నేడు పట్టాలెక్కనున్న విజయవాడ–చెన్నై వందేభారత్‌ రైలు | Sakshi
Sakshi News home page

నేడు పట్టాలెక్కనున్న విజయవాడ–చెన్నై వందేభారత్‌ రైలు

Published Sun, Sep 24 2023 4:21 AM

Vijayawada Chennai Vande Bharat train starts on Sunday - Sakshi

సాక్షి, అమరావతి/రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): విజయవాడ–చెన్నై వందేభారత్‌ రైలు ఆదివారం నుంచి పట్టాలు ఎక్కనుంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌గా జెండా ఊపి ఈ రైలును ఆదివారం ప్రారంభిస్తారు. విజయవాడ నుంచి తమిళనాడు రాజధానితోపాటు తిరుపతి ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండేందుకు రేణిగుంట మీదుగా చెన్నై చేరుకుంటుంది. అదే మార్గంలో చెన్నై నుంచి విజయవాడకు వస్తుంది. విజయవాడలో సాయంత్రం 3.20 గంటలకు బయలుదేరి రాత్రి 10 గంటలకు చెన్నై చేరుకుంటుంది.

చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌లో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.10కి విజయవాడ చేరుకుంటుంది. మధ్యలో తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో హాల్ట్‌ ఉండేలా ఈ రైలు రూట్‌ మ్యాప్‌ ఖరారు చేశారు. మంగళవారం మినహా మిగిలిన ఆరు రోజులు ఈ వందేభారత్‌ రైలు సర్విసును నిర్వహిస్తారు. ఒక ఎగ్జిక్యూటివ్‌ చైర్‌కార్‌ కోచ్‌తోపాటు మొత్తం 8 కోచ్‌లు, 530 సీట్లతో ఈ రైలును రూపొందించారు. ఈ రైలు టికెట్ల బుకింగ్‌ను రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది.

టైమింగ్స్‌ ఇలా.. 
రోజూ ఉదయం 5.30 గంటలకు చెన్నైలో బయలుదేరి రేణిగుంట జంక్షన్‌కు 7.05, నెల్లూరుకు 8.39, ఒంగోలుకు 10.09, తెనాలి జంక్షన్‌కు 11.21, విజయవాడకు మధ్యాహ్నం 12.10 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు మధ్యాహ్నం 3.20 గంటలకు విజయవాడలో బయలుదేరి తెనాలి 3.49, ఒంగోలు 5.03, నెల్లూరు 6.19, రేణిగుంట రాత్రి 8.05, చెన్నై సెంట్రల్‌కు 10 గంటలకు చేరుకుంటుంది.

టికెట్‌ ధరలు ఇలా..
విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్‌కు కేటరింగ్‌ చార్జీలతో.. 
ఏసీ చైర్‌ కార్‌:   రూ.1,420 
ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ చైర్‌ కార్‌: రూ. 2,630 
 
కేటరింగ్‌ చార్జీ లేకుండా.. 
ఏసీ చైర్‌ కార్‌: రూ.1,135 
ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కార్‌:రూ. 2,280 

చెన్నై సెంట్రల్‌ నుంచి విజయవాడకు కేటరింగ్‌ చార్జీలతో.. 
ఏసీ చైర్‌ కార్‌:  రూ.1,320 
ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌:  రూ.2,540 
 
కేటరింగ్‌ చార్జీ లేకుండా.. 
ఏసీ చైర్‌ కార్‌:  రూ.1,135 
ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ చైర్‌ కార్‌:  రూ.2,280

Advertisement
Advertisement