ఒక్క రూపాయికే టిడ్కో ఇల్లు | Sakshi
Sakshi News home page

ఒక్క రూపాయికే టిడ్కో ఇల్లు

Published Thu, Nov 19 2020 2:34 AM

YS Jagan Comments In Review Meeting On Spandana Video Conference - Sakshi

సాక్షి, అమరావతి: ఒకే ఒక్క రూపాయి చెల్లింపుతో ఏపీ టిడ్కో (ఆంధ్రప్రదేశ్‌ టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) ఇంటిని లబ్ధిదారులకు అప్పగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ ఏర్పాట్లు, ఇళ్ల నిర్మాణాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో స్పందన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. టిడ్కో ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2,62,200 ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. ఇందులో ఇప్పటికే  300 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఇళ్లు 1,43,600 నిర్మాణంలో ఉన్నాయని, 365 చదరపు అడుగుల్లో 44,300 ఇళ్లు, 430 చదరపు అడుగుల్లో 74,300 ఇళ్ల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. టిడ్కోకు సంబంధించి గత ప్రభుత్వం రూ.3,200 కోట్లు బకాయి పెట్టి పోయిందన్నారు. ఒక వైపు ఆ బకాయిలు తీరుస్తూనే, మన ప్రభుత్వం వచ్చాక ప్రజల కోసం ఇప్పటికే రూ.1,200 కోట్లు ఇచ్చామని, ఈ వారంలో మరో రూ.400 కోట్లు, 15 రోజుల్లో ఇంకో రూ.600 కోట్లు ఇస్తామని వివరించారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..

మూడేళ్ల పాటు ప్రాజెక్టు 
► రూ.2,500 కోట్లు టిడ్కో ఇళ్ల మౌలిక వసతుల కోసం ఖర్చు పెట్టనున్నాం. ఆ మేరకు టెండర్లు పిలవబోతున్నాం. డిసెంబర్‌ 15 నాటికి ఆ టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలి. 
► ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం ప్రభుత్వం రూ.9,550 కోట్లు వ్యయం చేస్తుంది. ఈ ఏడాది, వచ్చే ఏడాది, ఆ తర్వాత ఏడాది కూడా పనులు చేపట్టి పూర్తి చేస్తాం. 
► పేదలకు హక్కుగా ఇచ్చిన ఇళ్లను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం ఎందుకు? చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడో ప్రజలకు కూడా అర్థం కావడం లేదు. జగన్‌ స్కీమ్‌ కావాలనుకున్న వారికి డిసెంబర్‌ 25న కేవలం ఒక్క రూపాయితో అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌ అవుతుంది. 

ఎవరి స్కీమ్‌ కావాలి?
► వచ్చే సోమవారం (23వ తేదీ) నుంచి ఈ నెల 30వ తేదీ వరకు టిడ్కో కింద 300 చదరపు అడుగుల ఇల్లు పొందనున్న లబ్ధిదారుల దగ్గరకు వలంటీర్లు ప్రభుత్వ లెటర్‌ తీసుకువెళతారు. మీకు చంద్రబాబు స్కీమ్‌ కావాలా? జగన్‌ స్కీమ్‌ కావాలా? అని అడుగుతారు. ఏది కావాలో తేల్చుకోమని చెబుతారు. 

ఇదీ బాబు స్కీమ్‌..
► లబ్ధిదారుడు రూ.3 లక్షల అప్పును నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్ల పాటు వడ్డీతో సహా మొత్తం రూ.7 లక్షలు కట్టాలి. ఆ తర్వాతే ఇంటిపై హక్కులు చేతికి వస్తాయి. అప్పుడే ఆ ఇంటి పట్టా లబ్ధిదారులకు అందుతుంది.

ఇది జగన్‌ స్కీమ్‌..
► డిసెంబర్‌ 25న 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేవలం ఒక్క రూపాయితో అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌ చేస్తారు. ఏ అప్పు లేకుండా వెంటనే సర్వ హక్కులతో ఇల్లు సొంతమవుతుంది. ఆ తర్వాత పక్కాగా ఫ్రీ రిజిస్ట్రేషన్‌ చేస్తారు.  

Advertisement
Advertisement