అద్దె రూపాయి మాత్రమే! | Sakshi
Sakshi News home page

అద్దె రూపాయి మాత్రమే!

Published Sat, Jun 10 2023 10:46 AM

- - Sakshi

రాజంపేట: దాదాపు రూ.10కోట్లు విలువ చేసే పురపాలక స్థలానికి నేటి అద్దె రూపాయే.. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.. అవునండి నిజం .. ఇది ఎక్కడో కాదు.. పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట పట్టణంలోని పాతబస్టాండు నడిబొడ్డున తిరుపతి వైపు ఉన్న వంకదారి సత్యనారాయణ పెట్రోలు బంకు కథ.. కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ టౌన్‌గా పిలువబడే రాజంపేటలో ఇంటి బాడుగులు ఆకాశంలో ఉంటాయి. అలాంటిది ఏకంగా 19సెంట్ల స్థలానికి 69 ఏళ్లుగా కొనసాగుతున్న రూపాయి అద్దె వ్యవహారం బట్టబయలైంది. ఈ విషయాన్ని పురపాలకసంఘం కౌన్సిల్‌ సీరియస్‌గా తీసుకుంది. ఈమేరకు శుక్రవారం చైర్మన్‌ పోలా శ్రీనివాసులరెడ్డి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్‌లో ఈ పెట్రోలు బంకును స్వాధీనం చేసుకోవాలని తీర్మానం చేశారు.

లీజు వ్యవహారం ఇలా..
1954లో సర్వే నంబరు 961/ఏలో రాజంపేట పురపాలకసంఘం(అప్పట్లో మేజర్‌ పంచాయతీ)కి సంబంధించిన 19 సెంట్ల స్థలాన్ని వంకదారి సత్యనారాయణ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చారు. అప్పట్లో కేవలం రూపాయి అద్దెతో ఆ స్థలాన్ని కేటాయించారు. అయితే నేటి వరకు అలాగే కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ స్థలంలో పెట్రోలు బంక్‌ను ఏర్పాటు చేశారు. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ లీజుకు తీసుకుంది. స్థలానికి సంబంధించి అగ్రిమెంట్‌ కూడా చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్‌ కాలం ముగిసి కొన్ని సంవత్సరాలు అవుతోంది.

నోటీసులు ఇచ్చినా కానరాని స్పందన..
సుమారు 40 సంవత్సరాలుగా రూపాయి కూడా అద్దె చెల్లించకుండా ఉచితంగా పెట్రోలు బంకు నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో చైర్మన్‌ పోలా రంగప్రవేశం చేశారు. కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి నోటీసులు జారీ చేశారు. వెంటనే స్థలాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. ఇందుకు నిర్వాహకులు రెండు మాసాలు గడువు కోరారు. రెండు నెలలు పూర్తి అయినా పెట్రోలు బంకు నిర్వాహకులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు. కేవలం రూపాయి అద్దెతో కోట్లు విలువ చేసే స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు తమ ఆధీనంలో ఉంచుకోవడంతో మున్సిపాలిటీ లక్షల రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది.

పురపాలక స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం
పురపాలక సంఘం నిబంధనల మేరకు స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం. ఆ విధంగానే కౌన్సిల్‌ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. స్థలం నిర్వాహకులకు అనేక మార్లు నోటీసులు ఇచ్చారు. వారు ఏ మాత్రం స్పందించలేదు. పురపాలక సంఘం స్థలాన్ని స్వాధీనం చేసుకోవడం వల్ల పరోక్షంగా ఆదాయ వనరులు పెంచుకునేందుకు వీలుంటుంది. –పోలా శ్రీనివాసులరెడ్డి,చైర్మన్‌, పురపాలక సంఘం, రాజంపేట

Advertisement
Advertisement