ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు వ్యాక్సిన్‌ | Sakshi
Sakshi News home page

ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు వ్యాక్సిన్‌

Published Tue, Jun 8 2021 5:42 AM

Vaccine for mothers with children under five years says Anilkumar Singhal - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులందరికీ వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయించినట్టు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ చెప్పారు. ఇప్పటివరకు 45 ఏళ్ల వయసు పైన వారికే వ్యాక్సిన్‌ వేస్తున్నామన్నారు. కానీ చిన్నారుల్లో కరోనా వచ్చినప్పుడు తల్లి అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తల్లులకు కూడా టీకా వేస్తే రక్షణ ఉంటుందని చెప్పారు. ఆయన సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో థర్డ్‌వేవ్‌ వస్తుందో రాదో ఖచ్చితంగా చెప్పలేమని, ముందస్తు అంచనాలతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలి కాబట్టి తల్లులందరికీ వ్యాక్సిన్‌ వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులు 15 లక్షల నుంచి 20 లక్షల మంది ఉండవచ్చన్నారు.

వీరికి వ్యాక్సిన్‌ ఇవ్వడంపై వయసు నిబంధనలు సడలిస్తూ త్వరలోనే మార్గదర్శకాలు జారీచేస్తామని తెలిపారు. భవిష్యత్‌ అంచనాలనుబట్టి ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా వారం రోజుల్లోగా వసతులను పరిశీలించాలని ఆదేశించినట్టు చెప్పారు. ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోనూ ఈ అంచనా వేస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని ఆస్పత్రుల్లో చిన్నారులకు అవసరమైన వెంటిలేటర్లు, వార్డులు తదితరాలు సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో మూడు చిన్నపిల్లల ఆస్పత్రులు నిర్మించాలని సీఎం ఆదేశించారన్నారు. ఈనెల 20వ తేదీ వరకు కర్ఫ్యూ పొడిగించాలని, ఈనెల 11 నుంచి సడలింపు సమయాన్ని 2 గంటలు పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని తెలిపారు.

ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకునేవారు పెరిగారు
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం చికిత్స చేయించుకునేవారి సంఖ్య పెరిగిందని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 21, 130 మందిలో 17,944 మంది (84.92 శాతం) ఆరోగ్యశ్రీ కింద ఉన్నారని చెప్పారు. కేవలం ప్రైవేటు ఆస్పత్రుల్లో అయితే చికిత్స పొందుతున్న 9,659 మందిలో 6,443 మంది (67 శాతం) ఆరోగ్యశ్రీ కింద ఉన్నారని తెలిపారు. అన్ని జిల్లాల్లో కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. తూర్పుగోదావరి, చిత్తూరు, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా పాజిటివిటీ రేటు భారీగా తగ్గుతోందని తెలిపారు.

రాష్ట్రంలో బ్లాక్‌ఫంగస్‌ చికిత్సకు 91 వేలకుపైగా యాంఫొటెరిసిన్‌ బి ఇంజక్షన్లకు  ప్రభుత్వం ఆర్డర్లు పెడితే ఇప్పటివరకు కేంద్రం 13 వేలకుపైగా ఇంజక్షన్లు ఇచ్చిందన్నారు. పొసకొనజోల్‌ మాత్రలు, ఇంజక్షన్లను తగినన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు.  రాష్ట్రంలో 57,07,706 మందికి వ్యాక్సిన్‌ తొలిడోసు వేశామని, 25,80,432 మందికి రెండుడోసులు వేశామని చెప్పారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఏ వయసు వారిలో ఎంతశాతం కేసులు వచ్చాయి, రాష్ట్రంలో ఆ కేసుల శాతం ఎలా ఉంది అన్నదానిపై అంచనా వేసినట్లు ఆయన వివరించారు.

Advertisement
Advertisement