'విశాఖ స్టీల్'‌ను అమ్మితే ఊరుకోం | Sakshi
Sakshi News home page

'విశాఖ స్టీల్'‌ను అమ్మితే ఊరుకోం

Published Sun, Mar 21 2021 4:01 AM

Ultimatum of trade union leaders in the House of Ukku Karmika Garjana - Sakshi

ఉక్కునగరం (గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మితే ఊరుకోబోమని కార్మీక సంఘాల నాయకులు అల్టిమేటం జారీ చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఉక్కు నగరంలోని త్రిష్ణా మైదానంలో ఉక్కు కార్మీక గర్జన పేరిట బహిరంగ సభ నిర్వహించారు. జాతీయ కార్మీక సంఘాల నాయకులు హాజరై స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే సహించబోమని హెచ్చరించారు. ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని బొగ్గు గనులు, రైల్వే, బ్యాంకులు, బీమా ఇలా అన్ని రంగాలనూ ప్రైవేటుపరం చేయడానికే జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. కార్మీకుల హక్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు కాలరాయడానికే అన్నింటినీ ప్రైవేటీకరిస్తున్నారన్నారు.

సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ మాట్లాడుతూ కార్మీకుల ఆందోళన ప్రజల ఉద్యమంగా మారిందన్నారు. గనులు కేటాయించని ఏౖకైక ప్లాంట్‌ విశాఖ స్టీల్‌ప్లాంటే అన్నారు. ఇస్కో, దుర్గాపూర్‌ స్టీల్, సేలం స్టీల్‌ప్లాంట్లను కొనడానికి వచ్చిన వారిని తరిమినట్టే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కొనడానికి ఎవరైనా వస్తే తరిమి తరిమి కొట్టాలన్నారు. ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జీత్‌ కౌర్‌ మాట్లాడుతూ అదానీ, అంబానీల కోసమే మోదీ పని చేస్తున్నారన్నారు. బీఎంఎస్‌ జాతీయ కార్యదర్శి పాంథే మాట్లాడుతూ లిబర్‌లైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్‌తో కార్మీక వర్గాలకు సమస్యలు ప్రారంభమయ్యాయన్నారు. హెచ్‌ఎంఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి రిజ్వార్‌ అహ్మద్‌ మాట్లాడుతూ దేశంలో దొంగలు పడ్డారని, దేశాన్ని అమ్మడానికి సిద్ధమవుతున్నారన్నారు.  

ప్రైవేటీకరణకు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం 
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు పూర్తి వ్యతిరేకమని వైఎస్సార్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి రెండుసార్లు ప్రధానికి లేఖలు రాశారన్నారు. కార్మిక సంఘాల నేతలతో చర్చించారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వల్లే నేడు షిప్‌యార్డు, బీహెచ్‌పీవీ సంస్థలు ప్రభుత్వ రంగంలో కొనసాగుతున్నాయన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement