‘మార్గదర్శి’ మోసాలపై కలిసికట్టుగా పోరాటం: బాధితుల సంఘం

23 Feb, 2024 21:27 IST|Sakshi

సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్స్‌ మోసాలపై కలిసికట్టుగా పోరాడేందుకు బాధితులు సిద్ధమయ్యారు. మార్గదర్శి చిట్స్‌ బాధితుల సంఘం పేరుతో రిజిస్ట్రేషన్ అవ్వగా, విజయవాడ కేంద్రంగా ఈ సంఘం పనిచేయనుంది. అందరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని బాధితుల సంఘం పేర్కొంది. మోసపోయిన వారు తమను సంప్రదించాలని, తమ సమస్యలను 9849055267 నెంబర్‌కు పంపించాలని బాధితుల సంఘం తెలిపింది.

ఇదీ మార్గదర్శి బాగోతం
హిందూ అవిభక్త కుటుంబం పేరిట మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సాధారణ ప్రజానీకం నుంచి ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 45(ఎస్‌)కు విరుద్ధంగా రూ.2,600 కోట్లు సేకరించిందనే విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అన్ని ఆధారాలతో ఆర్‌బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లారు. వారి నుంచి తగిన స్పందన లేకపోవడంతో చట్ట ప్రకారం తమ ముందున్న ఆధారాల ఆధారంగా మార్గదర్శిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మార్గదర్శి ఉల్లంఘనలపై విచారణ జరిపేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు ఎన్‌.రంగాచారిని నియమిస్తూ 2006లో జీవో 800 జారీ చేసింది.

ఇదే సమయంలో సీఐడీ తరఫున సంబంధిత కోర్టుల్లో పిటిషన్లు, దరఖాస్తులు దాఖలు చేసేందుకు అధీకృత అధికారిగా టి.కృష్ణరాజును నియమిస్తూ జీవో 801 జారీ చేసింది. ఈ రెండు జీవోలపై మార్గదర్శి హైకోర్టును ఆశ్రయించగా, జీవోలపై స్టే చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్గదర్శి అక్రమాలపై విచారణ జరిపిన రంగాచారి 2007 ఫిబ్రవరిలో నివేదిక సమర్పించారు.

రికార్డుల తనిఖీకి మార్గదర్శి ఏ మాత్రం సహకరించలేదని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. అలాగే మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ భారీ నష్టాల్లో ఉందని, మెచ్యూరిటీ సమయంలో డిపాజిట్లు తిరిగి చెల్లించే పరిస్థితిలో ఆ సంస్థ లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ నిధులను ఇతర అనుబంధ కంపెనీలకు మళ్లించడమే ఈ పరిస్థితికి కారణమని ఆయన వివరించారు.

ఇదీ చదవండి: ముమ్మాటికీ ఆర్థిక నేరస్తుడే

whatsapp channel

మరిన్ని వార్తలు