కొలువు సొంతమ(వు)ను

15 May, 2022 16:28 IST|Sakshi

పలు కంపెనీల్లో విద్యార్థులకు ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా కడపలోనే ఉర్దూ పాలిటెక్నిక్‌ కళాశాల

నేటి పోటీ ప్రపంచంలో చదువులు, మార్కులతోపాటు భావ వ్యక్తీకరణ, సాఫ్ట్‌స్కిల్స్‌ అవసరం.సాంకేతిక విషయ పరిజ్ఞానం, ఆంగ్లభాషపై పట్టు, అంకితభావం విజయంలో ముఖ్య భూమిక పోషిస్తాయి. మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సీటీ (మను) ఉర్దూ పాలిటెక్నిక్‌ విద్యార్థులు అంగ్ల మాధ్యమంలోనే కాదు ఉర్దూ మీడియంలో చదువుతూ ఉద్యోగాలను సాధించవచ్చని నిరూపించారు. ఎంచుకున్న రంగంలో నైపుణ్యాలు సాధించి కొలువులు పొందారు. సంతోషంగా జీవ నం సాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.  

కడప ఎడ్యుకేషన్‌: మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సీటీ (మను) అనుబంధ సంస్థ అయిన మను పాలిటెక్నిక్‌ కళాశాల వైఎస్సార్‌ జిల్లా విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. మను ఆధ్వర్యంలో 2018లో దీనిని దేవుని కడప వద్ద ఏర్పాటు చేశారు. తర్వాతఈ కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం కడప రిమ్స్‌ వద్ద 10.15 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.

ఇందులో యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్,మినిస్ట్రియల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ వారి ఆర్థిక సహాయం రూ. 20 కోట్లతో నూతన భవనాలు నిర్మించారు. అలాగే రూ. 5 కోట్లతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ , కళాశాల ఆవరణ మొత్తం ప్రహరీని ఏర్పాటు చేశారు. నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా బీహార్‌లోని దర్బాంగ, ఒరిస్సాలోని కటక్, కర్ణాటకలోని బెంగళూరు, తెలంగాణలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో మాత్రమే ఈ పాలిటెక్నిక్‌ కళాశాలలు ఉన్నాయి.  

వందశాతం ఉత్తీర్ణత: ఈ కళాశాలలో 2021 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణతను సాధించారు. గతేడాదికి సంబంధించి పలువురు విద్యార్థులు కొలువులను సాధించారు. ఈ సంవత్సం పలువురు ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ను తీసుకుంటున్నారు. ఇందులో రేణిగుంటలోని అమర్‌రాజా కంపెనీ, కడప ఎండీహెచ్‌ గ్రూపు, బెంగళూరు మెగాస్ట్రక్చర్, బీహార్‌ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్, ముంబై, ఝార్జండ్‌లోని ఆల్ట్రాటెక్‌లలో అప్రెంటీస్‌ పూర్తి చేసి ఆయా కంపెనీల్లో ఉద్యోగాలను పొందారు. ఉద్యోగాలకు ఎంపికైన కంపెనీల్లో వార్షిక జీతం 1.50 లక్షల నుంచి 3 లక్షల వరకు పొందుతున్నారు. 

అవసరాలకు అనుగుణంగా కోర్సుల రూపకల్పన 
నేటి సాంకేతిక యుగంలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మను ఉర్దూ పాలిటెక్నిక్‌ కళాశాలలో కోర్సులు రూపకల్పన చేశారు. ఇందులో డిప్లమా ఇన్‌ సివిల్‌ ఇంజినీరింగ్, డిప్లమా ఇన్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్, డిప్లమా ఇన్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులు టెక్నికల్‌ పరంగా ఉండటంతో కొలువులు అందిపుచ్చుకుంటున్నారు.

యూనివర్సిటీలో పలువురు ఉన్నత చదువులు ... 
మను పాలిటెక్నిక్‌లో కోర్సులు పూర్తి చేసిన మరి కొంత మంది విద్యార్థులు పలు యూనివర్సిటీలలో ఉన్నత చదువులు చదువుతున్నట్లు కళాశాల సిబ్బంది తెలిపారు. మను పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రస్తుతం మూడో సంవత్సరం చదువుతున్న  27 మంది చెన్నైలోని పోరెసియా ఇండియా లిమిటెడ్, మరో 10 మంది హిందూపూర్‌లోని టెక్స్‌ఫోరులో ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ తీసుకుంటున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అబ్దుల్‌ ముఖ్సిత్‌ఖాన్, ప్లేస్‌మెంట్‌ కో ఆర్డినేటర్‌ డ్టాక్టర్‌ హకీముద్దీన్‌ తెలిపారు.  

తొలిప్రయత్నంలోనే... 
నేను మదరసా బ్యాక్‌ గ్రౌండ్‌ నుంచి వచ్చి కడప మను పాలిటెక్నిక్‌లో ఎలక్ట్రికల్‌ పూర్తి చేసి తొలి ప్రయత్నంలోనే సౌదీ అరేబియాలో బేటూర్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో ఎలక్ట్రికల్‌ సూపర్‌వైజర్‌గా ఎంపికయ్యాను.నెలకు రూ.40 వేల జీతం వస్తుంది. నేను మను పాలిటెక్నిక్‌లో చదువుకున్నందుకు గర్వంగా ఉంది.   
– ఆతిఫ్‌ ఆలం, దర్బాంగ, బీహార్‌.  

సంతోషంగా ఉంది... 
నేను మోకానికల్‌ ఇంజినీరింగ్‌ చేశాను. చదువు పూ ర్తికాగానే కడపలోని ఎండీహెచ్‌ హుందాయిలో స్పేర్‌పార్ట్‌ విభాగంలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది. నాకు ప్రస్తుతం నెలకు 10 వేలు జీతం వస్తుంది.   
– అసదుల్లాహ్‌ అజాం, ఉత్తరప్రదేశ్‌ 

ఆనందంగా ఉంది 
నా పేరు షేక్‌ నిజాముద్దీన్, కడపలోని మాసాపేట. నేను కడపలోని మున్సిపల్‌ ఉర్దూ బాయిస్‌ హైస్కూల్‌ ఉర్దూ మీడియం చదివా. తరువాత మనులో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాను, ఇటీవల కొప్పర్తిలోని త్రివిసిన్‌ కంపెనీలో క్వాలిటీ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం వచ్చింది. నా జీతం ఏడాదికి 1,32,000 . చాలా సంతోçషంగా ఉంది.       
– షేక్‌ నిజాముద్దీన్, మాసాపేట, కడప.  

అమర్‌రాజా బ్యాటరీస్‌లో.. 
నేను మను పాలిటెక్నిక్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చేశాను. అమర్‌రాజా బ్యాటరీస్‌లో జె పవర్‌ సొల్యూషన్స్‌గా పనిచేస్తున్నాను. నాకు ఏడాదికి 1,44,000 జీతం వస్తుంది. నేను ఉర్దూ మీడియంలో చదివినా ఉద్యోగాన్ని సులభంగా తెచ్చుకున్నాను.
– షేక్‌ ముస్తఫా, కడప

ఏపీ ప్రజలకు వరం... 
మను ఉర్దూ పాలిటెక్నిక్‌ కళాశాలను కడపలో ఏర్పాటు చేయడం వైఎస్సార్‌జిల్లా ప్రజలతోపాటు ఏపీ ప్రజలకు వరం. ఎలాంటి ఖర్చు లేకుండా ఫీజులతోమాత్రమే పాలిటెక్నిక్‌ను పూర్తి చేయవచ్చు. చదువుకునే విద్యార్థులకు నేషనల్‌ స్కాలర్‌ షిప్స్‌ వంటివి కూడా వస్తాయి. ప్రస్తుతం ఈ కళాశాలలో ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, జార్ఖడ్, బెంగాల్, తెలంగాణా రాష్ట్రాలతోపాటు ఏపీకి చెందిన పలువురు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.       
– డాక్టర్‌ ఎండీ అబ్థుల్‌ ముఖ్సిత్‌ఖాన్,ప్రిన్సిపాల్, మనుపాలిటెక్నిక్‌ కళాశాల, కడప

ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ చేస్తున్నాను.. 
నేను మనులో అప్పీరెల్‌ టెక్నాలజీలో పాలిటెక్నిక్‌ చివరి సంవత్సరం చదువుతున్నాను, ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌లో భాగంగా హిందూపూరులో టెక్స్‌ఫోర్టు అప్పిరెల్‌ స్లీవ్‌ యూనిట్‌లో శిక్షణ తీసుకుంటున్నాను. నాతోపాటు మరికొందరు శిక్షణ తీసుకుంటున్నారు.
 – మొఘల్‌ నబియా, కడప.  

సామాజిక బాధ్యత గురించి అవగాహన 
విద్యార్థులకు చదువుతోపాటు సామాజిక బాధ్యత అంటే ఏమిటో ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. ఎన్‌ఎస్‌ఎస్‌ క్యాంపుల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవలందించడం, రోడ్లు శుభ్రం చేయడం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను చేయిస్తున్నాం. అలాగే మద్యం తాగడం వల్ల ఏం జరుగుతుందో కూడా వివరిస్తున్నాం.
– మహమ్మద్‌ సికిందర్‌ హుస్సేన్,  అసిస్టెంట్‌ ప్రొఫెసర్,  ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్, ఎన్‌ఎస్‌ఎస్‌ పోగ్రాం కోఆర్డినేటర్‌.    
 

మరిన్ని వార్తలు