నాటక సమాజాలకు ‘వైఎస్సార్‌ రంగస్థల పురస్కారం’ | Sakshi
Sakshi News home page

నాటక సమాజాలకు ‘వైఎస్సార్‌ రంగస్థల పురస్కారం’

Published Sat, Oct 14 2023 2:49 AM

YSR Stage Award for theater societies - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలోని నాటక రంగం అభివృద్ధికి విశేష కృషి చేస్తోన్న రంగస్థల సమాజాలు, పరిషత్‌లకు ఈ ఏడాది నుంచి ‘వైఎస్సార్‌ రంగస్థల పురస్కారం’ అవార్డులను ప్రవేశపెడుతున్నట్లు ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీ ఎఫ్‌డీసీ) చైర్మన్‌ పోసాని కృష్ణమురళి అన్నారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌కే పరిమితమైన కళా ప్రదర్శనలను ఆడిటోరియంలు, కళా వేదికలు నిర్మించడం ద్వారా అన్ని ప్రాంతాలకు విస్తరించేలా మహానేత వైఎస్‌ రా­జశేఖరరెడ్డి చర్యలు చేపట్టారని గుర్తు చేశారు.

కళాకారుల అ­భ్యున్నతిలో వైఎస్సార్‌ సేవలను స్మరించుకుంటూ రూ.5 లక్షల నగదు బహుమతితో ‘వెఎస్సార్‌ రంగస్థల పురస్కారం’ అందజేస్తామని చెప్పారు. దీనితో పాటు నాటక రంగంలో రాణిస్తోన్న కళాకారులకు ఇప్పటికే ఉన్న ఎన్టీఆర్‌ రంగస్థల పురస్కారం కింద రూ.1.50 లక్షలు ప్రదానం చేయనున్నట్లు తెలిపా­రు. త్వరలోనే పురస్కారాలకు ఎంపికలను ప్రారంభిస్తామన్నారు.

గుంటూరులో నంది అవార్డుల నాటక పోటీలు
రంగస్థల నంది నాటక అవార్డులకు తుది ఎంపిక పోటీలను నవంబర్‌ చివరి వారం/డిసెంబర్‌ మొదటి వారంలో గుంటూరులో నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికే 115 నాటకాలు, నాటికల్లో ప్రాథమిక ఎంపిక పూర్తయిందని, న్యాయ నిర్ణేతలు పరిశీలన అనంతరం 38 నాటకాలు, నాటికలను తుది ప్రదర్శనకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని కళాకారులు, నటీనటులకు ఎటువంటి సభ్యత రుసుము లేకుండా ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీ చేయనున్నట్లు చెప్పారు.

ఈ నెల 15 నుంచి ఆన్‌లైన్‌లో కళా కారులు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా www.apsftvtdc.in పోర్టల్‌ను సిద్ధం చేశామ­ని చెప్పారు. జూనియర్‌ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, దర్శక, నిర్మాతల వివరాలను వెబ్‌సైట్‌లో అం­దు­బాటులో ఉంచుతామన్నారు. అవసరమైతే కళాకారులకు బస్సు ప్రయాణంలో రాయితీ కల్పించేందుకుకృషి చేస్తామన్నారు.  

చిత్ర పరిశ్రమను రావాలనే కోరారు..
రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సీఎం జగన్‌ సుముఖంగా ఉన్నారని విలేకరుల ప్రశ్నలకు పోసాని బదులిచ్చారు. గతంలో చిత్ర పరిశ్రమలోనే ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేసి ఏపీలో ఏ ప్రాంతంలోనైనా స్టూడియోల నిర్మాణానికి ముందుకొస్తే ఎంతైనా స్థలం కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారని గుర్తు చేశారు. కళాకారులు ఇక్కడికే వచ్చి స్థిరపడితే వారికి ఇళ్ల స్థలాలతో పాటు ఇతర ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారని వెల్లడించారు. తెలుగు సినీ పరిశ్రమ విశాఖకు వచ్చే అంశాన్ని పరిశీలించాలని మరోసారి కోరతామన్నారు.

చెన్నై నుంచి హైదరాబాద్‌కు పెద్ద సమస్య లేకుండా సినీ పరిశ్రమ తరలివచ్చిందన్నారు. ఏపీ, తెలంగాణలు రెండూ తెలుగు ప్రాంతాలే కావడం..హైదరాబాద్‌ నుంచి ఏపీకి వెళ్తామంటే అక్కడి ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు ఇచ్చిన స్థలాలను వెనక్కి ఇవ్వాలని కోరితే ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి తలెత్తుతుందన్నారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే తరలింపుపై నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రభుత్వంతో చర్చించి అవసరమైతే వచ్చే ఏడాది నుంచి ఎన్టీఆర్‌ రంగ స్థల పురస్కారం నగదు ప్రోత్సాహక పెంపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. 

Advertisement
Advertisement