Subha Muhurtham: మళ్లీ కల్యాణ ఘడియలు వచ్చేశాయి.. | Sakshi
Sakshi News home page

Subha Muhurtham: మళ్లీ కల్యాణ ఘడియలు వచ్చేశాయి..

Published Tue, Feb 1 2022 8:36 PM

Wedding Season Starts From February 2nd 2022 - Sakshi

వీధి మధ్యలో పెళ్లి మండపం తీర్చిదిద్ది ఎన్నాళ్లయ్యిందో. వివాహ ఊరేగింపులో మనసారా గంతులేసి ఎన్ని రోజులైందో. పెళ్లింటిలో మేకప్‌ వేసుకున్న ముఖాన్ని ధైర్యంగా చూపించి రెండేళ్లు గడిచిపోయింది. భయం లేకుండా విందు భోజనం ఆరారా తిన్న సంగతి కూడా గుర్తు లేకుండా పోయింది. రెండేళ్ల పాటు కరోనా అన్ని ఆనందాలను దూరం చేసింది. ఇప్పుడు కోవిడ్‌ కేసులతో పాటు భయం కూడా కొద్దికొద్దిగా తగ్గుతున్న నేపథ్యంలో కల్యాణ ఘడియలు ఫిబ్రవరి 2 నుంచి మొదలుకానున్నాయి. ఈ శుభ ముహూర్తాలపై సప్లయర్స్, బ్యాండు, వంటల నిర్వాహకులు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాదైనా తమకు పూర్వ వైభవం వస్తుందని ఆశ పడుతున్నారు.  

సాక్షి, రాజాం, ఇచ్ఛాపురం రూరల్‌: రెండేళ్లు కోవిడ్‌ భయంతో గడిచిపోయాయి. నిబంధనల మధ్య వేడుకలు, కొద్ది మంది అతిథులతో పెళ్లిళ్లు, ఆర్భాటం లేని వివాహాలకు అంతా అలవాటు పడ్డారు. ఈ తరహా వేడుకలతో బ్యాండు మేళాలు, సప్లయర్స్‌ వారు భారీగా నష్టపోయారు. బతుకంతా పదిలంగా ఉండాల్సిన జ్ఞాపకాలను కూడా చాలామంది కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మళ్లీ కల్యాణ ఘడియలు వచ్చేశాయి. కోవిడ్‌ నిబంధనలు అమలులో ఉన్నప్పటికీ కోవిడ్‌పై ప్రజలకు అవగాహన రావడంతో శుభ కార్యాలు కాసింత వేడుకగా నిర్వహించేందుకు అంతా సిద్ధమవుతున్నారు. గత రెండేళ్లుగా నష్టాల బాటలో ఉన్న బ్యాండు పార్టీలు, సౌండ్‌ సప్లయర్స్‌ నిర్వాహకులు, వంట మేస్త్రీలు ఆశగా ఎదురుచూస్తున్నారు.   



ఆ రెండు నెలల్లోనే..  
ఈ ఏడాది ప్రధానంగా ఏప్రిల్, జూన్‌ నెలల్లో అత్యధి క ముహూర్తాలు ఉన్నాయి. ఫిబ్రవరి 2 నుంచి ముహూర్తాలు ప్రారంభమవుతున్నటికీ ఈ నెలలో కేవలం 12 రోజులు మాత్రమే మంచి ముహూర్తాలు ఉన్నాయి. అనంతరం గురు మూఢం రావడంతో తి రిగి మార్చి 18వ తేదీ వరకూ ఎలాంటి పెళ్లి ముహూర్తాలు లేవు. మార్చిలో కేవలం ఆరు రోజులు మాత్ర మే మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్‌ నెలలో అత్యధికంగా 14 రోజులు మంచి ముహూర్తాలు ఉండగా, మే నెలలో 11 రోజులు, జూన్‌ నెలలో 13 రో జులు చక్కటి ముహూర్తాలు ఉన్నాయి. జూలై నుంచి ఆషాఢం ప్రారంభమవుతుంది. ఆగస్టులో 10 రోజు లు, డిసెంబర్‌లో తొమ్మిది రోజులు మంచి ముహూర్తాలు ఉన్నాయి. సెప్టెంబర్‌లో శుక్ర మూఢం ప్రారంభమై అక్టోబర్, నవంబర్‌ వరకూ కొనసాగుతుంది. దీంతో ఈ మూడు నెలల్లో ఎలాంటి ముహూర్తాలు లేవు.  

కోటి ఆశలు..  
ఫిబ్రవరి నెలలో జిల్లాలో చాలా పెళ్లిళ్లు జరగనున్నాయి. దీంతో ఈ నెలలో చాలా చోట్ల భజంత్రీలకు డిమాండ్‌ పెరిగింది. దక్షిణ సన్నాయి మేళం కనీసం రూ.18 వేలు చెల్లిస్తేనే వచ్చే పరిస్థితి ఉంది. పెద్దపెద్ద బ్యాండ్‌ బాజాలు రూ. 60 వేలు దాటి వసూలు చేస్తున్నాయి. వంట మాస్టార్లకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. సౌండ్‌ సప్లయర్స్, డీజేలకూ మంచి గిరాకీ ఉంది. గత రెండేళ్లుగా నష్టాలు చవిచూసిన వీరంతా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కల్యాణ మండపాలూ ఇప్పుడిప్పుడే ముస్తాబవుతున్నాయి. అడ్వాన్స్‌ బుకింగ్‌లు కూడా చాలా చోట్ల కనిపిస్తున్నాయి.  

ముహూర్తాలివే.. 
ఫిబ్రవరి నెలలో 2, 3, 5, 6, 7, 10, 11, 17, 19 తేదీల్లో వందల సంఖ్యల్లో జిల్లాలో వివాహాలు జరుగనున్నాయి. ముఖ్యంగా 3, 5, 10, 11, 19 తేదీల్లో బలమైన ముహూర్తాలు కావడంతో వివాహాలు చేసేందుకు పెళ్లి వారు సమాయత్తమవుతున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన పెళ్లిళ్లతో పాటు ఉపనయనాలు చేసేందుకు మంచి ముహూర్తంగా పండితులు చెబుతున్నారు.   

ఫిబ్రవరిలోనే.. 
ఈ ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 20వ తేదీ వరకు మంచి ముహూర్తాలున్నాయి. ఆ తర్వాత మూఢం కావడంతో ఉగాది వరకు మంచి శుభముహూర్తాలు లేవు. గత ఏడాది కోవిడ్‌–19తో చాలా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు వాయిదా పడ్డాయి. వేసవి కాలంలో జరగాల్సిన పెళ్లిళ్లు కార్తీక మాసంలో జరిగా యి. నూతన గృహప్రవేశాలు, ఇతర శుభకార్యా లు జరుపుకునేలా అంతా సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సందడితో పూర్వ వైభవం రానుంది.  – నారాయణపాడి, పురోహితుడు, ఈదుపురం, ఇచ్ఛాపురం మండలం 

 4న వివాహం జరగనుంది 
గత ఏడాది జరగాల్సిన నా పెళ్లిని కరోనాతో వాయిదా వేసుకున్నాం. ఈ ఏడాది మళ్లీ థర్డ్‌వేవ్‌ ఉద్ధృతం కానుందని స్నేహితులు చెప్పడంతో  ఫిబ్రవరి 4న నేను పెళ్లి చేసుకుంటున్నాను. పెళ్లిళ్లకు మైక్‌ అండ్‌ డీజేలను వివాహాలకు తీసుకువెళ్తున్నాను. 3, 5, 10, 11, 17 తేదీల్లో నాకు మంచి గిరాకీ ఉంది. 
– దున్న చిరంజీవి, పెళ్లి కుమారుడు, లైటింగ్‌ అండ్‌ సౌండింగ్‌ యజమాని, బూర్జపాడు, ఇచ్ఛాపురం మండలం

ఆర్డర్లు వస్తున్నాయి  
గత రెండేళ్లుగా ఎలాంటి బేరాలు లేవు. సప్లయర్స్‌ను ఎవరూ పట్టించుకోలేదు. మా వద్ద పనిచేసిన సిబ్బందిని కూడా తీసేశాం. ఇప్పుడిప్పుడే అడ్వాన్స్‌ బుకింగ్‌లు వస్తున్నాయి. ఈ ఏడాది పెళ్లిళ్లు అధికంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కోవిడ్‌ కరుణిస్తే ఈ ఏడాది మాకు నష్టాలు తప్పే అవకాశం ఉంది. 
 – మక్క శ్రీనివాసరావు, సప్లయర్స్‌ యజమాని, పెంట గ్రామం, జి.సిగడాం మండలం  

మంచి ముహూర్తాలు ఉన్నాయి 
ఈ ఏడాది మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఎక్కువగా ఫిబ్రవరి నెలలో పెళ్లిళ్లకు అనుకూలంగా ఉంది. ఏప్రిల్, జూన్‌ నెలల్లో కూడా అనుకూ ల రోజులు ఉన్నాయి. ఈ ఏడాది పెళ్లిల్లు, గృహ ప్రవేశాలు అధికంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  
– ఎం.శ్రీనివాసరావు శర్మ, సంతకవిటి మండలం   

Advertisement

తప్పక చదవండి

Advertisement