పరిహారం.. దరహాసం | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 25 2023 8:56 AM

స్టీల్‌ప్లాంట్‌ నమూనాను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (ఫైల్‌) - Sakshi

జమ్మలమడుగు: ఉక్కు నగరానికి బీజం పడింది. 16 ఏళ్ల నాటి కల సాకారం దిశగా అడుగులు పడ్డాయి. వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్‌ గ్రూప్‌ సారథ్యంలో ఈ నెల 15న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, జిందాల్‌ కంపెనీ ఎండీ సజ్జన్‌ జిందాల్‌ చేతుల మీదుగా స్టీల్‌ప్లాంట్‌ పనులు ప్రారంభించడానికి శ్రీకారం చుట్టారు. భూములు కొల్పోయిన రైతులకు పరిహారం పంపిణీ జరిగింది. దీంతో భూనిర్వాసితుల మోములో ధరహాసం తొణికిసలాడుతోంది. ఇప్పటికే రెండు ఎకరాల భూములు కొల్పోయిన రైతులకు పరిహారం అందించారు. ఎకరా భూమి కొల్పోయిన రైతుల ఖాతాల్లో సైతం డబ్బులు జమ అయ్యాయి. స్టీల్‌ ప్లాంట్‌ కోసం పూర్తిగా భూములు కొల్పోయిన వారి వివరాలను సేకరిస్తున్నారు.

2019 డిసెంబర్‌లో శంకుస్థాపన..

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తామని ఎన్నికల సమయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అధికారం వచ్చిన ఆరునెలల్లోనే జమ్మలమడుగు మండలం కన్యతీర్థం వద్ద 2019 డిసెంబర్‌ 23 వతేదీన శంకుస్థాపన చేసి శిలాఫలకం వేశారు. వెంటనే 3148 ఎకరాలు, మరో 409 ఎకరాల డీకేటీ భూమిని కేటాయించారు. వైఎస్సార్‌స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం డీకేటీ భూములు కొల్పోయిన 178 మంది రైతుల వద్ద నుంచి 391.44 ఎకరాల భూమిని సేకరించారు. ఎకరాకు 7.5 లక్షల వంతున 29కోట్ల 35 లక్షల రూ.80వేలు రైతుల ఖాతాల్లో గతేడాది సెప్టెంబర్‌లోనే జమ చేశారు.దీంతో వారు ఆనందం వ్యక్తం చేశారు.


కేబినెట్‌ సబ్‌కమిటీ ఆమోదంతో మరి కొందరికి...

మండలంలోని రైతులకు 7వ అసైన్డ్‌ కమిటీలో భూములు కేటాయించారు. అయితే వారికి ఎలాంటి పట్టాలు ఇవ్వలేదు. తమకు కూడా పరిహారం ఇప్పించాలని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే మూలె సుధీర్‌రెడ్డిల వద్ద మొరపెట్టుకున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.దీంతో లబ్ధిదారులకు సైతం పరిహారం అందించేందుకు కెబినెట్‌ సబ్‌ కమిటీ అమోదం తెలిపింది. పట్టాలు లేకపోవడంతో వారికి 50శాతంతో పరిహారం అందించాలని నిర్ణయించింది. ప్రతి రైతుకు 3.75లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 7వ విడతలో 379 మంది రైతులకు 3.75 లక్షల వంతున రూ. 14కోట్ల,56లక్షల 46వేల పరిహారం ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికే 250 మందికిపైగా ఎకరా భూమి ఉన్న రైతుల ఖాతాల్లో 3.75 లక్షల వంతున డబ్బులు జమ అయ్యాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement