పథకాల అమలులో ఏపీ ప్రామాణికం | Sakshi
Sakshi News home page

పథకాల అమలులో ఏపీ ప్రామాణికం

Published Sun, Oct 8 2023 4:47 AM

Vidadala Rajini On Implementation of schemes in Andhra Pradesh - Sakshi

సాక్షి, బెంగళూరు: సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్‌ దేశానికే గొప్ప ప్రామాణికంగా నిలుస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సమానత్వాన్ని సాధించొచ్చనే లక్ష్యంతో సీఎం వైఎస్‌ జగన్‌ పనిచేస్తున్నారని వెల్లడించారు. ప్రముఖ మీడియా గ్రూప్‌.. సౌత్‌ ఫస్ట్‌ ఆధ్వర్యంలో బెంగళూరులో శనివారం దక్షిణ్‌ డైలాగ్స్‌ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. దక్షిణ భారత రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై మదింపు జరిగింది. దీనికి ఆయా రాష్ట్రాల ఐటీ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాలకు ఒక అభివృద్ధి నమూనా ఉందా? ఒకవేళ ఉంటే అది సరైన దారి­లోనే ఉందా? అనే అంశాలపై చర్చ నిర్వహించారు.   

అనేక సంస్కరణలకు శ్రీకారం.. 
ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. మన దేశంలోనే గొప్ప రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ పరిపాలనలో ముందుకు దూసుకెళుతోందని తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో సీఎం జగన్‌ అనేక విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని వెల్లడించారు. ప్రతి పథకం ఆయన ఆలోచన నుంచి వచ్చేందేనన్నారు. అమ్మఒడి ద్వారా ఏటా 44.50 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారని చెప్పారు. దీనివల్ల విద్యార్థుల డ్రాప­వుట్లు నివారించి అక్షరాస్యత శాతాన్ని పెంచగలిగామన్నారు.

నాలుగేళ్లలో ఈ పథకానికి తమ ప్రభు­త్వం ఏకంగా 26,067.28 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. అలాగే రాష్ట్రంలోని 46 వేల పాఠశాలలను నాడు–నేడు కింద రూ.17,805 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. జగనన్న విద్యా కానుక, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన కార్యక్రమాల ద్వారా 1 నుంచి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తున్నామని తెలిపారు. నిజమైన మహిళా సాధికారత దిశగా ఆంధ్రప్రదేశ్‌ ముందడుగు వేస్తోందన్నారు.

వైఎస్సార్‌ ఆసరా ద్వారా ఇప్పటివరకు 7.98 లక్షల మహిళా గ్రూపులకు రూ.19,178.17 కోట్ల రుణాలను తమ ప్రభుత్వం మాఫీ చేసిందని తెలిపారు. అలాగే వైఎస్సార్‌ చేయూత కింద 45 నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఒక్కొక్కరికి ఏటా రూ.18,750 చొప్పున అందించిందన్నారు. 30 లక్షల మందికిపైగా మహిళ­లకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడంతోపాటు ఇళ్లు కూడా కట్టి ఇస్తోందని చెప్పారు. ఆరోగ్యశ్రీ, వైఎస్సార్‌ రైతు భరోసా, వాహన మిత్ర , నేతన్న నేస్తం.. ఇలా ఎన్నో పథకాలను అమలు చేస్తోందన్నారు.  

ఫ్యామిలీ డాక్టర్‌ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏపీ 
ఏపీలో వైద్య ఆరోగ్య రంగంలో తమ ప్రభుత్వం కనీవినీ ఎరుగని సంస్కరణలు ప్రవేశపెట్టిందని రజిని తెలిపారు. రాష్ట్రంలోని అందరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్‌ చేశామని చెప్పారు. దేశంలో ఫ్యామిలీ డాక్టర్‌ వైద్య విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏపీయేనని వెల్లడించారు. రూ.16 వేల కోట్లతో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేశామన్నారు. జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా వైద్య పరీక్షలు చేయడంతోపాటు ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా ముందుకు వెళితే మంచి ఫలితాలు సాధించొచ్చని అభిప్రాయపడ్డారు.    

Advertisement
Advertisement