After Three Decades, Penna River Sees Water Flow - Sakshi
Sakshi News home page

మూడు దశాబ్దాల తర్వాత పెన్నాలో నీటిజాడ 

Published Mon, May 23 2022 11:19 AM

Water In Penna River After Three Decades - Sakshi

పెన్నా నదిలో నీటిని చూడడమే ఒక వింత అని.. మృతదేహాలను పూడ్చిపెట్టడానికే ఈ ప్రాంతం పనికొస్తుందని.. ముప్పై ఏళ్లకొకసారే పెన్నా  ప్రవహిస్తుందని.. ఇలా రక రకాల వాదనలు ఉన్నాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఈసారి పెన్మ్మ పరవళ్లు   తొక్కుతోంది. ఏడు నెలల వ్యవధిలోనే భారీ వర్షాలకు రెండు సార్లు నది  పారింది. దీంతో నది పరీవాహక  ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు,   వంకలు, పెన్నార్‌ –  కుముద్వతి ప్రాజెక్టు నీటితో కళకళలాడుతున్నాయి.

హిందూపురం టౌన్‌: కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపూర్‌ జిల్లా నంది హిల్స్‌లో పుట్టే పెన్నా నది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహిస్తుంది. 597 కిలోమీటర్లు ప్రవహించే ఈ నది ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు వద్ద తీరంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. శ్రీసత్యసాయి జిల్లాలోకి హిందూపురం మండలం చౌళూరు వద్ద ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి పలు గ్రామాల మీదుగా కోనాపురం వద్ద పరిగి మండలంలో ప్రవేశించి శ్రీరంగరాజుపల్లి సమీపాన పెన్నానదికి ఉపనది అయిన కుముద్వతి నదితో కలిసి పెన్నా–కుముద్వతి ప్రాజెక్టుకు నీరు చేరుతుంది. అక్కడి నుంచి రొద్దం మీదుగా కర్ణాటక రాష్ట్రం నాగలమడక ప్రాజెక్టుకు చేరి.. అలా మరోసారి ఆంధ్రాలో కలిసి కనగానపల్లి మీదుగా రామగిరి వద్ద అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టు (పేరూరు డ్యామ్‌)లోకి కలుస్తుంది. దాదాపు 75 కిలోమీటర్ల మేర పెన్నానది ఈ జిల్లాలో ప్రవహిస్తుంది.  

మూడు రోజులుగా కురిసిన వర్షాలకు పెన్నా పారుతోంది. హిందూపురం మండలం చౌళూరు, సంతేబిదనూరు, కిరికెర, బేవినహళ్లి, సుగూరు చెరువులు,  పెన్నా–కుముద్వతి ప్రాజెక్టులో కలిసిన తర్వాత లెఫ్ట్‌ కెనాల్‌ ద్వారా పరిగి మండలం పరిగి, శాసనకోట, సుబ్బరాయునిపల్లి, కొడిగెనహళ్లి చెరువులు, రైట్‌ కెనాల్‌ ద్వారా కొట్నూరు, కొల్లకుంట, ఊటుకూరు చెరువులకు నీరు చేరుతోంది. పరిగి మండలం పైడేటి నుంచి రొద్దం మండలంలోకి ప్రవేశిస్తోంది.

జిల్లాలో 18,418 ఎకరాల ఆయకట్టుకు లబ్ధి చేకూరుతోంది.  మూడు దశాబ్దాల కిందట (1991 ఏప్రిల్‌లో) కర్ణాటకలో కురిసిన వర్షాలకు చాలా చెరువులు తెగి పెన్నా, ఉపనది జయమంగళి ఉధృతంగా ప్రవహించాయి. ఆంధ్ర ప్రాంతంలో వర్షాలు తక్కువైనప్పటికీ మన ప్రాంతంలో నదులు పారి చెరువులు నిండి మరువలు పారాయి. మళ్లీ ఇప్పుడు మండు వేసవిలో చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో నదులు పరవళ్లు తొక్కుతుంటే జిల్లా ప్రజలు ఆశ్చర్యంలో మునిగిపోయారు. దీనికి తోడు ఏడు నెలల వ్యవధిలోనే పెన్నా నది రెండు సార్లు పారింది. ఇదో అద్భుతంగా అభివర్ణిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

భూగర్భజలాల మెరుగు
నీటికి కటకటలాడే పరిస్థితుల నుంచి చెరువులు నిండి, భూగర్భజలాలు సైతం మెరుగుపడి బోర్లు రీచార్జ్‌ అయ్యాయి. పెన్నా నది ఏడు నెలల్లో రెండు సార్లు పారడం పరీవాహక ప్రాంత ఆయకట్టు రైతులకు శుభ పరిణామం. సాగు, తాగు నీటి కష్టాలు తీరనున్నాయి. ఇరిగేషన్‌ రికార్డుల్లో వేసవిలో పెన్నానది పారినట్లు లేనేలేదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెన్నా నది మేలో పారింది. ఖరీఫ్‌ సీజన్‌లో చెరువుల కింద పంట పండించే రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుంది.  
 – యోగానంద్, ఇరిగేషన్‌ డీఈ, హిందూపురం 

పెన్నా నదికి పునరుజ్జీవం తేవాలి
ఎండలు మండే మే నెలలో వర్షాల కారణంగా పెన్నా నది ప్రవహించడం ఇదివరకెన్నడూ చూడలేదు. 30 ఏళ్ల తర్వాత పెన్నా నది గత నవంబర్‌లో ప్రవహించింది. ఏడు నెలల్లో రెండోసారి పెన్నా పరవళ్లు తొక్కడం సంతోషకరం. పరీవాహక ప్రాంత చెరువుల్లో నీరు చేరుతూ భూగర్భజలాలు మెరుగయ్యాయి. ఖరీఫ్‌ సీజన్‌లో ఆయకట్టు కింద పంటల సాగుకు ఎంతో ఉపయోగకరం. పెన్నాపై సర్‌ఫ్లస్‌ డ్యామ్‌లు కట్టి నీరు నిల్వ ఉంచేలా చేసి నదికి పునరుజ్జీవం తేవాల్సిన అవసరం ఉంది.  
– వెంకటరామిరెడ్డి, ఏపీ రైతు సంఘం నాయకుడు 

ఆనందంగా ఉంది
పెన్నా నది ప్రవాహం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలు, నదిలో నీటి ప్రవాహంతో భూగర్భజలాలు పెరిగాయి. ఎకరా పొలంలో ఇప్పటి వరకు పూల సాగు చేస్తూ వచ్చాను. చెరువు నిండి, బోర్లలోనూ నీరు సమృద్ధిగా ఉన్నందున నీటి కొరత తీరింది. ఖరీఫ్‌లో మొక్కజొన్న వేస్తాను. ఇప్పటికే పనులు కూడా ప్రారంభించాను.  
 – కేబీ నాగన్న, రైతు, చౌళూరు

Advertisement

తప్పక చదవండి

Advertisement