CM YS Jagan Govt Approves Proposal To Give Complete Rights To SCs On Assigned Lands - Sakshi
Sakshi News home page

CM YS Jagan Cabinet Meeting: చరిత్రాత్మక నిర్ణయం.. ‘అసైన్డ్‌’ రైతుల జీవితాల్లో వెలుగు 

Published Fri, Jul 14 2023 5:00 AM

YS Jagan Govt Giving All Rights to Farmers on Assigned Lands - Sakshi

సాక్షి, అమరావతి:  రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అసైన్డ్‌ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కేటాయించిన 20 సంవత్సరాల తర్వాత అసైన్డ్‌ భూముల యజమానులకు సర్వ హక్కులు ఇవ్వడం భూముల వ్యవహారాల్లోనే మేలి మలుపు. దీనివల్ల 15 లక్షల మందికిపైగా రైతులకు ప్రయోజనం చేకూరడంతోపాటు రాష్ట్రంలో అసైన్డ్‌ భూముల వివాదాలకు తెరపడనుంది.

సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో లక్షలాది మంది రైతుల బతుకు చిత్రాన్ని మార్చే అత్యంత కీలకమైన ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేశారు. భూమి లేని నిరుపేదలు, ఆర్మీలో పని చేసిన వారు, స్వాతంత్య్ర సమర యోధులకు వ్యవసాయ భూములు ఇస్తారు (అసైన్‌ చేస్తారు). తమకు ఇచ్చిన భూములను స్వాతంత్య్ర సమర యోధులు, ఆర్మీలో పని చేసిన వారు (ఎక్స్‌ సర్వీస్‌మెన్‌).. పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు.

కానీ నిరుపేదలు మాత్రం అమ్ముకునే అవకాశం లేదు. 1954కు ముందు భూములు ఇచ్చిన వారికి పట్టాల్లో ఎక్కడా వాటిని అమ్మకూడదనే షరతు లేదు. 1954 తర్వాత ఇచ్చిన అసైన్డ్‌ చట్టాల్లో మాత్రం భూములు అమ్మకూడదనే నిబంధన ఉంది. దీంతో ఈ భూములన్నింటినీ నిషేధిత జాబితా 22 (ఎ)లో పెట్టారు. దీనివల్ల వాటి క్రయవిక్రయాలకు అవకాశం లేకుండా పోయింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1954కు ముందు అసైన్డ్‌ అయిన భూములను నిషేధిత జాబితా నుంచి తీసివేసే ప్రక్రియ ప్రారంభించింది.

1954 తర్వాత అసైన్డ్‌ అయిన భూములు మాత్రం నిషేధిత జాబితాలో ఉన్నాయి. 1977లో ఏపీ అగ్రికల్చరల్‌ ల్యాండ్‌ (ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌–పీఓటీ) చట్టం వచ్చింది. దీని ప్రకారం భూమి లేని నిరుపేదలకు వ్యవసాయం కోసం ఇచ్చిన భూములు అమ్ముకోకూడదు. ఎలాంటి కష్టం వచ్చినా, అవసరం వచ్చినా, చదువుల కోసమైనా, ఆరోగ్యం కోసమైనా అమ్ముకునే అవకాశం లేదు. ఈ చట్టం రూపొందించడానికి ముందు ఉన్న అసైన్డ్‌ భూములు కూడా ఈ చట్టం వల్ల నిషేధిత జాబితాలోకి వచ్చేశాయి.  
 
హక్కు లేక.. అమ్ముకోలేక.. 
తమకు ఇచ్చిన భూమిలో ఏదైనా అవసరం వచ్చి అరెకరం, ఇంకొంత గానీ అమ్ముకోవాలనుకుంటే చట్ట ప్రకారం అమ్ముకోలేని పరిస్థితి ఉండడంతో అసైన్డ్‌ రైతులు తమ భూములు రిజిస్ట్రేషన్‌ చేయడానికి అవకాశం లేక కాగితాల మీద రాసి అమ్మకాలు జరిపారు. ఫలితంగా వారికి రావాల్సిన రేటులో కనీసం 25 శాతం కూడా దక్కేది కాదు. తక్కువ రేటుకే తమ భూములను సాదాబైనామాల పద్ధతిలో అమ్ముకునేవారు. ఆ భూమిపై హక్కు లేకపోవడం వల్ల రెవెన్యూ శాఖ ఎప్పుడైనా వారికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉండేది.

ఆ భూమి ప్రభుత్వం తీసేసుకుంటుందని, వేరే అవసరాలకు రిజర్వు చేస్తోందనే భయాందోళనలు రైతుల్లో ఉండేవి. మరో వైపు రెవిన్యూ రికార్డులు క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితిని తెలిపేలా లేవు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారు 19,21,855 మందికి 33,29,908 ఎకరాలు అసైన్డ్‌ చేస్తే ఆ రికార్డులు క్షేత్ర స్థాయికి తగ్గట్టుగా లేవు. 1954 నుంచి అసైన్‌మెంట్లు (కేటాయింపులు) జరుగుతూనే ఉన్నాయి. అంటే 70 సంవత్సరాల తర్వాత కూడా అసైన్డ్‌ భూములపై రైతులకు హక్కులు లేవు. 
 
ప్రజాప్రతినిధుల కమిటీతో విస్తృత అధ్యయనం  
ఈ భూములపై అనేక విజ్ఞప్తులు అందడంతో వీటిపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో 13 మంది ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలతో 2022 ఆగస్టు 30న సీఎం జగన్‌ ప్రజాప్రతినిధుల కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కర్ణాటక, తమిళనాడులో పర్యటించి అక్కడి విధానాలపై అధ్యయనం చేసింది. అసైన్డ్‌ భూములకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉన్న చట్టాలు, నియమ నిబంధనలను సైతం క్షుణ్ణంగా పరిశీలించింది.

కేరళ రాష్ట్రంలో అసైన్‌ చేసిన మూడేళ్ల తర్వాత, కర్ణాటకలో 25 ఏళ్ల తర్వాత, తమిళనాడులో పదేళ్ల తర్వాత కొన్ని నిబంధనలతో అమ్ముకునే అవకాశం ఉందన్న విషయాన్ని కమిటీ పరిగణనలోకి తీసుకుంది. కర్ణాటకలో ఐదేళ్ల తర్వాత కలెక్టర్‌ అనుమతితో అసైన్డ్‌ భూములను అమ్ముకోవచ్చు. తమిళనాడులో మిగులు భూముల్లో ఇచ్చిన అసైన్మెంట్‌ అయితే 25 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు.

వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత మన రాష్ట్రంలో అసైన్‌ చేసిన 20 ఏళ్ల తర్వాత లబ్ధిదారులు, వారు లేకపోతే వారి వారసులు (హక్కుదారులు) వారికి అవసరమైనప్పుడు అమ్ముకునే అవకాశం కల్పించాలని కమిటీ భావించింది. ఇందుకోసం ఏపీ అసైన్‌మెంట్‌ (పీఓటీ)–1977కు సవరణలు చేయాలని కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ నివేదిక ఇచ్చింది. అంటే అసైన్‌మెంట్‌ జరిగి 20 ఏళ్లు పూర్తయితే అసైన్‌దారులు, వారి వారసులకు పూర్తి యాజమాన్య హక్కులు ఇవ్వాలని సిఫారసు చేసింది. దీనికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  
 
15.21 లక్షల మంది రైతుల జీవితాల్లో వెలుగు 
ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రైతులకు మేలు జరుగుతుంది. సుమారు 15,21,160 మంది భూమి లేని నిరుపేదలకు వారికి సంబంధించిన 27,41,698 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తాయి. 20 ఏళ్లకు ముందు ఇచ్చిన భూములన్నింటికీ ఇది వర్తిస్తుంది. ఈ భూములన్నీ 1954 తర్వాత అసైన్‌మెంట్‌ చేసినవే. ఈ 20 ఏళ్లలో 4,00,695 మందికి 5,88,211 ఎకరాల భూమిని అసైన్‌ చేశారు. ప్రతి సంవత్సరం రెవిన్యూ విభాగం 20 ఏళ్లు పూర్తయిన భూముల జాబితాను తయారు చేసి, వాటిని 22(ఎ) నుంచి తొలగిస్తుంది.

గతంలో మాదిరిగా ఒక భూమిని 22(ఎ) నుంచి తొలగించాలంటే అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. రెవెన్యూ శాఖ తనకు తానే 20 ఏళ్లు దాటిన భూములను జాబితా నుంచి తీసివేస్తుంది. అసైన్డ్‌ రైతులు ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ ఉండదు. అవినీతి ఉండదు. పారదర్శకంగా ఈ ప్రక్రియ నడుస్తుంది. అదే సమయంలో ఎవరైనా 20 ఏళ్లకు ముందే పేద రైతుల నుంచి భూములు కొనుక్కుని ఉంటే వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. వారికి ఎటువంటి హక్కులు రావు. అలాంటి వారి విషయంలో 1977 పీఓటీ చట్టం అమల్లో ఉంటుంది.  

పదేళ్ల తర్వాత ఇళ్ల పట్టాలు అమ్ముకోవచ్చు 
వ్యవసాయ భూములే కాకుండా ప్రభుత్వం ఇళ్ల పట్టాలు నిరుపేదలకు అసైన్‌ చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 31 లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది. ఇలా ఇచ్చిన ఇళ్లపై 20 సంవత్సరాల తర్వాత గత చట్టాల ప్రకారం సర్వ హక్కులు లభించేవి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక దాన్ని 10 ఏళ్లకు తగ్గిస్తూ పీఓటీ చట్టంలో సవరణ చేసింది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాలు పొందిన వారితోపాటు, మిగిలిన వారికీ ఇది వర్తిస్తుంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement