చిట్టి రోబో.. – ద లాయర్‌  | Sakshi
Sakshi News home page

చిట్టి రోబో.. – ద లాయర్‌ 

Published Sun, Feb 12 2023 3:24 AM

Worlds first robot lawyer powered by AI to defend a human in court - Sakshi

రోబోలు.. డ్యాన్సులు చేస్తున్నాయి.. ఫుట్‌బాల్‌ ఆడుతున్నాయి.. ఆకలిగా ఉందని హోటల్‌కు వెళ్తే నచ్చినవన్నీ వేడివేడిగా వడ్డించేస్తున్నాయి.. పాటలు పాడుతున్నాయి.. పాఠాలూ చెబుతున్నాయి.. చివరకు చైనాలో ఓ కంపెనీకి సీఈవోగా కూడా వ్యవహరిస్తున్నాయి. ఇదే క్రమంలో ఇప్పుడు ‘వకీల్‌’ అవతారంలో ప్రజల ముందుకు రాబోతోంది సరికొత్త రోబో. నిజమే.. యువరానర్‌.. నా క్లెయింట్‌ ఏ తప్పూ చేయలేదంటూ కోర్టులో వాదించబోతోంది. ఈ విషయాన్ని రోబో లాయర్‌ ›తయారీ సంస్థ డునాట్‌ పే ప్రకటించింది. ఎలాంటి రుసుం లేకుండా ట్రాఫిక్‌ చలానా కేసుల్ని వాదించేందుకు దీన్ని తయారు చేసినట్లు వెల్లడించింది. ఈనెల 22వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు అమెరికా కోర్టులో ఈ రోబో లాయర్‌  మొదటిసారిగా ప్రత్యక్షమవ్వనుంది.


మనుషులు తయారు చేసిన అద్భుత ఆవిష్కరణ రోబో. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న కొద్దీ.. రోబోల వినియోగం విస్తృతమవుతోంది. అన్ని రంగాల్లోకి కృత్రిమ మేధస్సు కలిగిన రోబోలు అడుగుపెట్టేస్తున్నాయి. ఇప్పుడు న్యాయస్థానంలోనూ తనకు ఎదురు లేదని నిరూపించేందుకు రోబో సిద్ధమవుతోంది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఈ రోబో లాయర్‌ను అమెరికాకు చెందిన డునాట్‌ పే అనే స్టార్టప్‌ కంపెనీ ప్రపంచానికి  పరిచయం చేస్తోంది. ట్రాఫిక్‌ చలానాలకు  సంబంధించిన కేసులన్నీ వాదించేలా ఈ రోబో పట్టు సాధించిందని సంస్థ వ్యవస్థాపకుడు  జోషువా బ్రౌడర్‌ ప్రకటించారు. 

2015 నుంచి పరిశోధనలు... 
జోషువా బ్రౌడర్‌ 2015లో ‘డునాట్‌ పే’ అనే లీగల్‌ సరీ్వసెస్‌ చాట్‌బాట్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి రోబో లాయర్‌ తయారీపై పరిశోధనలు చేస్తూ.. ఎట్టకేలకు దాన్ని ఆవిష్కరించారు. దీనికి శిక్షణ ఇచ్చేందుకు చాలా సమయం పట్టిందని బ్రౌడ­ర్‌ చెబుతున్నారు. పరిమితికి మించి వేగంగా వాహనాన్ని నడిపిన రెండు కేసులను ఈ రోబో లాయర్‌ తొలిసారిగా వాదించనుందని ప్రకటించారు. ఇది స్మార్ట్‌ఫోన్‌ సహాయంతో పనిచేస్తుందని చెప్పారు.

కోర్టులో వాదన విన్న తర్వాత.. కౌం­­ట­­ర్‌గా వాదించాల్సిన అంశాలను ‘ఇయర్‌ ఫో­న్‌’ ద్వారా సూచిస్తుందని.. కేవలం రోబో లాయర్‌ చె­ప్పి­న విషయాలను మాత్రమే ప్రతివా­ది కోర్టుకు విన్నవిస్తారని స్పష్టం చేశారు. దీని వినియోగం వల్ల వేగంగా కేసులు పరిష్కారమయ్యే అవకాశముంద­ని.. కోర్టు ఖర్చులు చాలా వరకు తగ్గుతాయని చెప్పారు. సహేతుక కారణాలు చూపించిన వారికి ఉచితంగా సేవలందించేందుకు సిద్ధమని ప్రకటించారు.

చట్టం ఒప్పుకుంటుందా? 
వాద, ప్రతివాదనలు జరుగుతున్నప్పుడు న్యాయస్థానాల్లో ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఉపయోగించకూడదని యూఎస్‌ సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో రోబోను వినియోగించడం సాధ్యమా అనే అంశంపై అందరిలోనూ సందేహాలు నెలకొన్నాయి. దీనిపై జోషువా స్పందించారు. ‘డునాట్‌ పే’ అనేది లీగల్‌ సరీ్వసులకు సంబంధించిన ఆన్‌లైన్‌ చాట్‌బాట్‌ అని స్పష్టం చేశారు. అందువల్ల న్యాయపరంగా వివాదం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

యూఎస్‌ సుప్రీంకోర్టులో  లాయర్‌ రోబో చెప్పిన విషయాలను అక్షరం తప్పు లేకుండా చెప్పిన వారికి కోటి డాలర్లు బహుమతిగా ఇస్తానని జోషువా సవాల్‌ కూడా విసిరారు. భారతదేశంలోని చట్టాల ప్రకారమైతే రోబో లాయర్లను అనుమతించే అవకాశమే లేదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకు ప్రస్తుతమున్న చట్టంలో మార్పులు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అడ్వకేట్‌ చట్టం–1961 ప్రకారం రోబో లాయర్లను అనుమతించే ప్రొవిజన్‌ లేదని న్యాయవాది నమిత్‌ సక్సేనా పేర్కొన్నారు. న్యాయవాదులు ఏఐ ద్వారా వారికి అవసరమైన సమాచారాన్ని తీసుకునే వీలుందని న్యాయనిపుణుల అభిప్రాయపడుతున్నారు.

- కె.జి.రాఘవేంద్రారెడ్డి (సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం) 

Advertisement

తప్పక చదవండి

Advertisement