అకాల వర్షం.. రైతుకు నష్టం | Sakshi
Sakshi News home page

అకాల వర్షం.. రైతుకు నష్టం

Published Sat, Mar 18 2023 1:10 AM

వైకోట అటవీ సమీప ప్రాంతంలో నేలకొరిగిన అరటిచెట్లు   - Sakshi

సాక్షి నెట్‌ వర్క్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన తేమ గాలుల ప్రభావంతో అన్నమయ్య జిల్లాలో రెండు రోజులుగా అకాల వర్షాలు పడుతున్నాయి. జిల్లా పరిధిలోని రామసముద్రంలో 29.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా పెద్దతిప్పన సముద్రంలో 28, తంబళ్లపల్లిలో 22.4, వీరబల్లి 20.2, బి కొత్తపేటలో 19.2, పెద్దమండెంలో 16.6, ములకల చెరువు 15.8, మదనపల్లి 15.6, వాల్మీకిపురంలో 13.2, గాలివీడు మండలంలో 10.2 మిల్లీమీటర్లు వంతున వర్షం కురిసిందిఈదురుగాలులకు జిల్లాలోని మదనపల్లె తంబళ్లపల్లె పీలేరు నియోజకవర్గాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మదనపల్లె పట్టణంలోని ఎంఎల్‌ఎల్‌ ఆస్పత్రి నుంచి మోతీనగర్‌కు వెళ్లే రహదారి, ఎన్‌జేఆర్‌.కల్యాణమండపం, ప్రశాంత్‌నగర్‌, సుందర్‌రాజ్‌ పెట్రోల్‌బంక్‌ ఎదురుగా, ఎన్‌టీఆర్‌ సర్కిల్‌లో పలులోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. రోడ్లపై వడగళ్లు పెద్దసైజులో పడుతుండటంతో ప్రధానరహదారిపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు రెండుగంటల సేపు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. మదనపల్లె మండలంలో గురువారం సాయంత్రం కురిసిన వడగండ్లు, గాలివాన బీభత్సానికి 130 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు హార్టికల్చర్‌ ఆఫీసర్‌ ఈశ్వర్‌ప్రసాద్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మండలంలోని బసినికొండ పంచాయతీ గంగన్నగారిపల్లెలో అగ్రికల్చర్‌ అడ్వైజరీ బోర్డ్‌ చైర్మన్‌ కత్తిరాజుతో కలిసి నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈశ్వర్‌ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. అకాలవర్షం, వడగళ్ల దెబ్బకు 130 ఎకరాల పంటనష్టం జరిగిందని అంచనా వేయగా..అందులో టమాటా..110, బొప్పాయి..6, అల్లనేరేడు..6, మామిడి..3, తమలపాకులు..2, బీన్స్‌...2 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్లు గుర్తించామన్నారు.

● వాల్మీకిపురం మండలంలో దాదాపు 50 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. మండలంలోని ప్యారంపల్లి, జర్రావారిపల్లి, ఓబులంపల్లి, ఫత్తేపురం తదితర ప్రాంతాల్లో టమోటా, మిరప, బొప్పాయి తదితర పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

● ఓబులవారిపల్లె మండలం వైకోట అటవీప్రాంత సమీపంలో కురిసిన అకాల వర్షం, గాలులకు అరటి తోటలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. కర్భూజ, దోస పంటలకు నష్టం వాటిల్లింది. దాదాపు 5 ఎకరాల్లో అరటి తోట దెబ్బతింది.

● నిమ్మనపల్లె మండల పరిధిలో శుక్రవారం సాయంత్రం వడ్లగండ్ల వర్షం కురిసింది. కొందరు గిన్నెలు,దోసిళ్లల్లో వాటిని పట్టుకున్నారు. గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి మండలంలో ఉద్యానపంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులు నష్టపోయారు. మామిడి, టమాటా, బొప్పాయి తదితర పంటలు నేలకూలాయి. రైతుభరోసా కేంద్ర సిబ్బంది సంబంధిత గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టం అంచనా వేస్తున్నారు. మండలపరిధిలో 80 ఎకరాలకు పైగా ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. ఇందులో టమాటా..66, బొప్పాయి..6, మామిడి..3, మిరప..2, బెండ..3 ఎకరాల్లో దెబ్బతింది.

మండలం కురిసిన వర్షం(మి.మీ )

దెబ్బతిన్న ఉద్యాన పంటలు

రామసముద్రంలో 29.2, గాలివీడులో 10.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు

నిమ్మనపల్లె: నేలకొరిగిన బొప్పాయిపంట
1/1

నిమ్మనపల్లె: నేలకొరిగిన బొప్పాయిపంట

Advertisement
Advertisement