స్టార్టప్‌లకు ‘కల్పతరువు’ | Sakshi
Sakshi News home page

స్టార్టప్‌లకు ‘కల్పతరువు’

Published Mon, Sep 19 2022 4:10 AM

Visakha becoming platform for fourth generation technology innovations - Sakshi

సాక్షి, అమరావతి: పారిశ్రామికరంగంలో నాలుగో తరం టెక్నాలజీ ఆవిష్కరణలకు విశాఖ వేదిక అవుతోంది. విశాఖ ఉక్కు (ఆర్‌ఐఎన్‌ఎల్‌)తో కలిసి సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) సంయుక్తంగా ‘కల్పతరువు’ పేరుతో ఏర్పాటుచేసిన ఇండస్ట్రీ–4.0 సీవోఈ (సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ) కార్యకలాపాలు సెప్టెంబర్‌ 20 నుంచి లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. దేశంలోని స్టార్టప్‌లను ఆకర్షించేలా ఓపెన్‌ చాలెంజ్‌ ప్రోగ్రాం–1 (ఓసీపీ–1)ను కల్పతరువు సీఓఈ ప్రకటించింది.

విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలు ఆర్‌ఐఎన్‌ఎల్, ఎన్‌టీపీసీ, వైజాగ్‌ పోర్టు, హెచ్‌పీసీఎల్‌ వంటి పరిశ్రమల్లో మానవ వనరుల వినియోగం తగ్గించి ఖర్చులను నియంత్రించే నూతన టెక్నాలజీ ఆవిష్కరణలను పెంచి తద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు కల్పతరువు సీవోఈని ఏర్పాటుచేసినట్లు ఎస్‌టీపీఐ విశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ సురేష్‌ ‘సాక్షి’కి తెలిపారు.

ఇందులో భాగంగా.. ముందుగా విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన ఆరు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఓసీపీ–1 పేరుతో స్టార్టప్‌లను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో సమస్యకు ఇండస్ట్రీ–4 టెక్నాలజీతో చక్కటి పరిష్కరం చూపిన ప్రోటోటైప్‌ స్టార్టప్‌ను ఎంపికచేసి రూ.4 లక్షలు బహుమతిగా ఇవ్వడమే కాక, కల్పతరువు సీవోఈ ద్వారా ప్రాజెక్టు ఫండింగ్‌ సౌకర్యం కల్పిస్తారు.

పరిశ్రమల్లో ఆటోమేషన్‌ పెంచేందుకు బిలియన్‌ డాలర్లు వ్యయం చేస్తున్నారని, ఇందులో నూతన ఆవిష్కరణలకు విశాఖ వేదిక కానుందని కల్పతరువు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ గ్రూపు సభ్యుడు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఐటాప్‌) ప్రెసిడెంట్‌ శ్రీధర్‌ కోసరాజు తెలిపారు. రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి సౌరభ్‌ గార్గ్, ఆర్‌ఐఎన్‌ఎల్‌ సీఎండీ, కేంద్ర ఐటీ శాఖ అధికారులతో వర్చువల్‌గా మంగళవారం ఓసీపీ–1ను ప్రారంభించనున్నారు.

రూ.20 కోట్లతో ‘కల్పతరువు’
సుమారు రూ.20 కోట్లతో కల్పతరువు ఇండస్ట్రీ–4 సీవోఈ అభివృద్ధి చేస్తున్నారు. ఆరు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న ఈ సీవోఈ పనులు వేగంగా జరుగుతున్నట్లు సురేష్‌ తెలిపారు. ఇప్పటికే ల్యాబ్‌ పనులు మొదలయ్యాయని, రెండు నెలల్లో ఈ సీవోఈని అధికారికంగా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

ఓసీపీ–1లో ఎంపికైన స్టార్టప్‌లతో కల్పతరువును ప్రారంభించడానికి ఓపెన్‌ ఛాలెంజ్‌ ప్రోగ్రాంను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈ పోటీలో గెలిచిన స్టార్టప్‌లు కల్పతరువులో ఏర్పాటుచేసిన ల్యాబొరేటరీ, ఇంక్యుబేషన్‌ వినియోగించుకోవడంతోపాటు ఎస్‌టీపీఐ నుంచి ఫైనాన్సింగ్, మానిటరింగ్‌ సహకారం లభిస్తాయి. 

Advertisement
Advertisement