AP: బడుగుల ‘సాధికార’ ప్రదర్శన | Sakshi
Sakshi News home page

AP: బడుగుల ‘సాధికార’ ప్రదర్శన

Published Wed, Dec 27 2023 4:27 AM

YSRCP Samajika Sadhikara Bus Yatra in Kovuru Constituency - Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం నలుమూలల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలన్నీ నార్తురాజుపాళేనికి కదలి వచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అందించిన చేయూతతో తాము సాధించిన సాధికారతను ప్రదర్శించాయి. మంగళవారం వైఎస్సార్‌సీపీ రాజుపాళెంలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేశాయి.

వారికి రాజుపాళెంలో వీధివీధినా ఘనస్వాగతం లభించింది. జై జగన్‌ నినాదాలతో రాజుపాళెం హోరెత్తింది. యాత్ర అనంతరం జరిగిన బహిరంగ సభలో వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు. పలువురు నేతలు రాష్ట్రానికి సీఎం వైఎస్‌ జగన్‌ చేస్తున్న మేలును, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అగ్రపథంలో నిలుపుతున్న తీరును వివరించారు. నేతలు సీఎం జగన్‌ పేరు పలికిన ప్రతిసారీ ప్రజలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అగ్రస్థానంలో నిలిపిన సీఎం జగన్‌: డిప్యూటీ సీఎం రాజన్నదొర
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమాన్ని అందిస్తున్నారని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర చెప్పారు. లంచాలు, రికమెండేషన్లు లేకుండా నేరుగా మన ఖాతాల్లోకి పథకాల డబ్బు జమ చేస్తున్నారని, ఇంతటి పారదర్శకమైన ప్రభుత్వం దేశంలో మరొకటి లేదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అగ్రస్థానంలో నిలుపుతూ ఆ వర్గాలు సాధికారత సాధించేందుకు దోహదపడిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అని చెప్పారు.

చంద్రబాబు ప్రభుత్వంలో గిరిజనులకు ఒక్క మంత్రి పదవీ ఇవ్వలేదని, సీఎం జగన్‌ ఇద్దరికి మంత్రి పదవులే కాదు, ఉప ముఖ్యమంత్రి పదవీ ఇచ్చారన్నారు. సీఎం జగన్‌ 2 లక్షల మంది గిరిజనులకు 3 లక్షల ఎకరాలకుపైగా భూమి ఇచ్చారని వివరించారు. పోడు భూములకు రైతు భరోసా అమలు చేసి 3.45 లక్షల మంది రైతులకు అందిస్తున్నారన్నారు.

జగనన్నతోనే సామాజిక విప్లవం: మంత్రి మేరుగు నాగార్జున 
సామాజిక విప్లవం దేశంలో ఒక్క సీఎం వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమైందని మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కుటుంబాలు బాగుండాలని, మిగిలిన వారితో సమానంగా బతకాలనే ఉద్దేశంతో సీఎం జగన్‌ అనేక పథకాలు ప్రవేశ పెట్టారని తెలిపారు. పేద పిల్లలు ఉన్నత శిఖ­రా­లకు వెళ్లాలని ఇంగ్లిష్‌ మీడియం తెచ్చారన్నారు. పేదవాళ్ల పిల్లలు బాగు పడటం ఇష్టం లేని చంద్రబాబు కోర్టుకెళ్లాడన్నారు. రామోజీరావు మనవళ్లు, రాధాకృష్ణ చుట్టాలు ఇంగ్లీష్‌ మీడియం చదవొచ్చు కానీ, ఎస్సీ, ఎస్టీల పిల్లలు చదవొద్దన్నది వారి భావ­మన్నారు. సీఎం జగన్‌ 31 లక్షలమంది పేదలకు ఇంటి పట్టాలిచ్చి, ఇళ్లు కట్టిస్తున్నారని తెలిపారు. 4 లక్షల మందికి ఉద్యోగాలిచ్చారని, వారిలో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలేనని అన్నారు.

జగనన్న పేదోడి కడుపు చూస్తారు: సినీ నటుడు అలీ
సీఎం జగన్‌ ప్యాలెస్‌లో ఉన్నా పేదవాడి కడుపు చూస్తారని సినీ నటుడు అలీ చెప్పారు. అందుకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం అనేక పథకాలు తీసుకొచ్చారని అన్నారు. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో డబ్బున్న వ్యక్తి ఒక బెడ్డుపై పడుకుంటే పక్క బెడ్డుపై పడుకొని పేదవాడు కూడా ఆపరేషన్‌ చేయించుకుంటున్నాడని, ఇది సీఎం జగన్‌ వల్లే సాధ్యపడిందని చెప్పారు. 2024లో జగనన్న వన్స్‌మోర్‌ అంటూ మనమంతా వైఎస్సార్‌సీపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం పెంచారు: ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ 
రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలను గుండెల్లో పెట్టుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ అని ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. సీఎం జగన్‌ బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం పెంచారని తెలిపారు. జగన్‌ సీఎం అయ్యాక నేరుగా వలంటీర్లనే ఇంటికి పంపి మనకు కావల్సినవన్నీ అందిస్తున్నారని తెలిపారు. టీడీపీ వస్తే వలంటీర్లను పీకేస్తామని లోకేశ్, చంద్రబాబు చెబుతున్నారని, ఇలాంటి వారు మనకు అవసరంలేదని చెప్పారు.

కోవూరు అభివృద్ధికి సీఎం జగన్‌ కృషి : ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
కోవూరు నియోజకవర్గం అభివృద్ధికి సీఎం జగన్‌ ఎంతగానో కృషి చేశారని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి చెప్పారు. 1.28 లక్షల కుటుంబాలకు రూ.981 కోట్లు నేరుగా ఖాతాల్లో వేశారన్నారు. నాన్‌ డీబీటీ ద్వారా రూ.394 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ఇంతటి సంక్షేమం ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రీ అందించలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement