‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌ | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌

Published Fri, Mar 17 2023 3:59 AM

YSRCP clean sweep in 'local' MLC elections - Sakshi

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌:  స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. మొత్తం 9 స్థానాలనూ కైవసం చేసుకుంది. వీటిలో 5 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలు జరిగిన మిగతా 4 స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ నాలుగు స్థానాలకు ఈనెల 13న పోలింగ్‌ జరిగింది. గురువారం ఓట్లు లెక్కించారు.

శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి నర్తు రామారావు, కర్నూలు జిల్లా నుంచి మధుసూదన్, పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు నియోజకవర్గాల నుంచి వంకా రవీంద్రనాథ్, కవురు శ్రీనివాస్‌ ఘనవిజయం సాధిం­చారు. ఈ నాలుగు స్థానాల్లోనూ సంఖ్యా బలం లేకపోయినా స్వతంత్రుల ముసుగులో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థులు ఘోర పరాజయం పాల­య్యారు. కాగా, 3 పట్టభద్రుల నియోజకవర్గాలు, 2 ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

స్థానిక సంస్థల కోటాలో అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తూర్పు గోదావరి.. కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కటి, పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు స్థానాలు మొత్తం 9 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎస్‌.మంగమ్మ, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, సిపాయి సుబ్రమణ్యం, మేరుగ మురళీధర్, కుడిపూడి సూర్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.



పశ్చిమలో రెండు స్థానాలూ వైఎస్సార్‌సీపీకే
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికలు జరిగిన రెండు ఎమ్మెల్సీ స్థానాలు అధికార వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. గురువారం ఏలూరులో జరిగిన ఓట్ల లెక్కింపులో గంటన్నరలోనే ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 1105 ఓట్లకు గాను 1088 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 25 చెల్లుబాటు కాలేదు. వాటిలో 20 టీడీపీవికాగా, మరో 5 వైఎస్సార్‌సీపీవి. వాస్తవబలం కంటే వైఎస్సార్‌సీపీకి అదనంగా 50 ఓట్లు రావ­డం గమనార్హం.

చెల్లుబాటైన 1063 ఓట్లలో మొదటి ప్రాధా­న్యతలోనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్‌కు 481 ఓట్లు, వంకా రవీంద్రనాథ్‌కు 460 ఓట్లు వచ్చాయి. టీడీపీ, జనసేన అభ్యర్థి వీరవల్లి చంద్రశేఖర్‌కు 122 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో అధికారులు వంకా రవీంద్రనాథ్, కవురు శ్రీనివాస్‌లను విజేతలుగా ప్రకటించారు.

కర్నూలులో వైఎస్సార్‌సీపీకి బలానికి మించి ఓట్లు
ఉమ్మడి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ బోయ మధుసూదన్‌ ఘన విజయం సాధించారు. కర్నూలులో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా,  9.30 గంటలకే పూర్తయింది. ఇక్కడ మొత్తం 1,178 ఓట్లలో 1,136 పోలయ్యాయి. 53 ఓట్లు చెల్లలేదు. ఉన్న బలం కంటే ఎక్కువ ఓట్లు వైఎస్సార్‌సీపీకి పోలయ్యాయి.

వాస్తవానికి వైఎస్సార్‌సీపీకి 959 ఓట్లు బలం ఉండగా, 988 ఓట్లు వచ్చాయి. అధికంగా నమోదైన 29 ఓట్లనుబట్టి చూస్తే టీడీపీ, బీజేపీ, వామపక్షాల ప్రజాప్రతినిధులు వైఎస్సార్‌సీపీకే మద్దతు పలికినట్లు స్పష్టమవుతోంది. స్వతంత్ర అభ్యర్థులు ఎన్‌.మోహన్‌రెడ్డికి 85, భూమా వెంకట వేణుగోపాల్‌రెడ్డికి 10 ఓట్లు వచ్చాయి.

శ్రీకాకుళంలో రామారావు ఘన విజయం
శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నర్తు రామారావు విజయ ఢంకా మోగించారు. మొత్తం 752 ఓట్లు పోలవగా.. అందులో నర్తు రామారావుకు 632 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఎ.రామకృష్ణకు 108 ఓట్లు వచ్చాయి. 12 ఓట్లు చెల్లలేదు. దీంతో 524 ఓట్ల ఆధిక్యతతో నర్తు విజయం సాధించారు.

Advertisement
Advertisement