ప్రతిష్టాత్మకంగా ప్లీనరీ 

30 Jun, 2022 03:35 IST|Sakshi

నాగార్జున వర్సిటీ ఎదుట ఏర్పాట్లు పరిశీలించిన వైఎస్సార్‌సీపీ నేతలు  

సమన్వయంతో విజయవంతం చేస్తాం: ఎంపీ విజయసాయిరెడ్డి 

2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యాచరణ 

సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిపాదించిన నవరత్నాలే మాకు వేద మంత్రాలు: సజ్జల 

ప్రజల అజెండాపైనే ప్లీనరీలో నిర్ణయాలు   

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ మూడో ప్లీనరీ సమావేశాలను ఆ పార్టీ నేతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విజయవాడ–గుంటూరు మధ్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సువిశాలమైన మైదానంలో ప్లీనరీ నిర్వహించడానికి ఏర్పాట్లు వేగవంతం చేశారు. 2017 జూలై 8, 9వ తేదీల్లో రెండవ ప్లీనరీని ఇక్కడే నిర్వహించిన విషయం తెలిసిందే. బుధవారం ప్లీనరీ ఏర్పాట్లను వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డిలు పరిశీలించారు.  

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, ముస్తఫా తదితరులు వారి వెంట ఉన్నారు. సీఎం ప్రోగ్రామ్స్‌ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం.. ఏర్పాట్లను వి.విజయసాయిరెడ్డి, సజ్జల తదితరులకు వివరించారు. ప్లీనరీకి విస్తృత స్థాయిలో పార్టీ శ్రేణులు హాజరు కానున్న నేపథ్యంలో ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని వారు తలశిల రఘురాం, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిలకు సూచించారు. అనంతరం ప్లీనరీ ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడారు.  
ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులకు ప్లీనరీ ఏర్పాట్లను వివరిస్తున్న సీఎం ప్రోగ్రామ్స్‌ కోఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌  

ముఖ్యమైన అంశాలపై ప్లీనరీ ఆమోదం కోరతాం 
వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలను ఇదే మైదానంలో నిర్వహించాం. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో 151 స్థానాలను చేజిక్కించుకుని, అఖండ విజయంతో అధికారంలోకి వచ్చింది. ఐదేళ్ల తర్వాత ప్రస్తుతం మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని జూలై 8, 9న ప్లీనరీ నిర్వహిస్తున్నాం. మళ్లీ ఐదేళ్ల తర్వాత 2027లో కూడా అధికారంలో ఉండే పార్టీగా ప్లీనరీ సమావేశాలను ఘనంగా నిర్వహించుకుంటాం. పార్టీ నాయకులంతా ఏకతాటిపై నడిచి విజయం సాధించడమే మా సిద్ధాంతం.

రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ ప్లీనరీ సమావేశాలు మంగళవారంతో పూర్తి చేసుకున్నాం. బుధ, గురు, శుక్రవారాల్లో జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలు మిగతా పార్టీల ప్లీనరీ సమావేశాలకు భిన్నంగా ఉంటాయి. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులుగా ఉన్న కార్యకర్తల నుంచి నామినేటెడ్‌ పదవులు పొందిన నేతలు, ప్రజా ప్రతినిధులు అందరూ ఈ సమావేశాలకు హాజరవుతారు.

మొదటి రోజు పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభ ఉపన్యాసంతో ప్లీనరీ ప్రారంభమై రెండవ రోజు చివర ఆయన ఉపన్యాసంతోనే ముగుస్తుంది. ప్లీనరీలో వివిధ అంశాలపై చర్చించి ముఖ్యమైన అంశాలపై తీర్మానాలు చేస్తాం. పార్టీ నియమావళిలో కొన్ని సవరణలు ప్రతిపాదించి, వాటికి ప్లీనరీ ఆమోదం కోరుతాం. ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్న నాయకులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సమన్వయంతో సమష్టిగా పని చేసి ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేస్తాం. ‘కిక్‌ బాబు.. గెట్‌ ద పవర్‌.. సర్వ్‌ ది పీపుల్‌’అనే నినాదంతో 2024లో జరిగే ఎన్నికలకు వెళతాం. 175 సీట్లకు 175 సీట్లు కైవసం చేసుకుంటాం.     
– వి.విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత

భవిష్యత్‌ చిత్రపటాన్ని ఆవిష్కరించే ప్రయత్నం 
ఐదేళ్ల క్రితం ఇదే మైదానంలో వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలు చారిత్రకంగా, విభిన్న రీతిలో జరిగాయి. నవరత్నాల పేరుతో పార్టీ అజెండాను పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ విడుదల చేశారు. నవరత్నాలే.. మాకు వేద మంత్రాలయ్యాయి. వాటినే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. దేశ చరిత్రలో అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే మేనిఫెస్టోలో పెట్టిన హామీలలో 95 శాతం అమలు చేసిన ఘనత వైఎస్సార్‌సీపీకి, సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కుతుంది.

ఆచరణలో కూడా ఇంతటి నిబద్ధత కలిగిన నాయకుడితో ప్రయాణం చేస్తున్నందుకు పార్టీ శ్రేణుల నుంచి నాయకుల వరకు అందరం గర్వపడుతున్నాం. ఇదే ప్రాంగణంలో మరోసారి ప్లీనరీ  నిర్వహించడం సంతోషకరం. మరింత మెరుగైన రీతిలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు వారి భవిష్యత్‌ చిత్రపటాన్ని ఆవిష్కరించే ప్రయత్నం ప్లీనరీ సమావేశాల్లో చేస్తాం. రాష్ట్ర భవిష్యత్, చరిత్ర ఇకముందు వైఎస్సార్‌సీపీతో ముడిపడి ఉంది.

వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధించి మరోసారి అధికారంలోకి రాబోతున్నాం. పేదలు, ప్రజల ఆకాంక్షలను వైఎస్సార్‌సీపీ నెరవేరుస్తోంది. కోట్లాది మంది ప్రజలు సీఎం వైఎస్‌ జగన్‌ను తమ హృదయాల్లో పెట్టుకున్నారు కాబట్టే వైఎస్సార్‌సీపీ ప్రయాణం, ప్రస్థానం ఇలా నడుస్తూనే ఉంటుంది. ఇది కేవలం పార్టీ ప్లీనరీ కాదు. ప్రజల అజెండాపై చర్చించి నిర్ణయాలు తీసుకునే వేదిక. అధికారంలోకి వచ్చాక జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయదుందుభి మోగిస్తోంది.

రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై 80 నుంచి 90 శాతం పైగా వైఎస్సార్‌సీపీ గుర్తు ఉండిపోయింది. ఇంత ఘనత కలిగిన పార్టీ కాబట్టే జూలై 8, 9న జరిగే ప్లీనరీకి వార్డు స్థాయిలో పోటీ చేసిన వారి నుంచి.. అందరినీ తన సంతకంతో కూడిన లేఖ ద్వారా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆహ్వానించడం చరిత్రాత్మకం. ఒకవేళ ఎవరికైనా ఆహ్వానం అందకపోతే.. స్థానిక నాయకులు చొరవ తీసుకుని ఆహ్వానాలు ఇవ్వడంతో పాటు కార్యకర్తలంతా ఈ ప్లీనరీకి హాజరయ్యేలా చూడాలి.   
 – సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) 

మరిన్ని వార్తలు