మిలాన్‌ విన్యాసాలు ప్రారంభం | Sakshi
Sakshi News home page

మిలాన్‌ విన్యాసాలు ప్రారంభం

Published Tue, Feb 20 2024 6:02 AM

Vizag all set to host international maritime event MILAN 2024: Andhra pradesh - Sakshi

సాక్షి, విశాఖపట్నం: యుద్ధ నౌకల సమాహారం.. ప్రపంచ నౌకాదళాల సమన్వయం ‘మిలాన్‌–2024’ విశాఖ వేదికగా సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రతిష్టాత్మక నౌకాదళ యుద్ధ విన్యాసాల ప్రదర్శన ‘మిలాన్‌–2024’లో 58 దేశాలు పాల్గొంటున్నాయి. ఇప్పటికే చాలా దేశాలకు చెందిన నౌకాదళాలు, కోస్ట్‌గార్డ్‌ బృందాలు, యుద్ధనౌకలు, విమానాలు, హెలికాఫ్టర్లు, సబ్‌మెరైన్లు విశాఖకు చేరుకున్నాయి.

ఈ నెల 27వ తేదీ వరకు జరిగే మిలాన్‌–2024లో భాగంగా తొలి రోజు మధ్యాహ్నం మారీటైమ్‌ వార్‌ఫేర్‌ సెంటర్‌లో వివిధ దేశాల మధ్య ప్రీ సెయిల్‌ డిస్కషన్స్‌ జరిగాయి. హార్బర్‌ ఫేజ్‌  విన్యాసాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అదేరోజు రాత్రికి ఐస్‌ బ్రేకర్‌ డిన్నర్‌ ఏర్పాటు చేసి అన్ని దేశాల అధికారులు, సిబ్బందికి భారత నౌకాదళం ఆతిథ్య విందు ఇవ్వనుంది. కాగా, 22వ తేదీన జరిగే ప్రతిష్టాత్మక సిటీ పరేడ్‌కు సంబంధించిన రిహార్సల్స్‌ సోమవారం సాయంత్రం ఆర్కే బీచ్‌లో అద్భుతంగా జరిగాయి. మంగళవారం సాయంత్రం జరిగే తుది రిహార్సల్స్‌కు నౌకాదళ అధికారులు, జిల్లా అధికారులు హాజరుకానున్నారు.

ఇప్పటి వరకూ విశాఖ చేరుకున్న యుద్ధ నౌకల వివరాలు 
సీ షెల్‌ నుంచి కోస్ట్‌గార్డ్‌కు చెందిన పీఎస్‌ జొరాస్టర్‌ డిస్ట్రాయర్, శ్రీలంక నుంచి ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్‌ సయురాలా యుద్ధనౌక, మయన్మార్‌ నుంచి యూఎంఎస్‌ కింగ్‌సిన్‌పీసిన్‌ యుద్ధ నౌక, ఇండొనేషియా నుంచి కేఆర్‌ఐ సుల్తాన్‌ ఇస్కందర్‌ ముదా యుద్ధ నౌక, రాయల్‌ ఆస్ట్రేలియా నేవీ నుంచి హెచ్‌ఎంఏఎస్‌ వార్మూంగా వెసల్, జపాన్‌ మేరీటైమ్‌ సెల్ఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ నుంచి జేఎస్‌ సజనామీ యుద్ధ నౌక వచ్చాయి. వీటితోపాటు రాయల్‌ థాయ్‌ నేవీ నుంచి హెచ్‌టీఎంఎస్‌ ప్రచువాప్‌ ఖిర్కీఖాన్‌ వార్‌ఫేర్, వియత్నాం పీపుల్స్‌ నేవీ నుంచి కార్వెట్టీ 20 డిస్ట్రాయర్, యూఎస్‌ నేవీ నుంచి యూఎస్‌ఎస్‌ హాల్సే యుద్ధ నౌక, బంగ్లాదేశ్‌కు చెందిన బీఎన్‌ఎస్‌ ధలేశ్వరి యుద్ధ నౌక, రాయల్‌ మలేషియా నుంచి కేడీ లేకిర్‌ యుద్ధ నౌక, రష్యన్‌ నేవీ నుంచి మార్షల్‌ షాపోష్నికోవ్‌ వార్‌ షిప్, వర్యాగ్‌ గైడెడ్‌ మిసైల్‌ షిప్‌ కూడా విశాఖ చేరుకున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement