ఈ క్రాప్‌లో ఫస్ట్‌.. ఈ కేవైసీలో బెస్ట్‌ | Sakshi
Sakshi News home page

ఈ క్రాప్‌లో ఫస్ట్‌.. ఈ కేవైసీలో బెస్ట్‌

Published Mon, Oct 10 2022 10:30 AM

YSR District Got First Rank In E Crop And Also Fourth Place In E KYC - Sakshi

కడప అగ్రికల్చర్‌: అన్నదాత కష్టానికి నష్టం జరిగేటప్పుడు ఆ నష్టం ప్రభుత్వం భర్తీ చేసేలా ఉండేందుకు వినూత్నంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ క్రాప్‌ నమోదు జిల్లాలో రికార్డు స్థాయిలో జరిగింది. గత నెల 25న ఈ క్రాప్‌ గడువు ముగిసింది. 100 శాతం నమోదుకు గాను 133.37 శాతం మేర నమో దు చేసి అధికార యంత్రాంగం శభాష్‌ అనిపించుకుంది. ఈ క్రాప్‌ నమోదులో వైఎస్సార్‌ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ క్రాప్‌ నమో దు పూర్తి చేసుకున్న రైతులందరూ తప్పని సరిగా ఈకేవైసీ కూడా వేయాలి. ఈ విషయంలో వైఎస్సార్‌ జిల్లా 56.19 శాతం మేర నమోదు చేసి రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది. ఈకేవైసీ నమోదు గడువు ఈనెల 10వ తేదీతో ముగియనుంది.  

ఈ క్రాప్‌ నమోదు విజయవంతం
వైఎస్సార్‌ జిల్లాలో ఈ క్రాప్‌ నమోదు ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయింది. అన్నదాతలకు ప్రభు త్వ ప్రోత్సాహకాలు, వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు, అతివృష్టి, అనావృష్టి, తెగుళ్లతో నష్టం జరిగితే పంటల బీమా పథకంలో పరిహారం పొందడానికి ఈ క్రాప్‌ నమోదు తప్పనిసరి. దీంతోపాటు గతేడాది జిల్లాలో అధిక వర్షాలతో చాలా మంది రైతులకు సంబంధించిన పంటలకు నష్టం జరిగింది. అయితే నష్టపోయిన పంటలన్నింటికి ప్రభుత్వం పంటనష్ట పరిహారం చెల్లించింది.

దీంతో చాలామంది రైతులు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. గతంలో కొంతమంది రైతులు ఈ క్రాప్‌ నమోదులో నిర్లక్ష్యం వహించడంతో పరిహారం అందక ఇబ్బందులు పడ్డారు. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సారి అన్న దాతలు ఉత్సాహంగా పంటలను నమోదు చేసుకున్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్, విలేజ్‌ హార్టికల్చర్‌ అసిస్టెంట్, విలేజ్‌ సెరికల్చర్‌ అసిస్టెంట్లు  ఈ క్రాప్‌ వివరాలను నమోదు చేశారు. గ్రామీణ ప్రాంతాలలో వీఆర్వోలతోపాటు వీరు ఈ వివరాలను ధ్రువీకరించాలి.  

సాధారణం కంటే అధిక శాతం
జిల్లాలో 36 మండలాల పరిధిలోని 735 రెవెన్యూ గ్రామాలకుగాను 676 గ్రామాల పరిధిలో ఈ ఖరీఫ్‌ సీజన్‌కుగాను వ్యవసాయ, ఉద్యానశాఖ, సెరికల్చర్‌కు సంబంధించి సాధారణ విస్తీర్ణం 2,64.664. 81 ఎకరాలు ఉండగా ఈ ఏడాది సకాలంలో వర్షాలు రావడంతో 3,54,300.03 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో 1,34,812 మంది రైతులకు సంబంధించి 3,54,300.03 ఎకరాల్లో ఈ క్రాప్‌ నమోదు పూర్తి చేసుకుని 133.87 శాతం మేర  నమోదు ప్రక్రియ పూర్తయింది. 

ముమ్మరంగా ఈకేవైసీ
మొన్న మొన్నటి వరకు ఈ క్రాప్‌ నమోదులో బిజీబిజీగా ఉన్న విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు, విలేజ్‌ హార్టికల్చర్‌ అసిస్టెంట్లు, సెరికల్చర్‌ అసిసెంట్లతోపాటు వీఆర్వోలు ప్రస్తుతం ఈ క్రాప్‌ నమోదుకు సంబంధించి ఈకేవైసీతో ధ్రువీకరణ చేసే ప్రక్రియ చేపట్టారు. ఈ ప్రక్రియ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతంలో ముమ్మరంగా సాగుతోంది. జిల్లాలోని 36 మండలాల పరిధిలో 9వ తేదీ ఉదయానికి 75518 మంది రైతులకు సంబంధించి 2,12,110 ఎకరాల్లో ఈకేవైసీ పూర్తి చేసి 56.19 శాతం మేర నమోదుతో రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది. ఈ ప్రక్రియ ఈనెల 10వ తేదీతో ముగియనుంది  

నమోదుపై తనిఖీ
సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి పంటను చూసి ఈ పంట నమోదు చేశారు. ఈ రైతు ఏ పంట వేశాడో పరిశీలించి ఈ క్రాప్‌లో నమోదు చేశారు. ఈ అంశాన్ని రైతులే స్వయంగా తెలుసుకోవచ్చు. ఈ నెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రైతు భరోసా కేంద్రాల్లో వివరాలు అందుబాటులో ఉంచనున్నారు. అక్కడి నుంచి ఏడు రోజులపాటు అంటే ఈ నెల 28వ తేదీలోపు రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిని పరిశీలించి మార్పులు, చేర్పులు చేస్తారు. ఇందుకు సంబంధించిన తుది జాబితాను ఈ నెల 31న ఆయా రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తారు.  

లక్ష్యానికి మించి ఈ క్రాప్‌ నమోదు  
వైఎస్సార్‌ జిల్లాలో లక్ష్యానికి మించి ఈ క్రాప్‌ నమోదు చేశాం. సాధారణంగా వందశాతం చేయాల్సి ఉండగా ప్రస్తుతం   133.87 శాతం మేర చేశాం. ఈ క్రాప్‌ నమోదుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.  ఈకేవైసీని కూడా ప్రస్తుతం ముమ్మరంగా చేస్తున్నాం. ఈ ప్రక్రియంతా పూర్తి చేసి ఈ నెలాఖరుకు తుది జాబితాను ప్రదర్శిస్తాం.      
– అయితా నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి. వైఎస్సార్‌ జిలా

Advertisement
Advertisement