సర్కారు బడి.. సరికొత్త ఒరవడి | Sakshi
Sakshi News home page

సర్కారు బడి.. సరికొత్త ఒరవడి

Published Tue, Apr 25 2023 11:50 PM

పీఎంశ్రీకి ఎంపికై న సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాల  - Sakshi

మదనపల్లె సిటీ: ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయిలో వసతులను కల్పించి నాణ్యమైన విద్యాబోధన చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పథకానికి శ్రీకారం చుట్టింది. 2021–22 యూడైస్‌ ఆధారంగా విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ అధికంగా ఉండటం, క్రీడాసామగ్రి, ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు, పక్కా భవనాలు, గ్రంథాలయం, బాల బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు, విద్యుత్‌, తాగునీటి సౌకర్యం కలిగి ఉన్న పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. పీఎం శ్రీ పథకం కింద జిల్లాలోని పలు పాఠశాలలను ఎంపిక చేసి నిధులను మంజూరు చేయనుంది. ఈ పథకంలో అయిదేళ్లు వరకు ఆర్థిక, సాంకేతిక సహకారం అందుతుంది.

జిల్లాలో 28 పాఠశాలలు ఎంపిక

మూడంచెల ప్రక్రియ ద్వారా 28 పాఠశాలలను ఎంపిక చేశారు. ఆయా బడుల్లో నిర్దేశించిన నమూనాలో సంబంధిత వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. కేంద్ర విద్యాశాఖ బృందాలు ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదైన దరఖాస్తుల ఆధారంగా తనిఖీలు నిర్వహిస్తాయి. నిబంధనలకు అనుగుణంగా ఉన్న పాఠశాలలను ఎంపిక చేశారు. యూడైస్‌ 2021–22 విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని వీటి ఎంపిక జరిగింది. జిల్లా వ్యాప్తంగా 28 పాఠశాలలను ఎంపిక చేశారు.

ప్రయోజనాలు ఇవీ

● పీఎంశ్రీ కింద ఎంపిక చేసిన పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు కేటాయిస్తుంది.

● డిజిటల్‌ పద్ధతిలో బోధన, ప్రయోగశాలలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తారు.

● ఉపాధ్యాయులకు శిక్షణతో పాటు ఆర్థిక, సాంకేతిక సహకారం అందుతుంది.

● నిపుణుల కమిటీ ద్వారా ఎంపిక చేసిన తరువాత ఆయా పాఠశాలలకు విడతల వారీగా నేరుగా నిధులను అందజేస్తారు. ఈ నిధులతో విద్యార్థులకు అవసరమైన సాంకేతిక సాధనాలను సమకూర్చుకోవచ్చు. స్కూళ్లను పర్యావరణ అనుకూల గ్రీన్‌ స్కూల్స్‌గా మార్చాల్సి ఉంటుంది. పాఠశాలలో సోలార్‌ పానెళ్లను, ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేసుకోవాలి. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి స్వయంగా సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు పండించాలి.

● పాఠశాలను ప్లాస్టిక్‌ రహితంగా మార్చాలి. పర్యావరణ పరిరక్షణ కోసం సంప్రదాయ విధానాలను విద్యార్థులకు నేర్పించాలి.

● విద్యార్థుల అభ్యసన ఫలితాల నైపుణ్యాన్ని సాధించడంపై దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది.

● పాఠశాలల్లో ల్యాబ్‌లు, స్మార్ట్‌ క్లాసు రూములు, లైబ్రరీలు, స్పోర్ట్స్‌ ఎక్విప్‌మెంట్‌, ఆర్ట్‌రూము మొదలైన ఆధునిక మౌలిక సదుపాయాలు ఉంటాయి. పాఠశాల విద్య మరింత బలోపేతం అయ్యేందుకు పీఎంశ్రీ దోహదపడుతుంది.

తరగతి గదిలో మార్పులు

పీఎంశ్రీ పథకం ద్వారా ఎంపికై న పాఠశాలల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. మౌలిక వసతులు అందుతాయి. స్మార్ట్‌ క్లాసులు, క్రీడాసామగ్రి, లైబ్రరీ వంటివి సమకూరుతాయి. విద్యార్థులకు గుణాత్మక విద్య అందుతుంది. –పురుషోత్తం, జిల్లా విద్యాశాఖాధికారి.

వసతులు మెరుగుపడతాయి

పీఎంశ్రీ పథకంతో మరిన్ని వసతులు సమకూరుతాయి. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అయ్యాయి. పీఎంశ్రీతో మరిన్ని సదుపాయాలు వస్తాయి.

–ఎం.వెంకటకృష్ణారెడ్డి, ఆర్‌జేడీ, పాఠశాల విద్యాశాఖ

ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్‌ స్థాయిలో వసతులు

విద్యాభివృద్ధికి పీఎంశ్రీ పథకం

జిల్లాలో 28 పాఠశాలలు ఎంపిక

1/3

2/3

3/3

Advertisement
Advertisement