని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ తిరుమలలో దశల వారీగా ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించాలని నిర్ణయించింది. తొలిదశలో భాగంగా శ్రీవారి లడ్డూ వితరణ కేంద్రంలో ఉపయోగించే ప్లాస్టిక్‌ కవర్లకు ప్రత్యామ్నాయంగా బయోడిగ్రేడబుల్‌ కవర్లను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

రెండోదశలో ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌ను నిషేధించింది. హోటళ్లు, మఠాల్లోను, స్థానిక నివాసితులు ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌ను ఉపయోగించరాదని హెచ్చరించింది. వాటికి ప్రత్యామ్నాయంగా గాజు సీసాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ చర్యలతో తిరుమలలో చాలావరకు ప్లాస్టిక్‌ వాడకం తగ్గింది. ఇక మూడోదశలో భాగంగా స్థానికులు, హోటళ్లు, దుకాణదారులతో సమావేశమైన అధికారులు ఇకపై తిరుమలలో సంపూర్ణంగా ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా దుకాణదారులు, మఠాలు, హోటళ్ల నిర్వాహకులు ప్లాస్టిక్‌ ఉత్పత్తులను వినియోగిస్తే లైసెన్స్‌ రద్దుచేసి, చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

క్షుణ్ణంగా తనిఖీలు 
తిరుమలలో ప్లాస్టిక్‌ నిషేధం బుధవారం నుంచే అమల్లోకి వచ్చింది. బుధవారం నుంచి తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తిరుమల వెళ్లే స్థానికులు, వ్యాపారులు, భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్లాస్టిక్‌ రహిత వస్తువులను మాత్రమే అనుమతిస్తున్నారు. స్థానిక వ్యాపారులు పంచెలు, వివిధ రకాల బొమ్మలు, ఇతర వస్తువులకు ప్లాస్టిక్‌ కవర్ల ప్యాకింగ్‌ లేకుండా బయో డిగ్రేడబుల్‌ కవర్లుగానీ, పేపర్లుగానీ ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు.

అంతేగాకుండా నిత్యావసరాల్లో భాగంగా ఎక్కువగా ఉపయోగించే షాంపూ ప్యాకెట్లు కూడా కొండపైకి భక్తులు తీసుకెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు తమ అవసరాల నిమిత్తం తీసుకొచ్చిన వాటర్‌ బాటిల్స్, వివిధ రకాల ప్లాస్టిక్‌ వస్తువులను అలిపిరి తనిఖీ కేంద్రం వద్దే విజిలెన్స్‌ సిబ్బంది గుర్తించి డస్ట్‌బిన్లలో పడేస్తున్నారు. ఈ విషయమై బ్రాడ్‌కాస్టింగ్‌ ద్వారా భక్తులకు సూచనలు చేస్తున్నారు. తిరుమలను ప్లాస్టిక్‌ రహిత ప్రదేశంగా తీర్చిదిద్దాలంటే టీటీడీకి భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

భక్తులకు సూచనలు 
► తిరుమలలో ప్లాస్టిక్‌ వాడకాన్ని టీటీడీ పూర్తిగా రద్దుచేసింది. 
► అలిపిరి తనిఖీ కేంద్రం, అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గంలో ప్లాస్టిక్‌ కవర్లు, వాటర్‌ బాటిల్స్, ఇతర ప్లాస్టిక్‌ వస్తువులను అనుమతించరు.
► తిరుమలకు వచ్చే భక్తులు ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్, కవర్లు, షాంపు ప్యాకెట్లు, ఇతర ప్లాస్టిక్‌ వస్తువులు తీసుకురావడం నిషిద్ధం. 
► తిరుమల యాత్రకు వచ్చే భక్తులు ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్‌ లేకుండా రావాలి.  
► వాటర్‌ బాటిల్స్, ఇతర ప్లాస్టిక్‌ వస్తువులను తిరుపతిలోని తనిఖీ కేంద్రాల వద్ద వదిలేసి రావాలి.  
► తనిఖీ సిబ్బందికి సహకరించాలి.    

మరిన్ని వార్తలు